Aaryan Review: మర్డర్ మిస్టరీ 'ఆర్యన్' సినిమా ఎలా ఉందంటే
ABN , Publish Date - Nov 07 , 2025 | 05:31 PM
తమిళ నటుడు విష్ణు విశాల్ హీరోగా తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర, ఆర్యన్ రమేష్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో లేదో చూద్దాం
సినిమా రివ్యూ: ఆర్యన్ (Aaryan movie Review)
విడుదల తేది: 7–11–2025
తమిళ నటుడు విష్ణు విశాల్ హీరోగా (Vishnu Vishal) తెరకెక్కిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఆర్యన్’. ప్రవీణ్ కె దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోస్, శుభ్ర, ఆర్యన్ రమేష్ నిర్మించారు. శ్రద్ద శ్రీనాథ్, మానస చౌదరి కథానాయికలుగా నటించిన ఈ మూవిలో సెల్వరాఘవన్ కీలక పాత్రధారి. తమిళంలో అక్టోబర్ 31న విడుదలైన ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ ద్వారా సుధాకర్ రెడ్డి తెలుగులో విడుదల చేశారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందో లేదో చూద్దాం
కథ:
ఆత్రేయ (సెల్వ రాఘవన్) ఓ రైటర్. తన రచనా ప్రతిభను గుర్తించలేదని బాధ పడుతుంటాడు. ఓ న్యూస్ ఛానల్‌లో నయన (శ్రధ్ధా శ్రీనాథ్) యాంకర్‌గా ఓ ఫిల్మ్ సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేస్తుండగా ఆత్రేయ ప్రేక్షకుడిలా వచ్చి స్టూడియోని కంట్రోల్ లోకి తీసుకుని తనొక ఫెయిల్యూర్ రైటర్‌నని, తన ప్రతిభను ఎవరూ పట్టించుకోకపోగా అవమానించారంటూ తను అయిదు హత్యలు చేయబోతున్నానని, మొదట తనని తానే చంపుకుంటానని, ఆ తర్వాత మిగిలిన ఐదురుగురిని వరుసగా ఐదురోజుల్లో హత్య చేస్తానని, హత్య చేసే గంట ముందు వారి పేరు చెబుతానని చెప్పి చెప్పినట్లే తనని తాను కాల్చుకుని చనిపోతాడు. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ పోలీస్ ఆఫీసన్ నంది (విష్ణు విశాల్) చేతికి వస్తుంది. ఆ ఆత్రేయ చనిపోయిన తర్వాత వరుసగా ఐదు రోజుల పాటు తను చంపబోయేవారి పేర్లను వివిధ మాధ్యమాల ద్వారా ప్రకటించి చంపుతూ ఉంటాడు. ఆత్రేయ చంపుతున్నది ఎవరిని? వారిని ఎందుకు చంపాలనుకుంటాడు? అసలు ఆత్రేయ రాసిన బుక్స్ ఏమిటి!? ఆత్రేయ ప్రకటించిన వారిలో ఎవరినైనా పోలీసులు కాపాడతారా? అన్నదే కథ.
విశ్లేషణ:
ఏ భాషలో అయినా మర్డర్ మిస్టరీ థ్రిల్లర్స్ కు మంచి ఆదరణ ఉంటుంది. అయితే థ్రిల్లర్స్ అవి రెగ్యులర్‌గా ఉండకూడదు. ఇక్కడే దర్శకుడు ఆసక్తి కరమైన కథ, కథనాలను ఎంపిక చేసుకున్నాడు. అసలు చనిపోయిన వ్యక్తి తను అనుకున్న విధంగా అయిదు మందిని హత్య చేయటం సాధ్యమేనా? అయితే అదెలా అన్నదే కీ పాయింట్. దానికోసం అతను ఎంచుకున్న విధానం ఏమిటి? దానిని ఛేదించే పనిలో పోలీస్ టీమ్ ఎలా పరుగులు పెడుతుంది. దీనినే దర్శకుడు ఆసక్తిగా నడిపించాడు. చనిపోయిన వ్యక్తి మర్డర్ చేయటం అన్నది ఇందులో కొత్త అంశం. అలా అతని ప్లాన్ చేసిన చంపిన నలుగురిలో ఒకరు మిలటరీమేన్ అశోక్, మరొకరు డాన్సర్ రజియా, అలాగే సముద్రాలు కలుషితం కాకుండా ఉండాలనే కోరుకునే యువరాజ్, సోషల్ సర్వీస్ చేసే ఓ నర్స్... వీరంతా వారివారి వృత్తుల్లో డెడికేటింగ్‌గా ఉన్నా ఎలాంటి గుర్తింపు లభించకపోగా సొసైటీ చిన్న చూపు చూస్తూ ఉంటుంది. అందుకే వారిని సెలెక్ట్ చేసి చంపి గుర్తింపు తీసుకురావాలనుకునే పాయింట్ వినడానికి బానే ఉన్నా… చూసే ఆడియన్స్ కు మింగుడు పడని అంశం. గుర్తింపు దొరకని వారిని చంపి వారికి గుర్తింపు తీసుకురావడం అనే పాయింట్ అంతగా తలకెక్కదు. అయితే ఈ లైన్తో సినిమాను దర్శకుడు నడిపించిన తీరు బావుంది. అసలు ఆర్యన్ అంటే ఏంటి? ఆత్రేయ తను రాసిన బుక్ కి ఆ టైటిల్ ఎందుకు పెట్టాడు? అనేది కూడా ఆసక్తిగా ఉంటుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు...
ఇక ఇందులో సిన్సియన్ పోలీసాఫీసర్‌గా విష్ణు విశాల్ ఇమిడిపోయాడు. పోలీస్‌కు ఉండాల్సిన ఫిట్‌నెస్‌తో ఆకట్టుకున్నారు. శ్రద్ద శ్రీనాథ్ టీవీ యాంకర్ పాత్రలో ఫర్వాలేదు. మాసన పాత్ర అలా వచ్చి వెళ్తుంది. సెల్వరాఘవన్ పాత్ర సినిమాకు కీలకం. ఎప్పటిలాగే తను ఆదరగొట్టాడు. మిగిలిన పాత్రధారులు వారి వారి పరిధి మేరకు నటించారు. హరీశ్ కన్నన్ సినిమాటోగ్రఫీ బావుంది. థ్రిల్లర్ కథకు కావలసిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు జిబ్రాన్. అయితే పాటలు ఆకట్టుకునేలా లేవు. నిర్మాణ విలువలు బావున్నాయి. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌కు కొత్త అంశాన్ని జోడించి తెరకెక్కించాడు దర్శకుడు. అయితే ఆ అంశం ప్రేక్షకులకు ఎంత వరకు మెప్పిస్తుందనేదే డౌట్.
ట్యాగ్‌లైన్: చనిపోయిన వ్యక్తి హత్యలు చేస్తుంటే…
రేటింగ్: 2.5/5