Predator: Badlands : వేటలో చిక్కుకున్న వేటగాడి కథ..

ABN , Publish Date - Oct 25 , 2025 | 05:10 PM

సైన్స్ ఫిక్షన్ మూవీ 'ప్రెడేటర్: బ్యాండ్ లాండ్స్' నవంబర్ 7న విడుదల కాబోతోంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచ సినీ ప్రేమికులను ఆకట్టుకున్న ప్రెడేటర్ సీరిస్ లో ఇది సరికొత్తగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.

Predator: Badlands

సైన్స్ ఫిక్షన్ సీరిస్ లలో అత్యంత పాపులర్ పాత్రలలో ఒకటి 'ప్రెడేటర్'. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఇది ప్రేక్షకులకు మంత్రముగ్థులను చేస్తూనే ఉంది. 1987లో మొదటిసారి తెరపై కనిపించి ఈ యౌట్టా జీవి, అప్పటి నుంచి అడవుల్లో, నగరాల్లో, ఆపైన ఇతర గ్రహాలలో తన వేటను సాగిస్తూ పరిణామం చెందుతూ వచ్చింది. ఇప్పుడు ఇదే సీరిస్ కి కొత్త రూపం ఇచ్చిన 'ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్' (Predator: Badlands) నవంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ చిత్రం విశేషం ఏమంటే... వేటగాడే ఇందులో వేటలో చిక్కుకుంటాడు.


అర్నాల్డ్ ష్వార్జెనెగర్ (Arnold Schwarzenegger) ప్రధాన పాత్రలో తొలి 'ప్రెడేటర్' (Predator) మూవీ 1987లో వచ్చింది. అమెజాన్ అడవుల్లో కమాండోలు ఎదుర్కొన్న కంటికి కనిపించని భయానక మృగం కథతో ఇది సాగింది. ఆ తర్వాత ఆ తర్వాత 1990లో వచ్చిన 'ది కాంక్రీట్ జంగిల్ : ప్రెడేటర్-2' (The Concrete Jungle: Predator 2) లో లాస్ ఏంజెల్స్ నగరాన్ని వేట స్థలంగా మార్చుకున్న యౌట్జా.. గ్యాంగ్ స్టర్లను, పోలీసులను లక్ష్యంగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఇరవై యేళ్ళకు వచ్చింది 'ది గేమ్ ప్రిజర్వ్ అండ్ బియాండ్ ప్రెడేటర్స్' (The Game Preserve and Beyond: Predators). ఇందులో మానవ యోధులను ప్రెడేటర్లు స్వగ్రహానికి తీసుకెళ్ళి బంధిస్తారు. అక్కడ వారు సూపర్ ప్రెడేటర్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ కథలో యౌట్జా జాతి అంతర్గత విభేదాలను చూపించారు. ఆ తర్వాత పన్నెండేళ్ళకు 2022లో వచ్చిన 'ఎ రిటర్న్ టు రూట్స్: ప్రే' (A Return to Roots: Prey) సినిమా 1719లో అమెరికాలోని కమాంచీ తెగకు చెందిన యువతి నారు కథతో తెరకెక్కింది. 'ప్రెడేటర్' సీరిస్ కు ఈ సినిమా కొత్త ఊపు తీసుకొచ్చింది. కొత్త కాలం, కొత్త దృష్టికోణంతో వేటను చూపిస్తూ సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది.


ఇప్పుడు మళ్ళీ ఇంతకాలానికి 'ప్రెడేటర్: బ్యాడ్ ల్యాండ్స్' మూవీ వస్తోంది. ఈసారి కథ యౌట్జా యువ ప్రెడేటర్ 'డెక్' చుట్టూ తిరుగుతుంది. డెక్ ఒక ప్రమాదకరమైన గ్రహంలో ఆండ్రాయిడ్ యోధురాలు థియాతో కలిసి జీవన పోరాటం చేయాల్సి వస్తుంది. ఈ కథను మొదటిసారి ప్రెడేటర్ దృష్టిలో చెబుతుండటం విశేషం. యౌట్జా జీవుల అంతర్ముఖ ప్రపంచాన్ని ఈ సినిమా ప్రేక్షకులకు చూపించబోతోంది. వేట అంటే ఏమిటీ? వేటగాడి నైతిక సరిహద్దు ఎక్కడి వరకూ ఉంటుంది? అనే ప్రశ్నలకు సమాధానంగా ఈ సినిమాను నిలువబోతోంది.

Also Read: Ram Pothineni: రామ్ చరణ్ ని చూసి జాలేసింది

Also Read: Alia Bhatt: ఆలియా భట్ ఇంట్లో.. దీపావళి సెల‌బ్రేష‌న్స్‌!

Updated Date - Oct 25 , 2025 | 05:10 PM