Magic Movie: మరాఠీ 'మ్యాజిక్' కు తెలుగు వారి ప్రచారం...
ABN , Publish Date - Dec 31 , 2025 | 05:35 PM
తెలుగువాడైన రాజు సత్యం నిర్మించిన మరాఠీ చిత్రం 'మ్యాజిక్'. జనవరి 1న విడుదల కాబోతున్న ఈ సినిమాలో జితేంద్ర జోషి హీరోగా నటించాడు. ఈ సినిమా చూడాల్సిందిగా ఎమ్ఎల్సీ అనిల్ కుమార్, దర్శకుడు మెహర్ రమేశ్ కోరారు.
టుత్రీ వెంచర్స్ బ్యానర్ మీద రాజు సత్యం నిర్మించిన మరాఠీ చిత్రం 'మ్యాజిక్' (Magic Movie). జితేంద్ర జోషి హీరోగా నటించిన ఈ మూవీకి రవీంద్ర విజయ కర్మార్కర్ దర్శకత్వం వహించారు. జనవరి 1న ఇది విడుదల అవుతోంది. ఈ సందర్భంగా చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చింది. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మండలి అధ్యక్షురాలు గీతా, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, దర్శకుడు మెహర్ రమేశ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
తొలుత మెహర్ రమేశ్ (Mehar Ramesh) మాట్లాడుతూ, ‘నిర్మాత రాజు సత్యం నాకు మంచి మిత్రుడు. స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ తో నేను చేసిన ‘వీర కన్నడిగ’ చిత్రంలో రాజు నటించాడు. అప్పటి నుంచి మా స్నేహం కొనసాగుతోంది. ఇప్పుడీ ‘మ్యాజిక్’ మూవీని ఆయనే నిర్మించారు. ట్రైలర్ చూశాను. నాకెంతో గ్రిప్పింగ్‌గా అనిపించింది. పూరి గారి చిత్రాల్లో రాజ్ నటించాడు. ఇప్పుడు ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గా మారిపోయారు. బాలీవుడ్ అంతా కదిలి వచ్చి ఈ చిత్రం కోసం సపోర్ట్ చేశారు. హైదరాబాద్‌లోని మరాఠీ ప్రేక్షకులకు కూడా స్క్రీన్స్ ఉంటాయి. ఇక్కడి వారంతా ‘మ్యాజిక్’ మూవీని చూసి సక్సెస్ చేయండి’ అని కోరారు. ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ (MLC Arun Kumar) మాట్లాడుతూ, 'ఇండియన్ సినిమాల్లో మరాఠీ ఇండస్ట్రీకి ప్రత్యేక స్థానం ఉంది. అక్కడి నుంచి అద్భుతమైన ఆర్టిస్టులు వచ్చారు. అలాంటి ఇండస్ట్రీ నుంచి నేరుగా ‘మ్యాజిక్’ సినిమా రాబోతోంది. రిలీజ్‌కు ముందే ప్రపంచ వ్యాప్తంగా 9 అంతర్జాతీయ అవార్డుల్ని ఇది దక్కించుకుంది. ఈ మూవీకి జెన్యూన్‌గానే హిందీ ఇండస్ట్రీ అంతా సపోర్ట్ చేసింది. ఇదొక మంచి చిత్రం. కేవలం మరాఠీలోనే కాకుండా అన్ని భాషల్లోకి ఈ చిత్రం వెళ్లాలి. సైకలాజికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన 'మ్యాజిక్' జనవరి 1న రిలీజ్ కాబోతోంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.
హీరో జితేంద్ర జోషి (Jitendra Joshi) మాట్లాడుతూ, ‘ఇందులో నేను పోషించిన పాత్ర చాలా క్లిష్టంగా ఉంటుంది. కరణ్ జోహర్ (Karan Johar), సల్మాన్ ఖాన్ (Salman Khan), బోనీ కపూర్ (Bony Kapor), రణ్‌వీర్ సింగ్ (Ranveer Singh).. ఇలా అందరూ మా కోసం ముందుకు వచ్చి సపోర్ట్ చేశారు. వారంతా రాజు సత్యంని ఎంతో ప్రేమిస్తుంటారు. ఇలా హైదరాబాద్‌కు వచ్చి మా సినిమాని ప్రమోట్ చేస్తుండటం ఆనందంగా ఉంది. రాజు భాయ్ తెలుగువారు. కానీ ముంబైలో సెటిల్ అయ్యారు. నేను మార్వాడి. కానీ పుణెలో సెటిల్ అయ్యాను. కానీ మేమంతా ఆర్టిస్టులుగా ప్రతీ చోటా ప్రేమను పొందుతుంటాం. మా మూవీని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు. చివరగా రాజు సత్యం మాట్లాడుతూ, 'హైదరాబాద్‌లో చాలా మంది మరాఠీలు నివసిస్తున్నారు. అరుణ్ భయ్యా సహకారంతో ఈ ‘మ్యాజిక్’ మూవీని ఇక్కడ రిలీజ్ చేస్తున్నాం. నాకు అండగా నిలిచిన అరవింద్‌కు థాంక్స్. రవీంద్ర చెప్పిన కథ నాకు చాలా నచ్చింది. దాంతో మరాఠీలోనే ఇండిపెండెంట్ ఫిల్మ్‌గా దీనిని నిర్మించాను. మరాఠీలో, హైదరాబాద్‌లో మా చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.