2025 Rewind: ఎంగేజ్ మెంట్... మ్యారేజ్... పేరెంట్ హుడ్

ABN , Publish Date - Dec 31 , 2025 | 07:01 PM

2025లో పలువురు సెలబ్రిటీస్ పెళ్లి పీటలు ఎక్కారు. మరికొందరు తమకిష్టమైన వారితో ఎంగేజ్ మెంట్ జరుపుకున్నారు. కొందరు స్టార్స్ కు పేరెంట్ హుడ్ హోదా దక్కింది.

2025 Rewind

2025లో పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా పలువురు నటీనటులు పెళ్ళి పీటలు ఎక్కారు. ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఆ హోదాకు తిలోదకాలిచ్చారు. కొత్తగా పెళ్ళి చేసుకున్న వారు పేరెంట్ హోదాను పొందారు. ఆ ముచ్చట్లు తెలుసుకుందాం.

కొత్త సంవత్సరం తొలి రోజుల్లోనే బాలీవుడ్ కు పెళ్ళి కళ వచ్చేసింది. జనవరి 2న ప్రముఖ గాయకుడు అర్మాన్ మాలిక్ (Arman Mallik) తన ప్రేమబంధానికి ఫుల్ స్టాప్ పెడుతూ, ప్రియురాలు, ఫ్యాషన్ ఇన్ ఫ్లూయెన్సర్ ఆష్నా ష్రాఫ్ ను మహాబలేశ్వర్ లో వివాహం చేసుకున్నాడు. అదే నెల 19న తమిళ దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు వివాహం ప్రియురాలు షియోనాతో జరిగింది. 'డిమోంటే కాలనీ, డిమోంటే కాలనీ 2, కోబ్రా' చిత్రాలను ఆయన రూపొందించారు. ఇక జనవరి 26న బ్యూటిఫుల్ హీరోయిన్ హరిప్రియ (Haripriya) మగపిల్లవాడికి జన్మనిచ్చింది. ఆమె నటుడు వశిష్ఠ ను 2023లో పెళ్ళి చేసుకుంది.

ఫిబ్రవరి 14న 'కేరింత' ఫేమ్ యువ నటుడు విశ్వంత్ దుద్దుంపూడి (Vishvanth Duddhumpoodi) వివాహం భావనతో జరిగింది. వారి ఎంగేజ్ మెంట్ లాస్ట్ ఇయర్ అయ్యింది. ఇక ఏప్రిల్ 3వ తేదీ ప్రముఖ తమిళ హాస్యనటుడు రెడిన్ కింగ్స్లే తండ్రి అయ్యాడు. అతని భార్య, టీవీ నటి సంగీత ఆడపిల్లకు జన్మనిచ్చింది. వీరి వివాహం 2023లో జరిగింది. ఏప్రిల్ 16వ తేదీ పలు తెలుగు, తమిళ చిత్రాలలో నటించిన అభినయ (Abhinaya) వివాహం బాల్య స్నేహితుడు కార్తీక్ తో హైదరాబాద్ లో జరిగింది. దివ్యాంగురాలైనా అభినయ తన అభినయపటిమతో చిత్రసీమలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. మే 22న హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) తండ్రి హోదాను పొందాడు. అతని వివాహం గత యేడాది నటి రహస్య గోరఖ్ తో జరిగింది. జూన్ 5వ తేదీ బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ రాయగురు (Subhasri Rayaguru) వివాహ నిశ్చితార్థం నిర్మాత అజయ్ మైసూర్ తో హైదరాబాద్ లోని ఫామ్ హౌస్ లో జరిగింది. అజయ్ మైసూర్ గతంలో 'అమ్మరాజ్యంలో కడప రెడ్లు', 'టెన్త్ క్లాస్ డైరీస్' సినిమాలు నిర్మించారు. వీరిద్దరూ కలిసి ఓ మ్యూజిక్ వీడియోలనూ నటించడం విశేషం. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న అక్కినేని అభిమానుల కల నెరవేరింది. అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) చిన్న కొడుకు అఖిల్ (Akhil) పెళ్ళి పీటలు ఎక్కాడు. అతని వివాహం జూన్ 6న జైనాబ్ తో నిరాడంబరంగా జరిగింది. జూలై 16న ప్రముఖ కథానాయిక కియారా అద్వానీ (kiara advani) ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమె వివాహం 2023లో సిద్ధార్థ్ మల్హోత్రాతో జరిగింది.


ఆగస్ట్ 17న ప్రముఖ గాయకుడు, నటుడు రాహుల్ సిప్లిగంజ్ (rahul sipligunj) వివాహ నిశ్చితార్థం హరిణ్యరెడ్డితో జరిగింది. వీరి వివాహం నవంబర్ 27న జరిగింది. ఆగస్ట్ నెల 28న నటి నివేదితా పేతురాజ్ తన వివాహ నిశ్చితార్థం దుబాయ్ కు చెందిన పారిశ్రామిక వేత్త రాజ్ హిత్ ఇబ్రాన్ తో జరిగినట్టుగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. అయితే ఆ తర్వాత కొద్ది నెలలకు ఆమె ఆ ఫోటోలను తొలగించింది. ఆగస్ట్ 29న ప్రముఖ కథానాయకుడు విశాల్ (Vishal), నటి సాయి ధన్సిక వివాహ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. సెప్టెంబర్ 10న ప్రముఖ నటి లావణ్య త్రిపాఠి (Lavanya Tripathi) మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఆమె భర్త వరుణ్‌ తేజ్ (Varun Tej) సోషల్ మీడియా ద్వారా తెలిపాడు. సెప్టెంబర్ 28న 'విరూపాక్ష' దర్శకుడు కార్తీక్ దండు (Karthik Dandu) వివాహ నిశ్చితార్థం హర్షితతో జరిగింది. అదే నెల 30న హీరోయిన్ అవికా గోర్ (Avika Gor) వివాహం ఆమె చిన్ననాటి స్నేహితుడు మిలింద్ చాంద్వానీతో జరిగింది. వీరి ఎంగేజ్ మెంట్ జూన్ లో జరిగింది.


అక్టోబర్ 3న మోస్ట్ క్రేజీ పెయిర్ విజయ్ దేవరకొండ, రశ్మిక వివాహ నిశ్చితార్థం జరిగింది. ఈ విషయాన్ని వారు అధికారికంగా ప్రకటించకపోయినా... మీడియాకు వారి పీఆర్ టీమ్ వార్తను అందించింది. అదే నెల 10న ఎన్టీఆర్ (NTR) బావమరిది, నటుడు నార్నే నితిన్ (Narne Nithin) వివాహం లక్ష్మీ శివానీతో హైదరాబాద్ శివార్లలోని శంకరపల్లిలో జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకకు హాజరై నూతన జంటను ఆశీర్వదించారు. అక్టోబర్ 17న ఆమీర్ ఖాన్ 'దంగల్' చిత్రంలో అతని చిన్న కూతురుగా నటించిన జైరా వసీమ్ వివాహం జరిగింది. అయితే వరుడి పేరు మాత్రం ఆమె వెల్లడించలేదు. అక్టోబర్ 30న నారా రోహిత్ (Nara Rohith) వివాహం నటి శిరీషాతో జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) దంపతులు దగ్గరుండి ఈ వివాహ వేడుకను జరిపించారు. రోహిత్, శిరీష కలిసి 'ప్రతినిధి 2'లో నటించారు. అక్టోబర్ 31న అల్లు శిరీష్‌ (Allu Sirish), నయనిక వివాహ నిశ్చితార్థం కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగింది. అదే రోజున తమిళ చిత్రం 'టూరిస్ట్ ఫ్యామిలీ' దర్శకుడు అభిషన్ జీవింత్ వివాహం అఖిలతో జరిగింది.

నవంబర్ 7వ తేదీన స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె వివాహం నటుడు విక్కీ కౌశల్ తో 2021లో జరిగింది. డిసెంబర్ 1వ తేదీ హీరోయిన్ సమంత (Samantha) వివాహం దర్శక నిర్మాత రాజ్ నిడుమోరుతో జరిగింది. సన్నిహితుల సమక్షంలో వీరి పెళ్ళి కోయంబత్తూరులోని ఈషా యోగ కేంద్రంలోని లింగభైరవి అమ్మవారి దేవాలయంలో జరిగింది. ఇలా ఈ యేడాది పలువురు సెలబ్రిటీస్ జీవితాల్లో కొత్త వసంతాలు చోటు చేసుకున్నాయి.

Updated Date - Dec 31 , 2025 | 07:02 PM