Dadasaheb Phalke: నగలు తాకట్టు పెట్టి భర్త ఫాల్కేతో సినిమా...

ABN , Publish Date - Apr 30 , 2025 | 01:34 PM

భారతీయ చలన చిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే జయంతి కార్యక్రమం భారతి ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో ఇటీవల జరిగింది.

భారతీ ఫిల్మ్ సొసైటీ భాగ్యనగర్ ఆధ్వర్యంలో భారతీయ చలన చిత్ర పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే (Dadasaheb Phalke) జయంతి సభ ఇటీవల శోభాయమానంగా జరిగింది. భాగ్యనగరంలోని ఫిల్మ్ నగర్ కో-ఆపరేటివ్ సొసైటీ ప్రాంగణంలో ప్రొడ్యూసర్ కౌన్సిల్ సమావేశ మందిరంలో దీన్ని నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన తెలుగు చలన చిత్ర దర్శక సంఘం అధ్యక్షులు ప్రఖ్యాత దర్శకుడు వీర శంకర్ బైరిశెట్టి (Veera Sankar Bhairisetty) మాట్లాడుతూ ''ఇలా దాదాసాహేబ్ ఫాల్కే జయంతిని జరపడం నిజంగా ముదావహం. ఇలాంటి కార్యక్రమాలు భారతీ ఫిల్మ్ సొసైటీ సభ్యుల నిబద్ధతను సూచిస్తుంది'' అని అన్నారు. చలన చిత్ర రంగంలో అన్ని రంగాలవారూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా బాగుంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే పాఠశాల స్థాయిలో ఫిల్మ్ అప్రిసియేషన్ వంటి కోర్సులు పెట్టాలని తద్వారా మంచి సినిమాలు వస్తాయని తెలిపారు.

ముఖ్యవక్తగా హాజరైన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ (RSS) దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ ఆయుష్ నడింపల్లి (Ayush Nadimpally) దాదాసాహేబ్ ఫాల్కే జీవిత విశేషాలను వివరించారు. ఇంగ్లాండ్ లో ఇంగ్లీష్ వారు తీసిన సినిమా చూడగానే ఫాల్కే మనసు భారతీయ పురాణాలను చలన చిత్రాలుగా తీయాలని పరితపించిందనీ, అందుకే రెండు మూడు రోజుల పాటూ ఆయన కంటి మీద కునుకు లేనంతగా చలనచిత్రం గురించే ఆలోచిస్తూ ఉండి పోయారని అన్నారు. సినిమాలు ఎలా షూటింగ్ చెయ్యాలో ఇంగ్లాండ్ లో నేర్చుకుని, అక్కడ ఎక్కువ అవకాశాలు, అంతులేని ఆదాయం ఉన్నా, మాతృభూమిపై ప్రేమతో బొంబాయి తిరిగి వచ్చేశారని అన్నారు. ఫాల్కేను స్మరించుకున్న ప్రతిసారీ ఆయన భార్య సరస్వతిని కూడా స్మరించుకోవాలని ఆయుష్ నడింపల్లి చెప్పారు. ఆవిడ తన నగలను తాకట్టు పెట్టి 'రాజా సత్యహరిశ్చంద్ర' సినిమాకు పెట్టుబడి సమకూర్చిందని గుర్తు చేశారు. ఇదే భారతీయ కుటుంబ వ్యవస్థ యొక్క గొప్పతనం అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రతిపాదించిన పంచపరివర్తన్ లో కుటుంబ ప్రభోదన్ ప్రాముఖ్యతని వివరించారు.


దాదాసాహేబ్ ఫాల్కే ఎలాగయితే పురాణ కధలను సినిమాలు గా తీశారో అలాగ ప్రస్తుతం సినిమా ఔత్సాహికులు కూడా మన దేశ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా కధలు తయారు చేసుకోవాలని, మన సంస్కృతి అంటేనే పర్యావరణ అనుకూల విధానమని, మన సంప్రదాయాలు వసుధైక కుటుంబమనే లక్ష్యంతో ఉంటాయని గుర్తు చేసుకోవాలని ఆయుష్ తెలిపారు. పర్యావరణ సంరక్షణ మనకు తరతరాలుగా చెప్పబడిన విషయం అని, అనేక శతాబ్దాలుగా భారతీయ జీడీపీ ప్రపంచంలో మొదటి లేదా రెండవ స్థానంలో ఉన్న సమయంలో కూడా మన వ్యాపార వాణిజ్యాలు పరిశ్రమలు కూడా పర్యావరణ రహితంగా ఉండేవని, ముస్లిం ఆక్రమణదారులు, పాశ్చాత్య ఆక్రమణదారులు వచ్చిన గత శతాబ్దాలలోనే మనకు కరువు వచ్చిందని ఆయన గుర్తు చేశారు. అలాగే పౌర బాధ్యతలను నిర్వర్తించేలా మన సినిమాలు ఉండాలని కోరారు. సమాజం పట్ల నిబద్ధతతో సినిమాలను రూపొందించాలని, దేశం పట్ల ప్రేమ అంటేనే సమాజం పట్ల ప్రేమ అని, అందుకే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ వ్యక్తి నిర్మాణం ద్వారా సమాజ నిర్మాణానికి కృషి చేస్తోందని చెప్పారు. సామాజిక సమరసత, కుటుంబ ప్రబోధన్, స్వదేశీ, పౌర నియమావళి, పర్యావరణ పరిరక్షణ వంటి పంచ పరివర్తన అంశాలుగా సినిమా కుటుంబాలు నడవాలని, ఆ ఆశయసిధ్ధికై ఈ దాదాసాహేబ్ ఫాల్కే జయంతి సందర్భంగా ప్రతిజ్ఞ తీసుకోవాలనీ ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు సునీల్ మహేశ్వరి, ప్రవీణ్ రామరాజు, తెలంగాణ ప్రాంత ప్రచార ప్రముఖ్ కట్టా రాజగోపాల్, చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటులు, దర్శకులు, సంగీత నిపుణులు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. సీతారామరాజు రాజశేఖర్ వందన సమర్పణలో కార్యక్రమం ముగిసింది.

Updated Date - Apr 30 , 2025 | 01:37 PM