Retro Review: సూర్య యాక్షన్ ఎంటర్టైనర్ ఎలా ఉందంటే..
ABN, Publish Date - May 01 , 2025 | 04:33 PM
తమిళ స్టార్ సూర్య (Suriya) కంగువా సినిమాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు. తదుపరి చిత్రం రెట్రోకు కార్తిక్ సుబ్బరాజు దర్శకుడు, పూజా హెగ్డే హీరోయిన్ కావడంతో అభిమానులు సినిమాపై నమ్మకం పెంచుకున్నారు.
సినిమా రివ్యూ: రెట్రో
విడుదల తేది:1–5–2025
తమిళ స్టార్ సూర్య (Suriya) 'కంగువా' సినిమాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు. తదుపరి చిత్రం రెట్రోకు కార్తిక్ సుబ్బరాజు (Karthik Subbaraju) దర్శకుడు, పూజా హెగ్డే హీరోయిన్ (pooja hegde) కావడంతో అభిమానులు సినిమాపై నమ్మకం పెంచుకున్నారు. ఈ సినిమా లుక్ విడుదలైనప్పటి నుంచి క్రేజ్ కూడా బాగానే పెరిగింది. పీరియాడికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ చిత్రం ఎలా ఉంది? సూర్య ఖాతాలో హిట్ పడిందా అన్నది చూద్దాం.
కథ: (Retro Review)
పారి అలియాస్ పార్వేల్ కన్నన్ (సూర్య) చిన్నతనంలోనే పుట్టిన ఊరికి.. తల్లిదండ్రులకు దూరమవుతాడు. అనాథగా ఉన్న అతన్ని గ్యాంగ్‌స్టర్ తిలక్ (జోజు జార్జ్) భార్య దగ్గరకు తీసుకుని పెంచుతుంది. తనకి ఇష్టం లేకున్నా భార్య కోరిక మేరకు తిలక్ అతన్ని కొడుకుగా అనుకుంటాడు. ఓ ప్రయాణంలో ఉండగా తిలక్‌ను శత్రువులు హతమార్చాలని ప్లాన్ చేస్తారు. ఆ ప్రమాదం నుంచి పారి తన తండ్రిని కాపాడతాడు. అప్పటి నుంచి అతన్ని ఐరన్ హ్యాండ్‌గా భావించి కొడుకులా చూస్తాడు. .తిలక్‌తోపాటు పారి కూడా గ్యాంగ్‌స్టర్‌గా ఎదుగుతాడు. చిన్నతనంలో పరిచయమైన రుక్మిణి 15 ఏళ్ల తర్వాత తారసపడటంతో ఇద్దరు ప్రేమించి పెళ్ల్లి చేసుకోవాలనుకుంటారు. పెళ్లి తర్వాత గ్యాంగ్‌స్టర్ జీవితానికి ఫుల్‌స్టాప్ పెడతానని రుక్మిణికి మాటిస్తాడు. ఆ తర్వాత అతనికి ఎదురైన పరిణామాలేంటి? తిలక్‌తో అతనికి వైరం, గోల్డ్ ఫిష్ గొడవ ఏంటి? మళ్లీ హింసాత్మక వృత్తిలోకి ఎందుకు దిగాడు.. ఓ దీవిలో ఉన్న ఊరుకి, పారికి సంబంధం ఏంటి అన్నది కథ.
విశ్లేషణ:
కార్తీక్ సుబ్బరాజ్ ఎంచుకునే కథలు వైవిధ్యంగా ఉంటాయి. కథ ఎలాంటిదైనా కొత్తగా చెప్పాలనుకుంటాడు. న్యూ ఏజ్ స్టైల్లో అతని చిత్రీకరణ ఉంటుంది. అందుకు అతని గత చిత్రాలే ఉదాహరణ. కథలో యాక్షన్ ఉన్నా.. లోపల ఏదో సందేశం ఉంటుంది. ఈ కథ కూడా అంతే. 1960 – 1993ల మధ్య సాగే కథ ఇది. అయితే దీనిని ప్రేమ.. నవ్వు.. యుద్థం.. అని మూడు పార్టులుగా విడదీసి తెరకెక్కించారు. ప్రేమ కోసం హింసకు దూరమైన కథానాయకుడు, మళ్లీ అదే ప్రేమను దక్కించుకోవడానికి అదే దారిలో వెళ్లి యుద్ధం చేయాల్సి వస్తే.. అన్నది ఇందులో ప్రధానాంశం. అలాగే వెనకబడి బానిసలుగా ఉన్న ఓ జాతి లో నవ్వులు పూయించేందుకు అతను పారి ఏం చేశాడన్నది కూడా ఓ లైన్. ప్రేమ, యుద్దం, నవ్వుని కథలో భాగం చేసినా.. కథ నడుస్తున్నంత సేపు దాని తాలూక ఎమోషన్ ఎక్కడా క్యారీ కాలేదు. మూడు అంశాలను బ్యాలెన్స్ చేయడంలో దర్శకుడు కాస్త కన్‌ప్యూజ్ అయ్యాడు. ట్యాగ్‌లైన్‌లో చెప్పినట్లు లవ్ లాప్టర్.. వార్, ధర్మం అంశాలను ఒక్కో చాప్టర్‌లా చెప్పి ప్రేక్షకుడి మైండ్‌ను డైవర్ట్ చేసేశాడు. ముందు ఏం జరగబోతోంది అన్నది కూడా ఊహకు అందేలా ఉంది. కథలో మూడు బలమైన అంశాలు ఉన్నా ఎక్కడా భావోద్వేగం కనిపించలేదు. చిన్నతనంలో పారితో రుక్మిణి పరిచయం మొదలు పెళ్లి పీటలెక్కే వరకూ కథ అంతా సాదాసీదాగా నడుస్తూ విసుగెత్తించేలా ఉంటుంది. పారి జైలుకు వెళ్లడం, రుక్మిణి దూరం కావడంతో కథలో ఘర్షణ మొదలవుతుంది. అక్కడి నుంచి తిలక్ గ్యాంగ్ పారిని వెంబడించడం, రుక్మిణిని వెతకడం ఇవన్నీ కూడా ఆసక్తిగా సాగాయి. దాంతో సెకెండాఫ్‌పై ఇంట్రెస్ట్ కలుగుతుంది. లాఫింగ్ డాక్టర్ ఛాప్లిన్ కన్నన్‌గా పారి ఓ ఐలాండ్‌లో అడుగుపెట్టడంతో ద్వితీయార్థం మొదలవుతుంది. ఆ బ్లాక్ ఐలాండ్ నేపథ్యం.. అక్కడ జరిగే రబ్బర్ కల్ట్ పోటీలు.. ఆ పోటీల పేరుతో అక్కడి రాజు అక్కడున్న జాతిని హింసిస్తున్న తీరు.. అన్నీ ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి కలిగిస్తాయి. అక్కడి గిరిజన జాతి కథ.. జడ ముని గుడి నేపథ్యం.. వాటితో పారికి ఉన్న సంబంధం కథలో ఎమోషన్‌ను పెంచుతుంది. గతం తెలిశాక పారి అక్కడి రాజుపై సిద్థపడటం.. యాక్షన్ సీక్వెన్స్ ఆసక్తికరంగా మలిచారు. కాకపోతే పతాక సన్నివేశాలు అంత ఆసక్తిగా సాగలేదు.
ఇక నటీనటుల విషయానికొస్తే.. పార్వేల్ కన్నన్‌గా సూర్య డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. అయితే సూర్య ఈ మధ్యన వస్తున్న ప్రతి సినిమాలో ఒక్కో లుక్‌ను సెలెక్ట్ చేసుకుంటున్నారు. అలా కాకుండా కథకు యాప్ట్ అయ్యేలా ఆయన లుక్‌పై దృష్టి సారిస్తే బావుంటుంది అనిపిస్తుంది. అయితే కథలో లవ్.. లాప్టర్.. వార్ అని మూడు అంశాలు ఉన్నట్లే డిఫరెంట్ షేడ్స్‌లో కనిపించారు. యాక్షన్ సీన్స్‌లో మాత్రం పీక్స్ చూపించారు. ఇక కథ మొత్తం రుక్మిణి (పూజాహెగ్డే) చుట్టూ తిరుగుతుంది. ఎప్పుడు తెరపై గ్లామర్‌గా కనిపించే పూజా ఇందులో కాస్త డీగ్లామర్ రోల్ చేసింది. భావోద్వేగాలు కలిగిన ఈ పాత్రకు ఆమె వంతు న్యాయం చేసింది. తిలక్ పాత్రధారి జోజు జార్జ్ విలనీ బలంగా అనిపించలేదు. లాఫింగ్ డాక్టర్‌గా జయరామ్ క్యారెక్టర్‌ను బలవంతంగా యాడ్ చేసినట్లు అనిపించింది. ఈ మధ్య కాలంలో జయరామ్ ఇలాంటి సోసో క్యారెక్టర్‌లో చూడలేదు. కొన్ని సన్నివేశాలు ఎందుకు వచ్చాయో తెలీదు. సురేశ్ మీనన్, నాజర్ తదితరులు పరిధి మేరకు నటించారు. కెమెరా పనితీరు 1960–199 సమయానికి తీసుకెళ్ళింది. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం బావుంది. అయితే పాటలు అంతగా ఆకట్టుకోలేదు. నేపథ్య సంగీతం గుర్తు పెట్టుకునేలా ఉంది. నిర్మాణ విలువలు బావున్నాయి. కార్తిక్ సుబ్బరాజు కథల్ని ఇష్టపడే సినీ అభిమానులు ఈ సినిమాతో నిరాశ చెందుతారు. అతని తరహా ట్విస్ట్‌లు కూడా ఈ సినిమాలో మచ్చుకు ఒకటి కూడా లేదు. గోల్డ్ ఫిష్ అంటూ ఈ సినిమా మొదలైంది. ఆ ట్విస్ట్ ఏంటో ఆదరగొట్టేస్తుంది అనుకుంటే.. అదీ తుస్సుమనిపించింది. ఓవరాల్‌గా చెప్పాలంటే సూర్య ఖాతాలో మరో పరాజయం రెట్రో. సూర్య ఈ కథను ఎలా అంగీకరించాడో ఆయనకే తెలియాలి.
రేటింగ్: 2 / 5
ట్యాగ్‌లైన్: రెట్రో.. ప్రేక్షకుల సహనానికి పరీక్ష