Tollywood: సభ్యత్వాల రద్దును తప్పు పట్టిన కోర్టు
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:58 PM
మొన్నటి వరకూ ఉన్న చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ కమిటీ కొందరు సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేసింది. దీనిపై వారు హైకోర్టుకు వెళ్ళగా కమిటీ నిర్ణయాన్ని కోర్టు తప్పు పట్టింది.
తెలుగు సినీ కార్మికుల నివాసాల కోసం ఏర్పాటైన చిత్రపురి కాలనీ (Chitrapuri Colony) కమిటీ కొన్నేళ్ళుగా అక్రమాలకు పాల్పడుతోందని సభ్యులు ఆరోపిస్తున్నారు. అనైతికంగా మొన్నటి వరకూ కమిటీ వ్యవహరిస్తోందని కొంతమంది సభ్యులు విమర్శలు చేస్తున్నారు. ఈ విషయంలో కోర్టు వెళ్ళిన వారు కొందరైతే సొసైటీస్ రిజిస్ట్రారర్ దృష్టికి ఈ అవకతవకలను తీసుకెళ్ళిన వారు కొందరు. ఈ నేపథ్యంలో పలు మార్లు రిజిస్ట్రారర్ మొట్టికాయలు వేసిన సందర్భాలు, కోర్టులు చివాట్లు పెట్టిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. తాజాగా చిత్రపురి హౌసింగ్ సొసైటీ ఎన్నికలను త్వరలో జరుపబోతున్నారు. ఈ సమయంలో మొన్నటి వరకూ ఉన్న కమిటీకి కంటిలో నలుసులా, కాలిలో ముల్లుగా వ్యవహరించిన కొందరి సభ్యత్వాలను రద్దు చేస్తూ, ఓటర్ల లిస్టులోంచి తొలగించినట్టు తెలిసింది. ఈ విషయమై సదరు సభ్యులు హై కోర్టుకు వెళ్ళారు. తాజాగా హైకోర్టు గత కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ, నాలుగు వారాల్లో చిత్రపురి కాలనీ ఓటర్ల జాబితా నుండి అ్రకమంగా తీసేసిన సభ్యులను తిరిగి లిస్ట్ లో పెట్టేలా చూడమని తెలంగాణ కో-ఆప్ సొసైటీస్ రిస్ట్రారర్ కు ఆదేశాలు జారీ చేసింది. ఇది ఉద్యమకారుల విజయమని చిత్రపురి సభ్యులు తెలిపారు.
ఈ విషయం గురించి మద్దినేని రమేశ్ (Maddineni Ramesh) చెబుతూ, 'చిత్రపురి అవినీతి, అక్రమాలపై గత నాలుగు సంవత్సరాల నుండి ఉద్యమాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. దాదాపుగా ఉద్యమకారులు ఆరోపించిన అన్నీ ప్రభుత్వ అధికారుల కమిటీల్లోనూ, కోర్టులలో కూడా నిరూపణ జరిగింది. ఉద్యమకారులకు అనుకూలంగానే ప్రతిచోట రిపోర్ట్స్, ఆర్డర్స్ వచ్చాయి. దీనితో కక్ష పెంచుకున్న చిత్రపురి మాజీ కమిటీ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ (Vallabhaneni Anil Kumar) తన అక్రమాలను భవిష్యత్ లో కూడా కొనసాగించుకునేందుకు అనుకూలంగా ఉద్యమకారులమైన నాతో పాటు కస్తూరి శ్రీనివాస్, జాస్తి రవీంద్రనాథ్ ఠాగూర్, గాయత్రి తదితరులను చిత్రపురిలో లేకుండా చేయాలని చట్టాలకు, కోర్ట్ ఆర్డర్ లకు వ్యతిరేకంగా చివరి సర్వసభ్య సమావేశంలో అక్రమంగా తీర్మానం పెట్టాడు. సమావేశానికి కోరం లేదు, ఎజెండాలో పేర్లు లేవు, 2/3 శాతం సభ్యులు లేరు, ఎజెండా నెంబర్ 6 పై హైకోర్టు వాయిదా ఉన్నా ఏకపక్షంగా మమ్మల్ని తీసేస్తూ తీర్మానం చేశాడు. దాంతో ఉద్యమకారులమైన మేమంతా గౌరవ తెలంగాణ ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాం. అందరి సభ్యత్వాలు తిరిగి ఓటర్స్ లిస్ట్ లో పెట్టమని కోర్టు ఆదేశించింది. దాంతో చిత్రపురి అవినీతిలో కూరుకుపోయిన వల్లభనేని అనిల్ కుమార్ టీం పై మరో వేటు పడినట్టు అయ్యింది' అని అన్నారు. ఈ మధ్య కాలంలో చెక్కులు పంపి తీసేసిన సభ్యులను కూడా తిరిగి తీసుకోవాల్సిందేనని కోర్టు ఆదేశించినట్టు మద్దినేని రమేశ్ చెప్పారు.