Oh Bhama Ayyo Rama Review: సుహాస్‌ నటించిన ఓ భామ.. అయ్యో రామ ఎలా ఉందంటే..

ABN , Publish Date - Jul 11 , 2025 | 03:11 PM

కలర్‌ ఫొటో ఫేం సుహాస్‌ ఎంచుకునే పాత్రలు భిన్నంగా ఉంటాయి. మినిమం గ్యారెంటీ అనేలా ఆయన సినిమాలు ఉంటాయి. తాజాగా ఆయన నటించిన చిత్రం ఓ భామ.. అయ్యో రామ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి సుహాస్‌ ఖాతాలో హిట్‌ పడిందా? అనేది చూద్దాం.  

సినిమా రివ్యూ: ఓ భామ.. అయ్యో రామ (Oh Bhama Ayyo Rama movie review)

విడుదల తేది: 11–7–2025


''కలర్‌ ఫొటో' ఫేం సుహాస్‌ (Suhas)ఎంచుకునే పాత్రలు భిన్నంగా ఉంటాయి. మినిమం గ్యారెంటీ అనేలా ఆయన సినిమాలు రూపొందుతుంటాయి. సుహాస్ తాజా చిత్రం 'ఓ భామ.. అయ్యో రామ'. మాళవిక మనోజ్‌ కథానాయిక. రామ్‌ గోదల దర్శకత్వంలో హర్ష నల్ల నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సుహాస్‌ ఖాతాలో హిట్‌ పడిందా? లేదా - అనేది చూద్దాం.

కథ: (Oh Bhama Ayyo Rama Story)

రామ్‌ (సుహాస్‌) చిన్నతనంలోనే తల్లి (అనిత)ను కోల్పోతాడు. తండ్రికి (రవీంద్ర విజయ్‌ ) రామ్‌ అంటే గిట్టదు. అతన్ని దూరం పెడతాడు. తల్లి మరణించడంతో మేనమామ (అలీ) రామ్ బాధ్యత తీసుకుంటాడు. అక్కడి నుంచి రామ్‌కి ఏ లోటు లేకుండా చూసుకుంటాడు.  రామ్  దర్శకుడు కావాలనేది అతని తల్లి కల. కానీ అతను సినిమాలకు దూరంగా ఉంటూ పెద్ద చదువుల కోసం ఫారెన్‌ వెళ్ళాలనుకుంటాడు. సత్యభామ (మాళవిక మనోజ్‌) అనే అమ్మాయి రాకతో రామ్ జీవితం మారిపోతుంది. అమ్మ లేని లోటును సత్యభామ తీరుస్తుంది. ఆమె రాక అతనిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది. సినిమాలకు దూరంగా ఉండే అతను ఆ దిశగా అడుగులు వేయడానికి కారణమేంటి?  సినిమా డైరెక్టర్‌ కావాలానే తల్లి కోరికకు అతను ఎందుకు దూరంగా ఉన్నాడు?  రామ్‌, సత్యభామల ప్రేమ కథ  కంచికి చేరిందా లేదా? అన్నది కథ.


O-bhama.jpg

విశ్లేషణ:

కెరీర్‌, మదర్‌ సెంటిమెంట్‌తో కూడిన లవ్‌స్టోరీ ఇది. సింపుల్‌ కాలేజీ కుర్రాడి కథగా మొదలై ప్రేమ, భావోద్వేగాల వైపు నడుస్తుంది. కథగా చూసినప్పుడు ఫస్టాఫ్‌లో హీరోయిన్‌ యాక్సిడెంట్‌, దాని నుంచి కాపాడటం, ఆమె హీరోకి ఫిదా కావడం, అతని వెంట పడటం, అతనికి దగ్గరై సరదాగా తిరగడం వంటి సన్నివేశాలు పాత చింతకాయ పచ్చడి అనిపిస్తాయి. హీరో-హీరోయిన్‌, స్నేహితుల మధ్య సాగే ప్రతి సన్నివేశం రొటీన్‌గానే సాగింది. అందులో కాస్త వేరియేషన్‌ చూపించి కొత్తగా ప్లాన్‌ చేసి ఉంటే ల్యాగ్‌, రొటీన్‌ అనే భావన కలిగేది కాదు. లవ్‌ ట్రాక్‌, రొమాన్స్‌ కూడా జస్ట్‌ ఓకే అనేలా ఉన్నాయి. ఇంటర్వెల్‌లో ట్విస్ట్‌ కొంత వరకూ ఫర్వాలేదు. సెకండాఫ్‌ నుంచి కథ సీరియస్‌ ట్రాక్‌లోకి వెళ్తుంది. మేనల్లుడి మీద బాధ్యతగా వ్యవహరించే అలీ పాత్ర ఎమోషన్‌గా సాగుతుంది. హీరో తల్లి మరణించడం, రామ్‌ని దగ్గరకు తీసుకోవడం అల్లుడి కోసం పెళ్ళి చేసుకోకపోవడం వంటి సీన్లు భావోద్వేగాన్ని కలిగిస్తాయి.  సెంటిమెంట్‌ కూడా బాగానే వర్కవుట్‌ అయింది. పూర్తిగా కమర్షియల్‌ ఫార్మెట్‌లో తీసి దానికి మదర్‌ సెంటిమెంట్‌ టచ్‌ ఇచ్చాడు దర్శకుడు. అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్ల ఫన్‌, ఎమోషన్‌ బాగా వర్కవుట్‌ అయింది. హీరో తన తండ్రి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే సన్నివేశాలు ఆకట్టుకున్నాయి.  ఫ్లాష్‌బ్యాక్‌ ఎపిసోడ్‌ కూడా బావుంది. చివర్లో ట్విస్ట్‌ సస్పెన్స్‌ని క్రియేట్‌ చేస్తుంది. క్లైమాక్స్‌లో రూట్‌ మార్చినట్టి మార్చి అసలు విషయం రివీల్‌ చేసిన తీరు బాగుంది. రొటీన్‌గా కాకుండా ట్విస్ట్‌తో కథను ముగించారు. అయితే లాజిక్‌తో వెతికే వారికి ఆ సీన్స్‌ అంతగా ఎక్కవు. యూత్‌ని ఎట్రాక్ట్‌ చేసే ప్రయత్నం చేశారు కానీ అది ఇంకాస్త డీప్‌గా చేసుంటే రిజల్ట్‌ మెరుగ్గా ఉండేది.  

నటీనటుల విషయానికొస్తే.. సుహాస్‌ ఎంచుకునే పాత్రలన్నీ పక్కింటి కుర్రాడిలాగా ఉంటాయి. ఇందులో రామ్‌ పాత్రలో ఒదిగిపోయాడు. నటుడిగా ఇప్పటిదాకా అతను ఎక్కడా ఫెయిల్‌ కాలేదు. సత్యభామ పాత్రకు మాళవిక మనోజ్‌ కరెక్ట్‌గా యాప్ట్‌ అయింది. అందంగా, చక్కని అభినయంతో అలరించింది. నటన పరంగా సుహాస్‌ని డామినేట్‌ చేసిందని చెప్పొచ్చు. సుహాస్‌ తల్లిగా 'నువ్వు నేను' ఫేం అనిత చక్కగా నటించింది. చాలా ఏళ్ళ తర్వాత తెరపై కనిపించినా చక్కని నటనతో ఆకట్టుకుంది. మదర్‌గా ఎమోషనల్‌ సీన్లలో మెప్పించింది. రామ్‌కి తండ్రి పాత్రలో రవీంద్ర విజయ్‌ కూడా ఫర్వాలేదనిపించాడు. హీరోయిన్‌ తండ్రి పాత్రలో పృథ్వీ నటన బాగుంది. చాలాకాలం తర్వాత అలీకి నిడివి ఎక్కువున్న పాత్ర దక్కింది. నవ్వులతో పాటు భావోద్వేగాన్ని పంచాడు. సుహాస్‌ ఫ్రెండ్స్‌గా సాత్విక్‌ నవ్వించారు. నయని పావనికి మంచి పాత్రే దక్కింది. అన్నపూర్ణ ఎప్పటిలాగే బాగానే చేశారు. దర్శకుడు హరీష్‌ శంకర్‌, మారుతి అతిథి పాత్రల్లో మెరిశారు.  మణికందన్‌ సినిమాటోగ్రఫీ సినిమాకి హైలైట్‌గా నిలిచింది. విజువల్స్‌ కలర్‌ఫుల్‌గా ఉన్నాయి. బ్రహ్మకడలి ఆర్ట్‌ వర్క్‌లో తన మార్క్‌ చూపించాడు. భవిన్‌ ఎం షా ఎడిటింగ్‌ కూడా ఓకే. నేపథ్య సంగీతం పరంగా రథన్‌ మ్యూజిక్‌ సినిమాకి మరో ప్లస్‌. పాటలు అంతగా గుర్తు పెట్టుకునేలా లేవు. నిర్మాణ విలువలు బావున్నాయి.

దర్శకుడు రామ్‌ గోదల రాసుకున్న కథ బాగానే ఉంది. సినిమాలో ఎక్కడా అసభ్యత లేదు. కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపించినా మరి కొన్ని చోట్ల కన్విన్స్‌ చేసేలా ఉండటంతో ఫర్వాలేదు అనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే కథలో ఉన్న బలానికి తగ్గ ఎమోషన్స్‌ తెరపై కనిపించలేదు.

ట్యాగ్‌లైన్‌: రామ...  రొటీన్ భామ..            
రేటింగ్‌: 2.5/5 

Updated Date - Jul 11 , 2025 | 07:38 PM