Avatar: Fire and Ash: ఇండియాలో.. 'అవతార్' భారీ ఈవెంట్
ABN , Publish Date - Oct 23 , 2025 | 01:10 PM
జేమ్స్ కామెరూన్ తాజా చిత్రం 'అవతార్ : ఫైర్ అండ్ యాష్' డిసెంబర్ 19న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఇండియాలో భారీ ఈవెంట్ ను ప్లాన్ చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలలో ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ కు అభిమానులు ఉన్నారో తెలియదు కానీ భారతదేశంలో మాత్రం ఆయనంటే పడిచచ్చిపోయేవారు కోట్లలో ఉంటారు. మరీ ముఖ్యంగా 'అవతార్' సీరిస్ చూసిన తర్వాత జేమ్స్ కామెరూన్ అభిమానులుగా మారిన వారు మరీ ఎక్కువ. ఈ జనరేషన్ ఫిల్మ్ వ్యూవర్స్ ను వేరే కొత్త ప్రపంచంలోకి 'అవతార్'తో తీసుకెళ్ళిపోయాడు జేమ్స్ కామెరూన్.

ఇదిలా ఉంటే జేమ్స్ కామెరూన్ కు భారతదేశమన్నా, ఇక్కడి సినిమాలన్నా ఎంతో అభిమానం. అలానే తెలుగు సినిమా పతాకాన్ని ఆస్కార్ యవనికపై ఎగరేసిన రాజమౌళి అంటే మరీ ఇష్టం. ఈ యేడాది డిసెంబర్ 19న ఇంగ్లీష్ తో పాటు ఐదు భారతీయ భాషల్లో 'అవతార్: ఫైర్ అండ్ యాష్' మూవీ భారీ ఎత్తున్న ఇండియాలో విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఇండియాలో అతి పెద్ద సినిమాటిక్ ఈవెంట్ ను నిర్వహించబోతున్నారు. ఇక దీపావళి రోజున ఈ దేశంలో 'అవతార్' ప్రదర్శితమయ్యే థియేటర్లలో 'ఎ' అక్షరంతో దీపాలను అలంకరించి తమ హర్షాన్ని వెలిబుచ్చారు. మరికొందరు థియేటర్ల ముందు, లోపల కూడా రంగోలీలు తీర్చిదిద్దారు. దీంతో భారతదేశంలోని సినిమా అభిమానులు ఎంతగా 'అవతార్: ఫైర్ అండ్ యాష్' కోసం ఎదురుచూస్తున్నారో అర్థమౌతోంది.
