Champion Review: రోషన్ 'ఛాంపియన్'.. మూవీ రివ్యూ
ABN , Publish Date - Dec 25 , 2025 | 02:51 PM
నాలుగేండ్ల విరామం అనంతరం శీక్రాంత్ కుమారుడు రోషన్ హీరోగా, మలయాళ సోయగం అనస్వర రాజన్ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కిన చిత్రం ఛాంపియన్.
రివ్యూ: ఛాంపియన్
విడుదల తేదీ: 25-12-2025
నాలుగేండ్ల విరామం అనంతరం శీక్రాంత్ కుమారుడు రోషన్ హీరోగా, మలయాళ సోయగం అనస్వర రాజన్ను తెలుగు తెరకు పరిచయం చేస్తూ తెరకెక్కించిన చిత్రం ఛాంపియన్. సీతారామం వంటి క్లాసిక్ హిట్ తర్వాత స్పప్న సినిమా మరో నిర్మాణ సంస్థ ఆనందీ ఆర్ట్స్తో కలిపి ఈ చిత్రాన్ని నిర్మించింది. ప్రవీణ్ అద్వైతం దర్శకత్వం వహించడంతో పాటు కథ, స్క్రీన్ప్లే అందించారు. భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన అనంతరం నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానం… వారి పాలనలో బైరాన్పల్లి అనే గ్రామంలో జరిగిన దారుణ మారణకాండను ఇతివృత్తంగా తీసుకుని ఫిక్షనల్ క్యారెక్టర్లతో ఈ సినిమాను రూపొందించారు. రిలీజ్కు ముందే పలు ప్రత్యేకతలతో, భారీ అంచనాలతో క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25, శుక్రవారం రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో చూద్దాం…
కథ:
చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మైఖేల్ విలియమ్స్ ఓ బేకరిలో పని చేస్తూ అక్కడి వారితో కలిసి జీవిస్తూ ఉంటాడు. అవకాశం లభిస్తే ఎలాగైనా ఇంగ్లాండ్ వెళ్లి అక్కడే స్థిరపడాలనుకుంటాడు. ఫుట్బాల్ ఆటలో బాగా ప్రావీణ్యం ఉన్న మైఖేల్ సికింద్రాబాద్ ఫుట్బాల్క్లబ్ మెంబర్. హైదరాబాద్ క్లబ్తో జరిగిన మ్యాచ్లో మైఖేల్ ప్రదర్శనను తిలకించిన బ్రిటీష్ అధికారి ఇంగ్లాండ్ లోని క్లబ్ లో ఫుట్బాల్ ఆడేందుకు ఎంపిక చేస్తాడు. అయితే మైఖేల్ తండ్రి నేపథ్యం వల్ల మైఖెల్ లీగల్గా ఇంగ్లాండ్కు వెళ్లే అవకాశం లేక సీక్రెట్గా ఆయుధాలు సరఫరా చేస్తే ఇంగ్లండ్ కు వెళ్లే ఛాన్స్ దక్కుతుందని భావించి ఒప్పుకుంటాడు. తీరా ఆ పని లో భాగంగా రజాకార్ల దృష్టిలో పడకుండా పారిపోతూ అనుకోకుండా బైరాన్పల్లి చేరి అక్కడ కొద్ది రోజులు రహస్యంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఇదిలాఉంటే... 1947లోనే అనేక సంస్థానాలు భారతదేశంలో కలిసిపోగా నిజాం సంస్థానం మాత్రం అందుకు భిన్నంగా వ్యహరిస్తూ ఉంటుంది. హైదరాబాద్ ప్రత్యేక దేశంగా ఉంటుంది కానీ భారత్లో కలపం అంటూ ఖాసీం రిజ్వీ ఖరాఖండిగా తేల్చేస్తాడు. ఈ క్రమంలో తమకు వ్యతిరేకంగా గొంతు విప్పుతున్న, ఎదురు దాడులు చేస్తున్న ఊర్లపై పడి అక్కడి ప్రజలను చంపుతూ ఉంటుంది రిజ్వీ సైన్యం. అయితే బైరాన్పల్లి గ్రామం మాత్రం రజాకార్ సైన్యాన్ని ఎదురిస్తూ వారికి మింగుడు పడదు. దాంతో ఆ ఊరిని ఎలాగైనా నాశనం చేయాలని సైన్యం ఎదురు చూస్తున్న సమయంలో మైఖేల్ ఆ ఊరికి వచ్చి చేరతాడు. ఆ తర్వాత అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చంద్రకళతో ప్రేమ వ్యవహారం ఎలా సాగింది? అక్కడి ప్రజలతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? ఇంగ్లాండ్ పోవాలని కలలు కన్న మైఖేల్ ఎందుకు తిరిగి ఆ గ్రామానికి వచ్చాడు? అసలు అతని తండ్రి ఎవరు? అతను చేసిన పనేంటి? అనే ఆసక్తికరమైన కథకథనాలతో సినిమా సాగుతుంది.
విశ్లేషణ:
బైరాన్ పల్లిలో జరిగిన నరమేధం తదితర అంశాలన్నీ తెలంగాణ ప్రజలకు బాగా తెలిసిన కథ కావటంతో దర్శకుడు కేవలం ఆ నేపథ్యాన్ని మాత్రమే తీసుకుని కొన్ని కల్పిత పాత్రలను సృష్టించి నేటి తరానికి అర్థమయ్యేలా తెరకెక్కించిన విధానం బావుంది. సినిమా విడుదలకు ముందే ‘గిర గిర గింగిరా’ అనే పాట తీసుకువచ్చిన హైప్ ప్రతి ఒక్కరికీ సినిమా గురించి మరింతగా తెలిసేలా చేసింది. ఆపై సినిమా నుంచి ప్రతీ అప్డేట్ ప్రేక్షకుల నుంచి అటెన్షన్ తీసుకుంటూ వచ్చింది. సినిమా ఆరంభంలోనే కథ నేపథ్యాన్ని వివరించి నెమ్మదిగా హీరో ఆశయం, అతని తోటి వారిని పరిచయం చేస్తూ కథలోకి తీసుకెళ్లడానికి సమయం తీసుకున్నారు. ఇక హీరో తప్పించుకుని బైరాన్ పల్లికి వెళ్లడం, హీరోయిన్ అనస్వర రాజన్ ఎంట్రీ నుంచి సినిమా ఎక్కడా తగ్గకుండా పరుగులు పెడుతుంది. ఆ ఊరిపై దాడి జరుగుతున్న సమయంలోనే అక్కడి నుంచి వెళ్లిపోదామనుకున్న హీరో వెనకకు వచ్చి యాక్షన్లోకి దిగడం ప్రేక్షకులతో ఈలలు వేయిస్తుంది. ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సన్నివేశాలు, స్టార్ హీరో గెస్ట్ పాత్రలో కనిపించటం కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇక పతాక సన్నివేశాల్లో ఒక్క సారిగా ఊరిపై పడ్డ రజాకార్ సైన్యాలను అక్కడి ప్రజలు ధైర్యంగా ఎదిరించి పోరాడటం… మైఖేల్ వారికి అండగా నిలవడం మెప్పించేలా ఉంది.
సినిమాలో నటీనటుల పనితీరుకు వంక పెట్టాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరూ అయా పాత్రల్లో ఒదిగిపోయారు. విజువల్స్ సైతం గ్రాండియర్గా ఉన్నాయి. మిక్కీ జే మేయర్ నేపథ్యం సంగీతంతో పాటు, పాటల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. గిర గిర గింగిరా పాట బయట వినేదానికన్నా సినిమాలో ఇంకా అద్భుతంగా ఉండి ప్రేక్షకులను కట్టిపడేసిందనడంలో అతి శయోక్తి లేదు. సుమారు మూడు దశాబ్దాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన నందమూరి కళ్యాణ చక్రవర్తి సినిమాకు ఓ పెద్ద సర్ ప్రైజ్. ఆయన ఊరి పెద్దగా అ పాత్రకు జీవం పోశారు. ఇక భారత దేశ హోంమంత్రి పటేల్గా ప్రకాశ్ రాజ్ను, ఖాసీం రజ్వీ పాత్రలో బాలీవుడ్ నడుడు కేకే మీనన్ను, ఓ ప్రత్యే పాటలో తెలుగు, హాలీవుడ్ అమ్మాయి అవంతిక వందనపును సరిగ్గానే వాడుకున్నారు. అంతేకాదు ఈ క్రమంలో రజాకార్ల దాడిలో హత్యకు గురైన నాటి ముస్లిం జర్నలిస్టు షోయబుల్లా ఖాన్, హైద్రాబాద్ స్టేట్ సీఏం బూర్గుల రామకృష్ణా రావు పాత్రలను కూడా టచ్ చేశారు. కాకపోతే... సినిమాను బైరాన్ పల్లి నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన దర్శకుడు సినిమా చివరలో ఆ ఊరికి సంబంధించిన నాటి, నేటి ఆనవాళ్లను చూపించి ఉంటే సినిమాకు మరింత సాధికారత వచ్చిఉండేది.
ట్యాగ్ లైన్: బైరాన్ పల్లి… ది ఛాంపియన్
రేటింగ్: 2.75/5