Dhandora Review: దండోరా మూవీ ఎలా ఉందంటే
ABN , Publish Date - Dec 25 , 2025 | 09:39 AM
కులం, చావు, అంత్యక్రియలు నేపథ్యంలో శివాజీ కీలక పాత్రలో నటించిన 'దండోరా' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం
సినిమా రివ్యూ: దండోరా
విడుదల తేది: 25-12-2025
‘90s మిడిల్‌క్లాస్ బయోపిక్’ చిత్రంతో ఫామ్‌లోకి వచ్చారు శివాజీ. ‘కోర్ట్’లో మంగపతి క్యారెక్టర్ ఇంకాస్త గుర్తింపు పెంచింది. తాజాగా అయన కీలక పాత్ర పోషించినం చిత్రం ‘దండోరా’. నవదీప్, నందు, బిందు మాధవి, రవికృష్ణ, మాణికా చిక్కాల, శ్రీ, మౌనికా రెడ్డి, రాధ్య ఇతర పాత్రల్లో నటించారు. మురళీకాంత్ దర్శకత్వం వహించారు. రవీంద్ర బెనర్జీ ముప్పానేని నిర్మించారు. కులం, అంతిమ సంస్కారం ఇతివృత్తంతో ఈ చిత్రం తెరకెక్కింది. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను ఈ మేరకు మెప్పించింది? శివాజీ ఖాతాలో మరో హిట్ పడిందా? లేదా?
కథ:
మెదక్ జిల్లా, తుళ్లూరు గ్రామంలో జరిగే కథ ఇది. అక్కడ తక్కువ కులానికి చెందిన వారు మరణిస్తే ఊరు చివరి ఉన్న వంతెన దగ్గరకు తీసుకెళ్లి దహన సంస్కారాలు చేస్తారు. కానీ అగ్ర కులానికి శ్మశాన వాటిక ఉంటుంది. అదే ఊళ్లో అగ్ర కులానికి చెందిన వ్యక్తి శివాజీ. ఇతర కులస్తులు తన కులం అమ్మాయిని చూసినా సహించలేనంత కులపిచ్చి అతనికి. కొన్ని కారణాల వల్ల శివాజీ మరణిస్తే అతని కుల సంఘాలు స్మశాన వాటికలో దహనం చేయడానికి వీల్లేదని అడ్డుపడతారు. శివాజీని కుల పెద్దలు ఎందుకు బహిష్కరించారు? అదే ఊళ్లో తక్కువ కులానికి చెందిన రవి (రవి కృష్ణ)ను హత్య చేసింది ఎవరు.. ఎందుకు? రవి మరణం వల్ల ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి. శివాజీతో కొడుకు విష్ణు (నందు) తండ్రికి ఎందుకు దూరంగా ఉన్నాడు. వేశ్య శ్రీలత (బిందు మాధవి)తో శివాజీకి ఎటువంటి సంబంధం ఉంది? శివాజీ అంత్యక్రియల నేపథ్యంలో తలెత్తిన సమస్య ఎలాంటి మార్పునకు తీసుకొచ్చింది? దీని కోసం సర్పంచ్ నవదీప్ ఏం చేశాడు అనేది కథ.
విశ్లేషణ:
అగ్ర కులానికి చెందిన వ్యక్తి చావు, అతని అంత్యక్రియలు, అందులో కుల రాజకీయం నేపథ్యంలో సాగే గ్రామీణ కథ ఇది. 2004 -2019లో కథ జరిగినట్లు చూపించారు. పరువు హత్యల నేపథ్యంలో ఇప్పటికే తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి. ఇందులో దానితో పాటు కుల వివక్షను, కుల రాజకీయాలను టచ్ చేశారు. తక్కువ కులానికి చెందిన ఓ వృద్ధురాలు చనిపోతే ఊరు చివర కార్యక్రమాలు నిర్వహించే సీన్‌తో సినిమా మొదలైంది. ప్రథమార్ధం అంతా ఊళ్లో కులం, రవి, సూజాతల లవ్‌స్టోరీని చూపించారు. అదంతా సోసోగానే సాగుతుంది. కులాలు గురించి పట్టించుకునే చోట వేర్వేరు కులాలకు చెందిన ఇద్దరి మధ్య ప్రేమ అంటే చంపడమో, చచ్చిపోవడమో తప్పకుండా ఉంటుంది. అగ్ర కులానికి చెందిన ప్రేమ కారణంగా రవిని హత్య చేస్తారు. దాంతో కథలో ఇంటెన్స్ పెరుగుతుంది. కట్ చేస్తే ఇంటర్వెల్. ఇక సెకెండాఫ్‌కి వస్తే కులం కారణంగా కుటుంబ సభ్యులు ఎంత మనోవేదనకు గురవుతారో చూపించే ప్రయత్నం చేశారు. పరువు హత్య, కుల వివక్షకు తోడు కుల అహంకారంతో చెలరేగిన మనిషిలో మార్పును చూపించారు. అగ్ర కులాల్లోనూ వివక్షను తట్టుకోలేని మనుషులు ఉంటారని, అలాంటి వ్యక్తుల నిస్సహాయతను మనసుకు తాకేలా చూపించారు మణికాంత్. ఇంటర్వెల్ దాకా సినిమా ఓకే అన్నట్లు నడుస్తుంది. అడవిలో కట్టెలు కొట్టే సన్నివేశం, చావు ఇంట్లో ఛాయ్ గోల వంటి సన్నివేశాలు విసుగు పుట్టిస్తాయి. విశ్రాంతి తర్వాత సినిమా ట్రాక్‌లోకి వస్తుంది. శివాజీ పాత్రలో సంఘర్షణ మొదలవుతుంది. ఆ తర్వాతే డ్రామా మరింత రక్తి కట్టింది. కొడుతు, కూతురు, సర్పంచ్ కలిసి చేసిన ఆలోచనతో సినిమాకు ముగింపు కార్డ్ పడుతుంది. క్లైమాక్స్ మాత్రం ఆలోచన రేకెత్తిస్తుంది. అగ్ర కులానికి సొంత శ్మశానం, తక్కువ కులానికి శ్మశానం లేకపోవడం, ఏళ్లు గడుస్తున్నా ఆ సమస్యకు పరిష్కారం వెతుక్కో కపోవడం, ఎవరో స్థలం దానం చేస్తే తప్ప వాళ్లకు దారి లేదా అన్న సన్నివేశాలు కథకు అతికినట్టు లేవు. అక్కడే దర్శకుడు కొన్ని లాజిక్కులు మిస్ చేశాడు.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
ఈ సినిమాకు కీలకం శివాజీ పాత్ర. కథలో మలుపు వచ్చిన ప్రతిసారి అతని పాత్రలో మలుపు కనిపించింది. విష్ణు పాత్రలో నందు బాగా యాక్ట్ చేశాడు. ఆ పాత్రలో వేరియేషన్స్ చూపించాడు. ఆయన ఈ మధ్యన చాలా సినిమాలు చేసినా వాటిలో గుర్తండే పాత్ర ఒకటీ లేదు. ఇందులో పాత్రను ప్రేక్షకులు గురు పెట్టుకుంటారు. సర్పంచ్ పాత్రకు నవదీప్ న్యాయం చేశాడు. రవికృష్ణది రొటీన్ పాత్రే అయినా హీరో స్థాయిలో చూపించారు. ఇంటర్వెల్ ముందు రవికృష్ణ ఎమోషనల్ పెర్ఫార్మన్స్ హైలైట్ అనొచ్చు. సూజాత పాత్రలో మణిక మెప్పించింది. వేశ్య పాత్రల్ని చాలా సినిమాల్లో చాలా రకాలుగా చూపించారు. ఇందులో బిందు మాధవి పోిషించిన పాత్ర అందుకు భిన్నంగా ఉంటుంది. కట్టు, బొట్టు, మాట తీరు అన్ని చాలా హుందాగా తీర్చిదిద్దారు. అయితే ఆమె డబ్బింగ్ మైనస్. మురళీధర్ గౌడ్, మౌనిక, రాధ్య కథకు న్యాయం చేశారు. మార్క్ కె రాబిన్ నేపథ్యం సంగీతం బావుంది. ‘దండోరా’ నేపథ్య సంగీతంలో టైటిల్ సాంగ్ ఉపయోగించిన తీరు బావుంది. కథలో ఎమోషన్ ఎలివేట్ చేసింది. వెంకట్ ఆర్ శాఖమూరి సినిమాటోగ్రఫీ బావుంది. ఎడిటర్ సృజన అడుసుమిల్లి ఫస్టాఫ్‌కు కాస్త కత్తెర వేయాల్సింది. నిర్మాణ విలువలు బావున్నాయి.

'కల్లు మత్తు కాదు కదా ‘సార్.. రాత్రి తాగింది పొద్దుగాల దిగనీకీ. కులం మత్తు సార్ టైమ్ పట్టింది.
చావునుంచైనా తప్పించుకోవచ్చు కానీ.. కులం నుంచి తప్పించుకోలేం.
మన చావు పుట్టుకలన్నీ ఆ ఊరిబయట రాసిండ్రా దేవుడూ
ఎంత చదువుకున్నా ఎంత ఆస్తి ఉన్నా వాడిని చూసే కొలమానం కులమే’
వంటి డైలాగ్‌లతో ఆకట్టుకున్నాడు దర్శకుడు. తొలి చిత్రానికి మణికాంత్ కథ రాసుకున్న కథ బలమైనదే. కానీ తెరకెక్కించడంలో కాస్త తడబాటు కనిపించింది. కుల రహిత సమాజం అందంగా ఉంటుందని చూపించారు. ఇందులో క్యారెక్టర్లు, డైలాగ్‌లు గుర్తుండిపోతాయి. ఫస్టాఫ్ అంతా సోసోగా సాగినా, 'చావు అనేది మనిషికి ఇచ్చే ఆఖరి మర్యాద.. అది మర్యాదగానే జరగాలి' అంటూ చివరి 15 నిమిషాల సన్నివేశాలతో సినిమా ట్రాక్‌ను మార్చేశారు.
ట్యాగ్‌లైన్: కుల రహిత సమాజం కోసం..
రేటింగ్: 2.5/5