Laila Movie Review: విశ్వక్ సేన్ 'లైలా' ఎలా ఉందంటే..
ABN , Publish Date - Feb 14 , 2025 | 01:37 PM
విశ్వక్ సేన్ నటించిన 'లైలా'(Laila) మూవీ వేలెంటైన్స్ డే కానుకగా విడుదలైంది. మరి మాస్ కా దాస్ అమ్మాయి వేషం వేసిన ఈ సినిమాను జనాలు ఆదరించారో లేదో తెలుసుకుందాం.
సినిమా రివ్యూ: లైలా (Laila Movie Review)
విడుదల తేదీ: 14-02-2025
నటీనటులు: విశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ(Akanksha sharma), అభిమన్యు సింగ్, సురభి ప్రభావతి, పృధ్వీ రాజ్, పృథ్వీ, కామాక్షి భాస్కర్ల, వినీత్ కుమార్, మిర్చి కిరణ్, సునిశిత్ తదితరులు
సాంకేతిక నిపుణులు
రచన: వాసుదేవ మూర్తి
సంగీతం: లియోన్ జేమ్స్
సినిమాటోగ్రాఫర్: రిచర్డ్ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి
నిర్మాత: సాహు గారపాటి
దర్శకత్వం: రామ్ నారాయణ్ (Ram Narayan)
గత యేడాది విశ్వక్ సేన్ (Vishwaksen) నటించిన మూడు సినిమాలు విడుదలయ్యాయి. మూడూ భిన్నమైన నేపథ్యం కలిగిన సినిమాలే! 'గామి' (Gaami) విడుదల ఆలస్యమైనా... ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత వచ్చిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' (Gangs of Godavari) అతనిలోని మాస్ కోణాన్ని మరోసారి బయటపెట్టింది. మూడో చిత్రంగా 'మెకానిక్ రాకీ' (Mechanic Rocky) వచ్చింది. చిత్రం ఏమిటంటే... ఈ మూడు సినిమాలు కమర్షియల్ గా పెద్దంత విజయాన్ని సాధించలేదు. ఈ నేపథ్యంలో విశ్వక్ సేన్ నటించిన 'లైలా'(Laila) మూవీ వేలెంటైన్స్ డే కానుకగా విడుదలైంది. మరి మాస్ కా దాస్ అమ్మాయి వేషం వేసిన ఈ సినిమాను జనాలు ఆదరించారో లేదో తెలుసుకుందాం.
Laila Story: (Laila Movie Review)
సోనూ (విశ్వక్ సేన్) ఓల్డ్ సిటీలో బ్యూటీ పార్లర్ నడుపుతూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల ఉండే లేడీస్ అంతా అక్కడికే వస్తుంటారు. వాళ్ళందరికీ అవసరం అయితే తనవంతుగా చేస్తుంటాడు సోనూ. ఒకసారి అటుగా వచ్చిన జెన్నీ (ఆకాంక్ష శర్మ)ని చూసి... తొలిచూపు ప్రేమలో పడతాడు. అదే ఏరియాలో ఉండే ఎస్.ఐ. శంకర్ (పృథ్వీ)కి, కబేళాను నిర్వహించే రుస్తుం (అభిమాన్యు సింగ్)కు ఊహించని విధంగా సోనూ శత్రువు అయిపోతాడు. ఇది చాలదన్నట్టుగా అతను చేసిన ఓ మంచి పని చివరకు అతన్ని అరెస్ట్ చేసేందుకు కారణం అవుతుంది. తల్లి చివరి జ్ఞాపకంగా మొదలెట్టిన బ్యూటీ పార్లర్ ను రుస్తుం అనుచరులు ధ్వంసం చేస్తారు. మరోవైపు ఎస్.ఐ. శంకర్ తప్పుడు కేసులో సోనూ ను అరెస్ట్ చేయడానికి తిరుగుతుంటాడు. ఈ టైమ్ లో గత్యంతరం లేక సోనూ... లైలా గా వేషం మార్చుకుని తిరిగి రంగంలోకి దిగుతాడు. సోనూ కోసం వేట మొదలెట్టిన శంకర్, రుస్తుం.. ఇద్దరూ లైలాను చూసి మోహిస్తుంటారు. వారితో ఉన్న వైరానికి సోనూ ఎలా ఫుల్ స్టాప్ పెట్టాడు? తన మీద పెట్టిన తప్పుడు కేసుల నుండి ఎలా తప్పించుకున్నాడు? అనేది మిగతా కథ.
విశ్లేషణ: (Laila Movie Review)
మన హీరోలు చాలామంది సరదాగా కొన్ని సినిమాల్లో అమ్మాయిల గెటప్స్ లో కనిపించారు. కొందరు స్టార్ హీరోలు కథానుగుణంగా లేడీ గెటప్స్ లో కనిపించి ప్రేక్షకులను, ఫ్యాన్స్ ను మెప్పించారు. ఇక నరేశ్ 'చిత్రం భళారే విచిత్రం' సినిమాలో లేడీ గెటప్ తో ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి విజయాన్ని అందుకున్నాడు. కమల్ హాసన్ 'భామనే సత్యభామనే లో, రాజేంద్ర ప్రసాద్ 'మేడమ్'లోనూ ఎక్కువ శాతం లేడీ గెటప్ లోనే కనిపించారు. విశ్వక్ సేన్ 'లైలా' సినిమా చూస్తే ఇవన్నీ కళ్ళ ముందు మెదులుతాయి. విశ్వక్ లేడీ గెటప్ వేయడం అనేది తప్ప మరో కొత్త పాయింట్ ఏదీ ఇందులో లేదు. హీరోలు తమ మీద అభాండాలు పడినప్పుడు మారువేషంలో, జనాలకు కనిపించకుండానో తమ నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటారు. అలా కాకుండా హీరోకి లేడీ గెటప్ వేసి... ఆ పనిని ఇందులో దర్శకుడు చేశాడు. రాసుకున్న కథలో గానీ, తీసిన విధానంలో గానీ ఎలాంటి కొత్తదనం లేదు. పాటల బాణీలు, నేపథ్య సంగీతం చెప్పుకోదగ్గవి కాదు. ఇందులో టైటిల్ సాంగ్ ను విశ్వకే సేనే రాశాడు. పెంచలదాస్ రాసిన 'ఓహో రత్తమ్మా' పాట ఉన్న వాటిలో కాస్తంత బెటర్ సాంగ్. హీరో, హీరోయిన్ల ఇంట్రడక్షన్ సీన్స్, లవ్ సీన్స్, హీరో, విలన్ మధ్య వచ్చే సీన్స్... అన్నీ పరమ రొటీన్ గా ఉన్నాయి.
నటీనటుల విషయానికి వస్తే (Vishawaksen's Laila Movie Review)... విశ్వక్ సేన్ రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ కు న్యాయం చేయడానికి బాగా కష్టపడ్డాడు. ముఖ్యంగా లేడీ గెటప్ లో మెప్పించడం కోసం చాలానే కృషి చేశాడు. అతని బాడీ లాంగ్వేజ్ కు, ఉన్న పర్సనాలిటీకి లేడీ గెటప్ వేసి మెప్పించడం కాస్తంత కష్టమే. అయినా తిప్పలు పడి మెప్పించాడు. హీరోయిన్ ఆకాంక్ష శర్మకు ఇదే ఫస్ట్ మూవీ. గ్లామర్ ట్రీట్ కోసం తప్పితే మరెందుకూ ఆమె పనికి రాలేదు. పృథ్వీ, అభిమన్యు సింగ్ ఇద్దరిదీ ఓవర్ యాక్షనే! వినీత్ కుమార్, మిర్చి కిరణ్, కామాక్షి భాస్కర్ల, సురభి ప్రభావతి ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. నటి సునయన మూవీ ఎండింగ్ లో జడ్జి పాత్రలో మెరిసింది. సోషల్ మీడియాలో సినిమా రంగం మీద, నటీనటులు, దర్శకుల మీద అవాకులు చెవాకులు పేలే సునిశిత్ మీద ఇప్పటికే పలు పోలీసు కేసులు ఉన్నా్యి. ఇందులో అతనికి కీలకమైన పాత్రను దర్శక నిర్మాతలు ఇచ్చారు. ఇలాంటి వారిని ప్రోత్సహించడం చిత్రంగానే అనిపిస్తుంది. అలానే సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో మాట్లాడి, కాంట్రవర్శీ క్రియేట్ చేసిన థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ ది అంత కీలకమైన పాత్రేమీ కాదు. ఈ మూవీ మీద క్రియేట్ అయిన కాంట్రవర్సీ పబ్లిసిటీకి ఉపయోగపడింది అంతే! 'బట్టల రామస్వామి బయోపిక్కు'తో దర్శకుడైనా రామ్ నారాయణ తనకు లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చిత్ర నిర్మాత సాహు గారపాటి మేకింగ్ విషయంలో రాజీ పడకపోయినా... రొటీన్ కథ, కథనాలు 'లైలా'ను దెబ్బకొట్టాయి.
ట్యాగ్ లైన్: అటూ ఇటూ కానీ లైలా!