The Devil: దర్శన్ కొత్త సినిమాకు రేటింగ్స్, రివ్యూలు లేవు

ABN , Publish Date - Dec 12 , 2025 | 05:38 PM

కన్నడ స్టార్ హీరో దర్శన్ ప్రస్తుతం జైలులో ఉన్నాడు. ఇదే సమయంలో అతని తాజా చిత్రం 'ది డెవిల్' విడుదలైంది. అయితే ఈ సినిమాపై నిర్మాత కోరిక మేరకు కోర్టు ఓ కీలక తీర్పును ఇచ్చింది.

The Devil Movie

కన్నడ చిత్ర పరిశ్రమలో 'ఛాలెంజింగ్ స్టార్' (Challenging Star) గా పేరొందిన నటుడు దర్శన్ (Dharshan). ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'ది డెవిల్' (The Devil) గురువారం భారీ అంచనాల మధ్య విడుదలైంది. నటుడు దర్శన్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు (Parappana Agrahara Central Jail)లో ఉన్నప్పటికీ, ఉదయం తొలి షోలకు అభిమానులు, సాధారణ ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనేక థియేటర్లు (Theatar) అధిక టిక్కెట్ ధరలతో కూడా హౌస్‌ ఫుల్ బోర్డులు ప్రదర్శించాయి. ఈ భారీ స్పందన, దర్శన్ వ్యక్తిగత వివాదాలు ఆయన నటించిన సినిమా వసూళ్లపై, ప్రేక్షకుల్లో ఆయనకు ఉన్న తిరుగులేని మాస్ ఫాలోయింగ్‌పై ఎటువంటి ప్రభావం చూపలేదని మరోసారి నిరూపించింది. అభిమానులు తమ అభిమాన నటుడిని తెరపై చూసేందుకు ఈ సినిమాను ఒక ముఖ్యమైన అవకాశంగా భావించారు. ఇక సినిమా విడుదలకు కీలకమైన సమయంలో హీరో లేకపోవడం వల్ల, ప్రమోషన్ కార్యక్రమాలు ఆయన లేకుండానే జరిగాయి.


ఇక 'ది డెవిల్' విడుదల సమయంలో అత్యంత చర్చనీయాంశమైన అంశం.. ఈ సినిమాకు సంబంధించిన ఆన్‌ లైన్ (Online) అభిప్రాయాలపై కోర్టు (Court) నిషేధం విధించడం. చిత్ర నిర్మాత సినిమా విడుదలైన తొలి రోజుల్లో ఎటువంటి తప్పుడు, ప్రతికూల అభిప్రాయాలు సినిమా వసూళ్లకు ఆటంకం కలిగించకూడదనే ఉద్దేశంతో కోర్టును ఆశ్రయించారు. నిర్మాత అభ్యర్థన మేరకు కోర్టు ఉత్తర్వుల ద్వారా సినిమాకు సంబంధించిన అన్ని ఆన్‌ లైన్ రివ్యూలు (Online Reviews), రేటింగ్‌ (Rating)లు, కామెంట్లు(Coments), సోషల్ మీడియా (Social Media) చర్చలపై తాత్కాలిక నిషేధం విధించారు. ఈ ఆదేశాల కారణంగా, బుక్ మై షో (BookMyShow) వంటి ప్రముఖ టిక్కెట్ బుకింగ్ ప్లాట్‌ ఫామ్‌లు కూడా 'ది డెవిల్' చిత్రానికి సంబంధించిన రేటింగ్, రివ్యూ ఆప్షన్‌లను తొలగించాయి.


అధికారిక రివ్యూలు నిలిపివేయబడినప్పటికీ, సినిమా చూసిన ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన (Mixed Talk) వినిపిస్తోంది. చాలామంది ప్రేక్షకులు దర్శన్ యొక్క ద్విపాత్రాభినయాన్ని (Dual Role), ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌ను, ఫైట్ సీక్వెన్స్‌లను ఎంతగానో మెచ్చుకుంటున్నారు. మరికొందరు ప్రేక్షకులు సినిమా కథాంశం (Storyline), స్క్రీన్‌ప్లే నెమ్మదించడం, రెండవ భాగం నిదానంగా ఉండటం వంటి అంశాలపై అంతగా ఆసక్తి చూపడం లేదు. అధికారిక రివ్యూలు లేనందున, ఎక్స్ (X), ఫేస్‌ బుక్ (Face Book) వంటి సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్‌లలో ప్రేక్షకులు ఇచ్చే ఈ ప్రారంభ స్పందన మాత్రమే సినిమాపై ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడానికి ఇతర ప్రేక్షకులకు ఏకైక మార్గంగా మారింది.

ప్రస్తుతం, నటుడు దర్శన్ తన అభిమాని అయిన రేణుకా స్వామి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో ఉన్నారు. కిడ్నాప్, బాధితుడిపై దాడి, అతడు మరణించడంలో పాలుపంచుకోవడం వంటి తీవ్ర ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. కేసు విచారణలో ఉంది. వెన్నునొప్పి సమస్య కారణంగా ఆయన ఒకసారి వైద్య బెయిల్ తీసుకున్నప్పటికీ, చికిత్స అనంతరం తిరిగి జైలుకు వెళ్లారు. ఈ కేసు తుది తీర్పు కోసం సినీ పరిశ్రమ, అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Updated Date - Dec 12 , 2025 | 05:50 PM