Game Of Thrones: ట్రంప్ వెన్నుపోటు
ABN , Publish Date - May 16 , 2025 | 07:06 PM
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) పలు రంగాలపై విధిస్తున్న 'టారిఫ్స్' ఆందోళన కలిగిస్తున్నాయి. అందులో చిత్రసీమ కూడా సతమతమవుతోంది. ట్రంప్ టారిఫ్స్ కారణంగా ప్రఖ్యాత టీవీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రాన్స్' షూటింగ్ స్పాట్ కు పెద్ద దెబ్బ పడిందని తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) పలు రంగాలపై విధిస్తున్న 'టారిఫ్స్' ఆందోళన కలిగిస్తున్నాయి. అందులో చిత్రసీమ కూడా సతమతమవుతోంది. ట్రంప్ టారిఫ్స్ కారణంగా ప్రఖ్యాత టీవీ సిరీస్ 'గేమ్ ఆఫ్ థ్రాన్స్' (Game Of Thrones)షూటింగ్ స్పాట్ కు పెద్ద దెబ్బ పడిందని తెలుస్తోంది. భారీ స్థాయిలో హాలీవుడ్ మూవీస్ రూపొందించేవారు ప్రేక్షకులకు కనువిందు చేసే ప్రదేశాల కోసం అమెరికా వీడి ఇతర దేశాలకు వెళ్తూ ఉంటారు. అలాంటి ప్రదేశాల్లో అమెరికన్ సినిమా నిర్మాతలు ఎంచుకొనేది క్రొయేషియా (Croatia) దేశమనే చెప్పాలి. ఎందుకంటే క్రొయేషియాలో పొల్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది. అంతేకాదు పలు చారిత్రక ప్రదేశాలు, అనేక ఐలాండ్స్ ఉన్న దేశంగా క్రొయేషియా అలరారుతోంది. అందునా ఇక్కడ చారిత్రకంగా నెలకొన్న కోటలు, గ్రీనరీ ఏ తరహా చిత్రం షూటింగ్ కైనా ఉపయోగకరంగా ఉంటాయి. ఆ కారణంగానే 'స్టార్ వార్స్' డైరెక్టర్ జార్జ్ లుకాస్ (George Lucas) ఇక్కడి చారిత్రక ప్రదేశాలలో తన చిత్రాలను తెరకెక్కించారు. ఆయన బాటలోనే 'గేమ్ ఆఫ్ థ్రాన్స్' మేకర్స్ కూడా క్రొయేషియాలోని డుబ్రోవ్నిక్ (Dubrovnik) ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడ 'గేమ్ ఆఫ్ థ్రాన్స్' షూటింగ్ జరగడం వల్ల ఆ ప్రాంతానికి ఓ స్పెషల్ క్రేజ్ ఏర్పడింది. క్రొయేషియాలోని అన్ని అందమైన ప్రదేశాల కన్నా మిన్నగా డుబ్రోవ్నిక్ నిలచింది. పైగా అక్కడ 'గేమ్ ఆఫ్ థ్రాన్స్' సిరీస్ షూటింగ్ జరుపుకున్నప్పటి నుంచీ పర్యాటకులు కూడా ఎక్కువగా అక్కడి కోటలను, మైదానాలను తిలకిస్తున్నారు. 'గేమ్ ఆఫ్ థ్రాన్స్' క్రేజ్ కారణంగా ప్రతి యేటా డుబ్రోవ్నిక్ కు 14 లక్షల మంది పర్యాటకులు విచ్చేస్తున్నారని అక్కడి టూరిస్ట్ గైడ్స్ చెబుతున్నారు.
సినిమారంగంపై ట్రంప్ విధించనున్న టారిఫ్స్ కారణంగా యూరోపియన్ దేశాల్లో చిత్రీకరించే సినిమాలకు, సిరీస్ కు నూరు శాతం ఎక్కువ పన్నుపడే అవకాశం ఉంది. దాంతో ఇకపై అమెరికన్ సినిమాల చిత్రీకరణ స్టూడియోస్ లోనో, లేక అమెరికాలోని ఇతర ప్రదేశాలలోనో జరుగుతాయి. గతంలో అమెరికన్ సినిమాల కారణంగానే ఎంతో ప్రఖ్యాతి చెందిన క్రొయేషియా దేశంలోని పలు ప్రాంతాలలో షూటింగ్స్ తగ్గే అవకాశం ఏర్పడుతుంది. అది పర్యాకటరంగంపై కూడా ప్రభావం చూపుతుందని పరిశీలకులు అంటున్నారు. ఫలానా చోట సినిమా షూటింగ్ జరిగింది అంటే అక్కడకు పర్యాటకులు కూడా అధికసంఖ్యలో వచ్చే అవకాశం ఉంటుంది. 'గేమ్ ఆఫ్ థ్రాన్స్' క్రేజ్ వల్లే డుబ్రోవ్నిక్ కు పర్యాటకుల సంఖ్య పెరిగిందనీ అక్కడి వారు గుర్తు చేసుకుంటున్నారు. ఇకపై అమెరికన్ సినిమాలు, సిరీస్ అక్కడ చిత్రీకరణ జరుపుకోవని తెలిస్తే మెల్లగా సందర్శకుల సంఖ్య కూడా తగ్గుతుంది. ఈ విషయంలో డుబ్రోవ్నిక్ మేయర్ కూడా స్పందించారు. తమ యూరోపియన్ సిటీ డుబ్రోవ్నిక్ లేకుండా అమెరికన్ సినిమాలను ఊహించడమే కష్టమని ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నారు. మరి ట్రంప్ టారిఫ్స్ గేమ్ ఏ తీరున సాగుతుందో చూడాలి.