Brad Pitt: 'బ్రాడ్‌లో.. స్టామినా ఏం తగ్గలేదు!
ABN, Publish Date - May 13 , 2025 | 10:23 PM
ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న కండల వీరుడు బ్రాడ్ పిట్ (Brad Pitt) తాజా చిత్రం 'ఎఫ్ 1' (F1) జూన్ 25న జనం ముందుకు రానుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్ సంపాదించుకున్న కండల వీరుడు బ్రాడ్ పిట్ (Brad Pitt) తాజా చిత్రం 'ఎఫ్ 1' (F1) జూన్ 25న జనం ముందుకు రానుంది. కార్ రేస్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం ట్రైలర్ అలా విడుదలయిందో లేదో ఇలా జనాన్ని కట్టిపడేస్తోంది. ట్రైలర్ చూడగానే ఇందులో పోటీ, వేగం, పశ్చాత్తాపం, విముక్తి - అన్న అంశాలు ఇట్టే కనిపిస్తాయి. 'టాప్ గన్ : మేవరిక్' (Top Gun : Maverick) రూపొందించిన జోసెఫ్ కోసిన్ స్కీ (Joesph Kosinski) దర్శకత్వంలో ఈ 'ఎఫ్ 1' తెరకెక్కింది.
బ్రాడ్ పిట్ ను కథానాయకునిగా ఎంచుకున్నప్పుడు ఆయన రియల్ గా రేస్ కార్ డ్రైవ్ చేయలేకపోతే ఎలా అన్న అనుమానం కలిగిందని డైరెక్టర్ కోసిన్ స్కీ చెప్పారు. అయితే మా అదృష్టం కొద్దీ బ్రాడ్ ఇప్పటికీ మునుపటి స్టామినా చూపిస్తూ రేస్ కార్ ను నడిపి అబ్బురపరిచాడని డైరెక్టర్ వివరించాడు. ఒకవేళ బ్రాడ్ పిట్ గనక డ్రైవ్ చేయలేకపోయి ఉంటే, ప్రాజెక్ట్ ఉండేదో లేదో అని కూడా ఆయన అన్నారు.
ఏంజెలినా జోలీతో విడాకులు, పిల్లల ప్రేమను పొందలేకపోవడం వంటి అంశాలతో నిరాశకు గురైన బ్రాడ్ పిట్ ఈ మధ్యే మరో అమ్మాయితో చెట్టాపట్టాలేసుకు తిరుగుతున్నట్టు సమాచారం. అయితే బ్రాడ్ పిట్ ఫ్యాన్స్ కు 'ఎఫ్ 1' సినిమా ఎంతో సంతృప్తిని కలిగిస్తుందని, వ్యక్తిగతంగా బ్రాడ్ కు సైతం ఈ చిత్రం ఊరటనిస్తుందని పరిశీలకులు అంటున్నారు. మరి జూన్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న 'ఎఫ్ 1'తో బ్రాడ్ ఎలాంటి ఫలితం చేజిక్కించుకుంటాడో చూడాలి.