Raju Weds Rambai Movie: రాజు వెడ్స్ రాంబాయి మూవీ రివ్యూ

ABN , Publish Date - Nov 20 , 2025 | 10:12 PM

దర్శకుడు వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవితో కలిసి నిర్మించిన 'రాజు వెడ్స్ రాంబాయి' మూవీతో సాయిలు కంపాటి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అఖిల్ రాజ్, తేజస్వి రావ్ జంటగా నటించిన ఈ సినిమా ఎలా ఉందంటే....

Raju Weds Rambai Movie

ఇవాళ గ్రామీణ నేపథ్య ప్రేమకథా చిత్రాలకు చక్కని ఆదరణ లభిస్తోంది. అవి మట్టి వాసనలు వెదజల్లడం ఒక కారణం అయితే... వాటిని తెరకెక్కించే దర్శకులు సహజత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం, పాత్రలకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడం మరో కారణం. ఈ శుక్రవారం జనం ముందుకు వచ్చిన పలు చిత్రాల్లో తనదైన ప్రత్యేకతను ప్రచార సమయంలోనే చాటుకున్న సినిమా 'రాజు వెడ్స్ రాంబాయి' (Raju Weds Rambai). తెలంగాణలోని ఓ పల్లెటూరిలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా ఈ కథను రాసుకున్నానని డెబ్యూ డైరెక్టర్ సాయిలు కంపాటి (Saailu Kaampati) తెలిపాడు. గతంలో 'నీదీ నాదీ ఒకే కథ', 'విరాట పర్వం' వంటి సెన్సిబుల్ మూవీస్ ను తెరకెక్కించిన వేణు ఊడుగుల (Venu Udugula), మిత్రుడు రాహుల్ మోపిదేవితో కలిసి ఈ సినిమాను నిర్మించాడు. ఇటీవలి కాలంలో మంచి సక్సెస్ రేట్ తో దూసుకుపోతున్న ఈటీవీ విన్ ఈ సినిమాకు దన్నుగా నిలిచింది. దాంతో సహజంగానే 'రాజు వెడ్స్ రాంబాయి'కి పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయ్యాయి. మరి వాటిని ఈ సినిమా నిలబెట్టుకుందో లేదో చూద్దాం...

పల్లెటూరిలో బ్యాండ్ మాస్టర్ రమేశ్‌ (శివాజీ రాజా Shivaji Raja) కొడుకైన రాజు (అఖిల్ రాజ్ Akhil Raj) అదే ఊరిలో తన ఇంటి ఎదురుగా ఉండే రాంబాయి (తేజస్వి రావ్ Tejaswi Rao)తో ప్రేమలో పడతాడు. అతనిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కాదు. ఆ అమ్మాయి పుష్పవతి అయినప్పుడు మొదలైన ప్రేమ! రాజు కొట్టే డప్పుకు ఫిదా అయిపోతుంది రాంబాయి. కుల వృత్తిని నమ్ముకుని బతకలేమని గ్రహించిన రాజు తండ్రి... అతన్ని పట్నం వెళ్ళి ఏదో ఒక పని చేసుకోమని పోరుతూ ఉంటాడు. రాంబాయి ప్రేమలో పడిన రాజు అందుకు ఒప్పుకోడు. రాజుతో తన కూతురు ప్రేమలో పడిందన్న విషయం తెలుసుకున్న రాంబాయి తండ్రి, కాంపౌండర్ వెంకన్న (చైతు జొన్నలగడ్డ Chaithu Jonnalagadda)కు తిక్క లేచిపోతుంది. దాంతో రాజు ఇంటికి వెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు. ఊహించని ఈ అవమానంతో రాజు తండ్రి గుండెపోటుతో కన్నుమూస్తాడు. తండ్రి మరణంతో ఆయన కోరిక మేరకు రాజు సిటీకి వచ్చేస్తాడు. అలా పేరెంట్స్ కారణంగా దూరమైపోయిన ఈ ఇద్దరు ప్రేమికుల జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయన్నదే కథ. అప్పటి వరకూ ఇది సాదాసీదా ప్రేమ కథలా సాగిపోయిన ఈ సినిమా సిటీలో ఉండలేక రాజు తిరిగి పల్లెటూరి వచ్చిన తర్వాత ఊహించని మలుపులు తిరుగుతుంది. పెద్దల్ని ఒప్పించడానికి ఈ ప్రేమికులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? దాని కారణంగా ఎలాంటి విపత్తును ఎదుర్కోవాల్సి వచ్చింది? చనిపోయే వరకూ కలిసి బతకాలని వారు తీసుకునే సాహసోపేత నిర్ణయానికి కారణం ఏమిటీ? అనేది అసలు ట్విస్ట్.

rwr.jpeg


ఓ చిన్న పాయింట్ ను తీసుకుని దర్శకుడు సాయిలు రెండు గంటల సినిమాను తీశాడు. అయితే మూవీ ప్రారంభం నుండి ముగింపు వరకూ బోర్ కొట్టకొట్టకుండా చేసింది పాటలు, నేపథ్య సంగీతం, నటీనటుల సహజ నటన. నిజం చెప్పాలంటే ఈ సినిమాలో హీరోహీరోయిన్లకు సంబంధించి పెద్ద కాన్ ఫ్లిక్ట్ ఏదీ లేదు. హీరోయిన్ తండ్రి చేసే ఘాతుకం, దాన్ని వారు ఎదుర్కొన్న తీరు ప్రేక్షకులను కాస్తంత ఆందోళనకు గురిచేస్తాయి. కానీ అవన్నీ చివరి అరగంటలో హడావుడిగా జరిగే ఘటనలే!

ఈ మూవీ రిలీజ్ కు ముందు దర్శకుడు చేసిన సవాలు, ముఖానికి గుడ్డ కట్టుకుని ఈ సంఘటన జరిగిన గ్రామవాసి చెప్పిన మాటలు, వాటిని ఏదేదోగా ఊహించుకుని సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్స్... ప్రేక్షకులను థియేటర్లకు ఓ మేరకు తీసుకు రావచ్చు. అయితే సినిమాలోని పాయింట్ తో ఆడియెన్స్ కనెక్ట్ అయితే ఓకే కానీ లేకపోతే ఈ మాత్రం దానికే ఇంత బిల్డప్ ఇచ్చారేంటీ? ఏవేవో సినిమాలతో దీన్ని పోల్చారేమిటీ? అనుకొనే ఆస్కారం లేకపోలేదు.


ఒక విషయంలో దర్శకుడు సాయిలు ను అభినందించాలి. పెద్దగా కెమెరాకు అలవాటు పడని హీరోహీరోయిన్లు అఖిల్ రాజ్, తేజస్విని నుండి చక్కని నటనను రాబట్టాడు. శివాజీ రాజా, అనితా చౌదరి, కవిత శ్రీరంగం, విక్రమ్ ఆదిత్య, సాయిరాం ఇలా అందరూ బాగా నటించారు. ఈ సినిమాలో కీలకమైన పాత్ర సిద్ధు జొన్నలగడ్డ బ్రదర్ చైతు జొన్నలగడ్డ ది. అతను గతంలో కొన్ని సినిమాలలో నటించినా... ఇందులో వెంకన్న పాత్రను అదరగొట్టాడు. కాకపోతే ఆ పాత్ర మీద దర్శకుడు ఇంకాస్తంత ఫోకస్ పెట్టి ఉండాల్సింది. హీరో హీరోయిన్లు పెళ్ళి పీటలు ఎక్కడం కోసం ఎన్నెన్నో ప్లాన్స్ వేసుకుని చేసిన ఓ పనిని వెంకన్న సింపుల్ గా తెగ్గొట్టేయడం సరిగ్గా అనిపించదు. మెట్టపల్లి సురేందర్(Mettapalli Surendar) రాసిన పాటలు అర్థవంతంగా, ఆర్తిని గొలిపే విధంగా ఉన్నాయి. బాణీలతో పాటు చక్కని నేపథ్య సంగీతాన్ని సురేశ్ బొబ్బిలి (Suresh Bobbili) అందించి మూవీని నిలబెట్టాడు. వాజిద్ బేగ్ (Wajid Baig) సినిమాటోగ్రఫీ కన్నులకు ఇంపుగా ఉంది. ఆడంబరాలకు పోకుండా పరిమితమైన బడ్జెట్ లో వేణు ఉడుగుల, రాహుల్ సినిమాను నిర్మించారు. వంశీ నందిపాటి, బన్నీ వాసు ఈ సినిమాను విడుదల చేయడం కలిసి వచ్చే అంశం. అయితే ఏవేవో ఊహించుకుని కాకుండా... ఎలాంటి అంచనాలు లేకుండా... థియేటర్ కు వెళితే 'రాజు వెడ్స్ రాంబాయి' చక్కని అనుభూతిని కలిగిస్తుంది.

రేటింగ్: 2.75/5

ట్యాగ్ లైన్: బ్రేవ్ లవ్ స్టోరీ!

Updated Date - Nov 20 , 2025 | 10:17 PM