Sankar Kumar: ప్రముఖ కార్టూనిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ శంకు కన్నుమూత
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:05 AM
ప్రముఖ కార్టూనిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్ ఎస్.బి. శంకర్ కుమార్ (శంకు) ఆదివారం ఉదయం హఠాన్మరణం చెందారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి అయిన శంకు కార్టూనిస్టుగానే కాకుండా ప్రముఖ రచయితల కథలను ధారావాహికలుగా రూపొందించారు.
ప్రముఖ కార్టూనిస్టు, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ ఎస్.బి. శంకర్ కుమార్ (శంకు Sanku) ఆదివారం ఉదయం కన్నుమూశారు. 1972లో హైదరాబాద్ లో ఏపీ ఎస్.ఎఫ్.సి. (స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్)లో జూనియర్ అస్టిస్టెంట్ గా కెరీర్ ప్రారంభించారు. బిఎస్సీ, ఎం.ఎ. మేథమెటిక్స్, ఆపై సి.ఎ. చేసిన శంకర్ కుమార్ పిన్నవయసులోనే కార్టూన్లు వేయడం ప్రారంభించారు. అప్పటి ఆంధ్రజ్యోతి సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్యం శర్మ ఈయన పేరును షార్ట్ కట్ చేసి 'శంకు'గా మార్చారు. అదే పేరుతో వేల కార్టూన్లు గీసిన శంకు... పలు అంతర్జాతీయ అవార్డులనూ అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు కు చెందిన శంకు పూర్తి పేరు సంపర భీమ శంకర కుమార్. ఆయన 1946 డిసెంబర్ 16న జన్మించారు.
డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్ గానూ శంకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. దూరదర్శన్ కోసం ఆయన భారతదేశంలో పేరెన్నికన్న కార్టూనిస్టులందరిపై డాక్యుమెంటరీలు తీశారు. బాపు (Bapu) , ఆర్కే లక్ష్మణ్ (RK Laxman), శంకర్ పిళ్ళై, మారియో మిరాండా తదితరులపై 'ఎమినెంట్ కార్టూనిస్ట్స్ ఆఫ్ ఇండియా' పేరుతో లఘు చిత్రాలు తీశారు. అలానే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కోసం 'తెలుగు వెలుగులు' పేరుతో గాయని రావు బాలసరస్వతి దేవి, మల్లు స్వరాజ్యం, పాలగుమ్మి విశ్వనాథం, కాపు రాజయ్య, వెంపటి చినసత్యం తదితరులపై వృత్త చిత్రాలను నిర్మించారు. శంకరమంచి సత్యం (Sankaramanchi Satyam) 'అమరావతి కథలు' లను స్వీయ దర్శకత్వంలో రూపొందించారు. అలానే నేషనల్ ఛానెల్ కోసం మునిమాణిక్యం నరసింహారావు 'కాంతం కథలు' ను 13 ఎపిసోడ్స్ గా రూపొందించారు. దీనికి నాలుగు నంది అవార్డులు వచ్చాయి. ప్రముఖ దర్శకుడు వంశీ (Vamsy) రాసిన 'మా పసలపూడి కథలు' ను టీవీ ధారావాహిక రూపొందించారు. ఇది మాటీవీలో ప్రసారమైంది. ప్రముఖ రచయిత సలీం రచనల ఆధారంగా 26 ఎపిసోడ్స్ తో 'సలీం కథలు'ను రూపొందించారు. దీనికి రెండు నంది అవార్డులు వచ్చాయి. అలా మొత్తం ఆయన తొమ్మిది నంది అవార్డులను అందుకున్నారు.
బహుముఖ ప్రజ్ఞావంతుడైన శంకు... ప్రముఖ దర్శకుడు బాపు రూపొందించిన 'మిస్టర్ పెళ్ళాం' సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. బాపుతో కలిసి తొమ్మిది చిత్రాలకు పనిచేశారు. వివిధ పత్రికలలో వచ్చిన సీరియల్స్ కూ ఆయన ఇన్ స్ట్రేషన్స్ గీశారు. కార్టూనిస్టుగానూ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న శంకు... 'ఏపీ క్రోక్విల్ అకాడమి'ని స్థాపించి, 'క్రోక్విల్ హాస్యప్రియ' పేరుతో మాస, పక్షపత్రికను పన్నెండేళ్ళ పాటు వెలువరించారు. ఆయన గీసిన కార్టూన్లు సైతం సంకలనంగా వెలువడ్డాయి. ఆగస్ట్ 15న రామసత్యనారాయణ ఏకంగా 15 చిత్రాల నిర్మాణానికి పూనుకున్న సందర్భంలో ఆయన్ని శంకు కలిసి అభినందించారు. డీడీ యాదగిరిలో ఆదివారం ఉదయం శంకు ఇంటర్యూ ఒక పక్క ప్రసారం అవుతున్న సమయంలోనే ఆయన మరణవార్త కార్టూనిస్టులను చేరింది. ఆయన భార్య శోభా శంకర్, ఆంధ్రాబ్యాక్ లో పదవి విరమణ చేశారు. దూరదర్శన్ లో ఆమె కొంతకాలం న్యూస్ రీడర్ గా సేవలు అందించారు. శంకు మృతికి పలువురు కార్టూనిస్టులు, రచయితలు తీవ్ర దిగ్భాంతిని వ్యక్తం చేశారు.