Subham Review: సమంత నిర్మించిన 'శుభం' సినిమా ఎలా ఉందంటే..
ABN, Publish Date - May 09 , 2025 | 11:12 AM
సమంత నిర్మాతగా మారి తెరకెక్కించిన తొలి చిత్రం 'శుభం'. ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వంలో హారర్ కామెడీ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిర్మాత గా సమంత విజయం అందుకుందా..
సినిమా రివ్యూ: శుభం (Subham Movie Review)
విడుదల తేది: 9-5-2025
స్టార్ హీరోయిన్ గా రాణించిన సమంత (Samantha) సొంత నిర్మాణ సంస్థను నెలకొల్పి సినిమా నిర్మాణం చేపట్టింది. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత నిర్మించిన తొలి చిత్రం ‘శుభం’ (Subham MOvie Review). సినిమా బండి’ కి దర్శకత్వం వహించిన ప్రవీణ్ కండ్రేగుల (Praveen Kandregula) దర్శకత్వం వహించటంతో పాటు సమంతకు నిర్మాతగా తొలి చిత్రం కావటంతో ‘శుభం’పై రిలీజ్ కి ముందు పాజిటివ్ వైబ్స్ ఏర్పడ్డాయి. మరి శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమాకు ఎలాంటి స్పందన లభిస్తుందో ఇప్పుడు చూద్దాం.
కథ: (Subham story)
భీముని పట్నంలో కేబుల్ టీవీ ఆపరేటర్ కమ్ ఓనర్ గా బతికేస్తుంటాడు శ్రీనివాస్ (హర్షిత్ రెడ్డి). కేబుల్ నుంచి డీటీహెచ్ అందుబాటులోకి వస్తున్న సమయమది. దాంతో డిష్ కుమార్ (వంశీధర్ గౌడ్) పోటీగా వచ్చి శ్రీను వ్యాపారానికి పోటీగా నిలుస్తాడు. ఇక అదే ఊరికి చెందిన స్నేహితుల (గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పెరి)తో కలిసి సరదాగా జీవితాన్ని గడుపుతుంటాడు శ్రీనివాస్. అదే ఊరిలో బ్యాంక్లో పని చేసే శ్రీవల్లి (శ్రియ కొంతం)తో శ్రీనివాస్ పెళ్లి జరుగుతుంది. అతని ఫస్ట్ నైట్ రోజే భార్య శ్రీవల్లి టీవీలో సీరియల్ చూస్తూ వింతగా ప్రవర్తిస్తుంది. అయితే శ్రీను అతని ఇద్దరు స్నేహితులతో పాటు ఊరిలో ఉన్న మగాళ్ళందరి పరిస్థితి అదే. రాత్రి తొమ్మిది కాగానే జన్మజన్మల బంధం టీవీ సీరియల్ చూస్తూ దెయ్యాలు ఆవహించినట్టుగా వింతగా ప్రవర్తిస్తుంటారు ఊరిలోని ఆడవారందరూ. అడ్డుకుంటే, భర్తల పైనా దాడులకు దిగి భయభ్రాంతులను చేస్తుంటారు. సీరియల్ పూర్తయ్యాక అంతా మామూలుగానే ఊంటూ ఏమీ జరగనట్లు ఉంటారు. మగవాళ్లు ఎక్కడ తమ పరువు పోతుందో అని ఎవరికీ చెప్పరు. దీని నుంచి బయట పడగానికి శ్రీను బృందం మాయ మాతాశ్రీ (సమంత)ను ఆశ్రయిస్తారు. మాయ ఏం చెప్పింది? జన్మజన్మల బంధం సీరియల్ కి , ఆత్మలకీ సంబంధం ఏమిటి? ఈ సమస్యకి పరిష్కారం దొరికిందా? అసలు ఇందులో మాయ పాత్ర ఏంటి? చివరికి ఏం జరిగిందన్నది ‘శుభం’ కథ.
విశ్లేషణ: (Subham Movie Review)
ఓ చిన్న గ్రామం, ఓ సీరియల్, మూడు జంటలు, ఆ ఊళ్లో మహిళల విచిత్రమైన ప్రవర్తన ఇదీ సింపుల్గా ఈ సినిమా కథ. దీనికి మూలం ఓ సీరియల్. సినిమా మొత్తం సీరియల్ చుట్టూ తిరుగుతుంది. నిర్మాతగా సమంత చెప్పినట్లే ఇదొక హారర్-కామెడీ కథ. అయితే దర్శకుడు అసలు కథలోకి వెళ్లడానికే చాలా సమయం తీసుకున్నాడు. శ్రీను పెళ్లి చూపులు, పస్ట్ నైట్ సీన్ తో కథాలోకి అడుగు పెడతాం. నిజానికి ఇక్కడి నుంచి వేగం పుంజుకోవాలి. అలా జరగలేదు. అందరి ఇళ్లల్లో జరిగే తతంగాన్ని చూపించిందే చూపించి బోర్ కొట్టించాడు. ఆరంభంలో వచ్చే గంగవ్వ, వంశీధర్ గౌడ్ సీన్ ని మినహాయిస్తే ప్రథమార్ధం కాస్త పర్వాలేదనిపిస్తుంది. సీరియల్తో లింక్ అయిన కథను రివీల్ చేసిన తర్వాత వచ్చే సన్నివేశాలు పదే పదే రిపీట్ అయి ఆడియన్స్ తలలు పట్టుకునేలా చేస్తాయి. స్క్రీన్ ప్లే లో బలం లేదు. చిత్రీకరణలో పస లేదు. చివరికి ఆత్మల బాధ తెలిసిన తర్వాత చెప్పేది ఏమీ లేదనే ఫీలింగ్ కలుగుతుంది. సినిమా బండిని ఆసక్తి కరంగా మలిచిన దర్శకుడు తీసిన సినిమాయేనా? ఏమి చూసి సమంత సినిమాను నిర్మించిందనే భావన కలగక పోదు. హారర్ ఎలిమెంట్స్ ని డైలీ సీరియల్ కు లింక్ చేయటం కాస్త కొత్తగా అనిపించినా చిత్రీకరణ పేవలంగా ఉండటంతో తేలిపోయింది.
కొత్త నటీనటులు తమ పాత్రల పరిధి మేరకు బాగానే చేశారు. కేబుల్ టీవీ శ్రీనుగా హర్షిత్, అతడి స్నేహితులుగా గవిరెడ్డి శ్రీనివాస్, చరణ్ పేరి ఓకె. కథానాయికలుగా చేసిన శ్రియ, శ్రావణి, శాలిని చక్కగా పెర్ఫామ్ చేశారు. డిష్ కుమార్గా వంశీధర్ గౌడ్ మాత్రం బోరు కొట్టించాడు. సమంత అతిథి పాత్ర గురంచి చెప్పటానికి ఏమీ లేదు. సమస్యని సమస్య అని ఎందుకంటారంటే, అది సమస్య కాబట్టి... అనే కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి. భీముని పట్నం అందాలను సరిగ్గా క్యాప్చర్ చేయలేకపోయారని అనిపించింది. పాటలు, నేపథ్య సంగీతం సోసో... నిజానికి భయపెట్టినా, నవ్వించినా అవి తారా స్థాయిలో ఉంటేనే ప్రేక్షకులు ఓన్ చేసుకుంటారు. అలా లేకపోవడమే ఈ ‘శుభం’కు ఓ పెద్ద మైనస్.
రేటింగ్: 2.25/5
ట్యాగ్ లైన్ : శుభం కాదు