Pradeep Ranganadhan: వివాదంలో డ్యూడ్ టైటిల్...

ABN , Publish Date - May 12 , 2025 | 01:06 PM

సినిమా టైటిల్స్ వివాదాల్లో చిక్కుకోవడం కొత్త కాదు. అయితే... కొన్ని టైటిల్స్ కొందరి మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉండటంతో టైటిల్ మార్చమంటూ సదరు వ్యక్తులు డిమాండ్ చేస్తుంటారు. అలానే కొందరు ఇప్పటికే రిజిస్టర్ చేసిన టైటిల్ ను వేరొకరు ప్రకటిస్తే అది కూడా వివాదానికి తెర తీసినట్టే అవుతుంది. 'డ్యూడ్' టైటిల్ విషయంలో అదే జరుగుతోంది.

ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan) హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ (Mythri movie makers) ఓ చిత్రాన్ని కొంతకాలం క్రితం ప్రకటించింది. తాజాగా శనివారం దానికి 'డ్యూడ్' (Dude) అనే పేరు పెట్టి... దీపావళి కానుకగా, పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తామని ప్రకటించింది. దాంతో ఇప్పటికే 'డ్యూడ్' అనే పేరుతో త్రిభాషా చిత్రాన్ని చేస్తున్న హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న తేజ్ (Tej) ఉలిక్కి పడ్డారు. ప్రదీప్ రంగరాథన్, 'ప్రేమలు' ఫేమ్ మమతా బైజు జంటగా 'డ్యూడ్' చిత్రాన్ని కీర్తిశ్వరన్ దర్శకత్వంలో నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మిస్తున్నారు. దీనికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ టైటిల్ ప్రకటన రాగానే ఒరిజినల్ 'డ్యూడ్' హీరో, డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ తేజ్ స్పందించారు. 'డ్యూడ్' అనే టైటిల్ ను తాము ఏడాది క్రితమే రిజిస్టర్ చేశామని చెప్పారు. సంవత్సర కాలంగా ఈ సినిమా ప్రచారాన్ని అదే పేరుతో చేస్తున్నామని అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థతో ఘర్షణ పడే ఉద్దేశ్యం తమకు లేదని, ఈ విషయాన్ని ఇప్పటికే మైత్రీ మూవీ మేకర్స్ వర్గాల దృష్టికి తీసుకెళ్ళామని చెప్పారు. వారు సానుకూలంగా స్పందిస్తారనే ఆశాభావాన్ని తేజ్ వ్యక్తం చేశారు.


ఫుట్ బాల్ నేపథ్యంలో తాము 'డ్యూడ్' సినిమా తీస్తున్నామని, చివరి షెడ్యూల్ ఒక్కటే బాలెన్స్ ఉందని తేజ్ చెప్పారు. కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో దీన్ని తెరకెక్కిస్తున్నామని, బలమైన భావోద్వేగాలతో సాగే ఈ సినిమాను ఫుట్ బాల్ ప్రేమికుడు స్వర్గీయ కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు అంకితం చేసినట్టు తెలిపారు. రంగాయన రఘు ఫుట్ బాల్ కోచ్ గా నటిస్తున్న ఈ సినిమా చివరి షెడ్యూల్ ను త్వరలోనే ప్రారంభిస్తామని తెలిపారు. ఇప్పటికే సమాంతరంగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని, ఆగస్ట్ లేదా సెప్టెంబర్ లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నామని అన్నారు. ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న రాఘవేంద్ర రాజ్ కుమార్ (Raghavendra Rajkumar) స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్ గానూ వ్యవహరిస్తున్నారని తేజ్ తెలిపారు. శాన్య కావేరమ్మ, మేఘ, మోహిత, అనర్ఘ్య, దీపాలి పాండే, సిరి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు. మరి 'డ్యూడ్' టైటిల్ వివాదంపై మైత్రీ మూవీమేకర్స్ సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Also Read: NTR: నాలుగోత‌రం NTR సినిమా ప్రారంభ‌మైంది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Updated Date - May 12 , 2025 | 01:51 PM