Pope: వెండితెరపై పోప్ కథలు!
ABN, Publish Date - May 13 , 2025 | 07:13 PM
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ నిరంతరం ప్రార్థనలు చేసే పీఠాధిపతిగా పోప్ (Pope) ను యావత్ ప్రపంచమూ గౌరవిస్తుంది. అందువల్లే వాటికన్ సిటీలో కేథలిక్ మత పీఠాధిపతిగా కొలువై ఉండే పోప్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతుంది.
ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ నిరంతరం ప్రార్థనలు చేసే పీఠాధిపతిగా పోప్ (Pope) ను యావత్ ప్రపంచమూ గౌరవిస్తుంది. అందువల్లే వాటికన్ సిటీలో కేథలిక్ మత పీఠాధిపతిగా కొలువై ఉండే పోప్ గురించి ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఇతర మతాధినేతలెవ్వరికీ మీడియా సైతం ఇంత ప్రాధాన్యత ఇవ్వడం కనిపించదు. పోప్ ఎన్నిక సైతం ఎంతో గోప్యంగా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యే కేథలిక్ మతాధిపతి 267వ పోప్ గా అమెరికాకు చెందిన రాబర్ట్ ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ (Robert Francis Prevost) ఎన్నికయ్యారు. పోప్ గా ఎన్నిక కాగానే ఫ్రాన్సిస్ ప్రివోస్ట్ పేరును 'పోప్ లియో ఫోర్టీన్' (Pope Leo XIV)గా మార్చుకున్నారు. లియోకు ముందు పోప్ గా ఉన్న పోప్ ఫ్రాన్సిస్ (Pope Francis)ఈ యేడాది ఏప్రిల్ 21న కన్నుమూశారు. ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, పేదలకు, జైలులో ఉన్నవారికి, పాలకులకు అందరికీ దేవుడు తగిన శక్తిని, సహాయాన్ని అందించాలని, అందరికీ విద్య అందాలని ఫ్రాన్సిస్ ప్రార్థించేవారు. అంతేకాదు స్వలింగ వివాహాలను సైతం ఆయన ఆమోదించి సంచలనం సృష్టించారు. ఆయన వారసునిగా ఎన్నికైనా కొత్త పోప్ లియో సైతం అదే తీరున సాగనున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, ఇస్రాయెల్, పాలస్తీనా సమరం సమసిపోవాలని ఆకాంక్షించారు కొత్త పోప్. అలాగే ఇండియా- పాకిస్థాన్ నడుమ కూడా సయోధ్య కుదరాలని, కాల్పుల విరమణ జరగాలని కోరుకున్నారు. ఈ నేపథ్యంలో వెండితెరపై పోప్ కథలతో రూపొందిన చిత్రాలను గుర్తు చేసుకుంటున్నారు సినీ ఫ్యాన్స్.
ముఖ్యంగా దివంగత పోప్ ఫ్రాన్సిస్ సంప్రదాయాలకంటే జనంతో కలసి మెలసి ఉండాలని ఆశించేవారు. ఆయనకు సోషల్ మీడియాలో కోట్లాది మంది ఫాలోవర్స్ ఉండేవారు. అందువల్ల గతించిన పోప్ ఫ్రాన్సిస్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా ఆయన జీవితం ఆధారంగానే పలు చిత్రాలు రూపొందాయి. 2018లో 'పోప్ ఫ్రాన్సిస్ - ఏ మ్యాన్ ఆఫ్ హిజ్ వర్డ్' జనం ముందు నిలచింది. 2019లో వెలుగు చూసిన 'టూ పోప్స్', 2021లో తెరకెక్కిన 'ఫ్రాన్సెస్కో', తరువాతి సంవత్సరం రూపొందిన 'ద లెటర్ - ఏ మెసేజ్ ఫర్ అవర్ ఎర్త్' , 2023లో వచ్చిన 'ఇన్ వియాగ్గియో- ద ట్రావెల్స్ ఆఫ్ పోప్ ఫ్రాన్సిస్' చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాల రూపకల్పన సమయంలో పోప్ ఫ్రాన్సిస్ 'పోప్ ను సూపర్ మేన్ గా చూపించడం సబబు కాదు - ఎందుకంటే పోప్ కూడా సామాన్య మానవుడే - నవ్వుతాడు, ఏడుస్తాడు' అని అన్నారు. ఆ మాటలే ఆయన సింప్లిసిటీని చాటి చెబుతాయి.
ఇక పోప్ ఎన్నిక ఎంతో గుంభనంగా సాగుతూ ఉంటుంది. పోప్ ను ఎన్నుకోవడంలో కార్డినల్స్ మధ్య ఓటింగ్ జరుగుతుంది. సరైన ఓట్లు రాని పక్షంలో ఆ ఓట్లకు నల్లరంగు పులుమి కాలుస్తారు. ఆ పొగ కూడా నల్లగా ఉంటుంది. ఓ చిమ్నీ ద్వారా ఈ పొగ బయటకు వస్తుంది. ఎప్పుడైతే తెల్ల పొగ బయటకు వస్తుందో అప్పుడు కొత్త పోప్ ఎంపిక పూర్తయిందని భావిస్తారు. ఈ అంశాలను సైతం ఆధారం చేసుకొని కొన్ని సినిమాలు రూపొందాయి. వాటిలో కామెడీ డ్రామాగా రూపొందిన 'వి హ్యావ్ ఏ పోప్' (2011), 'ఏంజెల్స్ అండ్ డెమన్స్' (2009), 'కాన్ క్లేవ్' (2024), 'ద యంగ్ పోప్' (2016), 'ద పోప్స్ ఎగ్జార్సిస్ట్' (2023) వంటి చిత్రాలు ప్రేక్షకుల మదిలో మెదలుతున్నాయి. ఏది ఏమైనా దివంగత పోప్ ఫ్రాన్సిస్ పెద్దగా సినిమాలు చూడకున్నా, వినోదానికి వ్యతిరేకి కాదు. అందువల్లే ఆయన జీవితంపై అన్ని సినిమాలు రూపొందాయని చెప్పవచ్చు. మరి కొత్త పోప్ గా వచ్చిన లియో ఫోర్టీన్ ఎంటర్ టైన్ మెంట్ విషయంలో ఏ తీరున వ్యవహరిస్తారో చూడాలని పరిశీలకులు అంటున్నారు.