PadaKkalam: స‌డ‌న్‌గా ఓటీటీకి.. మ‌ల‌యాళ సూప‌ర్ నేచుర‌ల్ ఫాంట‌సీ! పడక్కలం రివ్యూ

ABN , Publish Date - Jun 10 , 2025 | 03:57 PM

గ‌త నెల మే8న కేర‌ళ‌లో థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి మంచి విజ‌యం సాధించిన మ‌ల‌యాళ‌ చిత్రం పడక్కలం.

padakkalam

ఓటీటీ రివ్యూ: పడక్కలం

గత నెల మే8న కేరళలో థియేటర్లలోకి వచ్చి మంచి విజయం సాధించిన మలయాళ చిత్రం పడక్కలం (Padakkalam) ది బ్యాటిల్ ఫీల్డ్‌. అరుదుగా వచ్చే సూపర్ నేచురల్ ఫాంటసీ కామెడీ జానర్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు ఓ విభిన్న అనుభూతి ఇస్తుందనడంలో ఎలాంటి సందేహాం లేదు. సందీప్ ప్రదీప్ (Sandeep Pradeep), సూరజ్ వెంజరమూడు (Suraj Venjaramoodu), షరాఫుద్దీన్ (Sharafudheen) మరో ముగ్గురు వర్ధమన నటులు ప్రధాన పాత్రలు పోషించారు. మను స్వరాజ్ (Manu Swaraj) దర్శకుడిగా ఆరంగేట్రం చేశాడు. రూ.10 కోట్ల లోపు బడ్జెతో తెరకెక్కిన ఈ సినిమా రూ.20 కోట్ల మేర వసూళ్లు రాబట్టి మలయాళ ఇండస్ట్రీలో మంచి ప్రయత్నంగా విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే ఈ చిత్రం ఉన్నట్టుండి మంగళ వారం జూన్ 10న డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చి ఆశ్చర్యానికి గురి చేసింది.

కథ విషయానికి వస్తే.. నలుగురు ప్రాణస్నేహితులు (జతిన్, నకుల్, కన్నన్, రామ్) ఓ కాలేజీలో కలిసి చదువుతుంటారు. అదే కాలేజీలో షాజీ, రంజిత్ లెక్చరర్లుగా పని చేస్తుంటారు. అయితే రంజిత్ తన దగ్గర ఉన్న ఓ పవర్ను ఉపయోగించి షాజీ మైండ్ను తన కంట్రోల్లోకి తెచ్చుకుని తనకు అవసరం ఉన్నప్పుడల్లా వాడుకుంటూ కాలేజీలో షాజీకి బ్యాడ్ నేమ్ వచ్చేలా చేస్తుంటాడు. ఓ రోజు రంజిత్ వద్ద పవర్స్ ఉన్న విషయాన్ని స్టూడెంట్ జతిన్ ప్రత్యక్షంగా చూసి తన మిత్రులకు చెబుతాడు. మొదట్లో వారు నమ్మకున్నా తర్వాత వారు రంజిత్ వద్ద శక్తులు ఉన్న బ్యాగును కొట్టేస్తారు. అప్పటికే విషయం తెలుసుకున్న రంజిత్ తర్వాత జతిన్ను సైతం తన ఆధీనంలోకి తెచ్చుకుని ఇబ్బంది పెడుతుంటాడు. ఆ సమయంలో రంజిత్ వద్ద ఉన్న లాకెట్ దీనంతటికి కారణమని తెలుసుకుని దాన్ని కూడా తస్కరించి అంతకుముందు బ్యాగులో దొరికిన బాక్స్, లాకెట్ను కలిపి జుమాంజీ తరహాలో గేమ్ స్టార్ట్ చేస్తారు.

ఇది తెలుసుకున్న రంజిత్ ఆ గేమ్ను ఎలాగైనా అడ్డుకోవాలని ఆ స్టూడెంట్స్ వద్దకు వచ్చేటప్పటికే గేమ్ స్టార్ట్ చేసి చివరి డైస్ వేస్తారు, అదే సమయంలో మరో లెక్చరర్ షాజీ అక్కడకు వస్తాడు. సడన్గా అప్పుడే ఆట ప్రారంభమై రంజిత్ బాడీలోకి షాజీ, షాజీ బాడీలోకి జతిన్, జతిన్ బాడీలోకి రంజిత్ ఆత్మలు ప్రవేశిస్తాయి. దీంతో కథ మలుపు తిరుగుతుంది. అసలు షాజీ ఈ గేమ్లోకి ఎలా వచ్చాడో తెలుసుకుంటారు. ఆ పై ముగ్గురు ఈ గేమ్లోంచి బయట పడాలని చూస్తారు గానీ రంజిత్ బాడీలో ఉన్న షాజీ తనను కో లెక్చరర్ రంజిత్ గతంలో అనేక సార్లు అతనికి ఉన్న పవర్స్ తో అనేక ఇబ్బందులు పెట్టాడని గుర్తు చేసుకుంటూ రంజిత్ ఫేస్ తో పలు రకాలగా చెడ్డ పనులు చేస్తాడు. దీంతో షాజీని కంట్రోల్ చేసేందుకు జతిన్, రంజిత్లు అనేక ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ షాజీ బాడీ మందు తాగితే అక్కడ రంజిత్ బాడీకి మత్తు ఎక్కడం వంటి హలో బ్రదర్ టైప్ రియాక్షన్స్ సైతం మనం ఇందులో చూస్తాం.

GtB5v6dbYAAXkd0.jpeg

ఇలా ఈ ముగ్గురి చుట్టూ సినిమా తిరుగుతూ చివరకు ఈ గేమ్ నుంచి వారు ఎలా బయట పడ్డారు, అందుకు వారు పడిన తిప్పలేంటి? ఎలాంటి పర్యావసనాలు ఎదుర్కోవాల్సి వచ్చింది? అసలు ఆ పవరేంటి, అదెలా వచ్చిందనే ఆసక్తికరమైన కథ, కథనాలతో మూవీ సాగుతూ ఆడియెన్స్ కు మంచి వినోదంతో పాటు సూపర్ థ్రిల్ను సైతం అందిస్తుంది. సినిమాలో అక్కడక్కడ లాజిక్ లు మిస్సయినా, ప్రత్యేకంగా హీరోయిన్ లేకున్నా సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా రెండు గంటల పాటు సినిమా ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తుంది. నటీనటులందరూ వారి వారి పాత్రలకు తగిన న్యాయం చేస్తూ చక్కటి నటనను ప్రదర్శించారు. ఇప్పుడీ చిత్రం జియో హాట్స్టార్ (JioHotstar)లో మలయాళంతో పాటు తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఈ వీకెండ్ ఫ్యామిలీతో కలిసి సినిమా చూడాలనుకునే వారితో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన సినిమాలను ఇష్టపడే వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ మూవీని మిస్ చేసుకోవద్దు. సినిమా కాన్సెప్ట్ కాస్త తికమక పెట్టినా స్టోరీ సులభంగా అర్ధమయ్యేలానే సాగుతుంది. ఎక్కడా ఎలాంటి అసభ్య, అశ్లీల సన్నివేశాలు లేకపోవడం అభినందించాల్సిన విషయం. చాలా సందర్భాల్లో అలాంట్లి సీన్ ను వాడే అవకాశం ఉన్నా మేకర్స్ ఆ యాంగిల్ వైపు ఆలోచించకపోవడం అభినందించాల్సిందే. అయితే క్యారెక్టర్ల మధ్య డైలాగుల విషయంలో గ్యాప్ ఇవ్వకుండా యమ స్పీడుగా వస్తూ మనం వాటిని అర్థం చేసుకునేలోగా మరికొన్ని డైలాగ్స్ వచ్చి కొంత కన్ఫ్యూజ్ చేస్తాయి. అదొక్కటే లోపం. ఏది ఏమైనా కొత్త కాన్సెప్ట్ తో కూడిన భిన్నమైన సినిమాను చూసిన అనుభూతిని మాత్రం ఇస్తుంది పడక్కలం.

ట్యాగ్ లైన్: జుమాంజీ తరహా చిత్రం పడక్కలం

రేటింగ్: 3/5

Updated Date - Jun 10 , 2025 | 03:57 PM