Ranveer - Atlee: శ్రీలీల జపంలో ఆ ఇద్దరూ...
ABN , Publish Date - Jul 12 , 2025 | 06:32 PM
ప్రముఖ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ తో జోడీ కడుతున్న శ్రీలీల... డైరెక్టర్ గా అట్లీ... స్పెషల్ రోల్ లో బాబీ డియోల్.. అదేంటి.. ఆల్రెడీ ఐకాన్ స్టార్ తో బిజీగా ఉన్న అట్లీ.. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు అనౌన్స్ చేశాడు అనుకుంటున్నారా!? కాంబినేషన్ అయితే నిజమే.. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది.
సినిమా దర్శకులు కేవలం సినిమాలే కాదు, అప్పుడప్పుడు కార్పొరేట్ యాడ్స్‌లోనూ తమ సత్తా చూపిస్తుంటారు. తక్కువ సమయంలో మంచి రెమ్యునరేషన్ సంపాదించుకునే అవకాశం ఉండటంతో సినిమాల మధ్యలో వాటిని కూడా చేస్తుంటారు. పాన్ ఇండియా దర్శకుడు అట్లీ (Atlee) కూడా అదే బాటపట్టాడు. ఓ పెద్ద జాతీయ బ్రాండ్ యాడ్ కోసం మెగాఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. అయితే యాడ్ అంటే యాడ్ లా కాకుండా చిన్నపాటి హైబడ్జెట్ మూవీలా దీన్ని తీర్చదిద్దబోతున్నట్టుగా తెలుస్తోంది.
అట్లీ డైరెక్ట్ చేసే యాడ్ లో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ (Ranveer Singh), సౌత్ సెన్సేషన్ శ్రీలీల (Sreeleela ) జోడీ కట్టబోతున్నారు. దీన్ని అట్లీ ప్రకటనలా కాకుండా ఒక చిన్న సినిమాలాగా తీర్చిదిద్దుతున్నాడు. ఇంకా ఈ యాడ్‌లో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) కూడా నటించబోతుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఈ ప్రచార చిత్రంలో అదిరిపోయే యాక్షన్‌తో పాటు, పొట్టచెక్కలయ్యే నవ్వులు కూడా ఉంటాయని టాక్ వినిపిస్తోంది.
అట్లీ ఈ యాడ్‌ను తీయడానికి ముందు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తో చేస్తున్న ప్రాజెక్టు మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేశాడు. ఇక రణవీర్ సింగ్ తన స్పై థ్రిల్లర్ ‘ధురంధర్’ (Dhurandhar) టీజర్‌తో అభిమానులను ఫిదా చేసి.. తనదైన శైలిలో అదరగొట్టాడు. మరోవైపు, శ్రీలీల ‘జూనియర్’ (Junior) సినిమాతో థియేటర్లను ఓ ఊపు ఊపడానికి సిద్ధమవుతూనే.. చాలా సినిమాలతో ఊపిరి సలపనంత బిజీగా ఉంది. మొత్తానికి ఈ యాడ్‌తో ఈ స్టార్లు చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేయడానికి అయితే రెడీ అయిపోయారు.