Dude Review: డ్యూడ్ మూవీ ఎలా ఉందంటే
ABN , Publish Date - Oct 17 , 2025 | 05:16 PM
ప్రదీప్ రంగనాథన్ 'లవ్ టుడే’, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు. దీపావళి సందర్భంగా ఆయన కథానాయకుడిగా వచ్చిన చిత్రం 'డ్యూడ్’ ప్రేమలు చిత్రం ఫేమ్ మమితా బైజు కథానాయిక. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
’సినిమా రివ్యూ: డ్యూడ్ (Dude Review)
విడుదల తేది: 17–10–2025
తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘లవ్ టుడే’, ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరించాయి. దీపావళి సందర్భంగా ఆయన తాజా చిత్రం 'డ్యూడ్’గా ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘ప్రేమలు’ ఫేమ్ మమితా బైజు కథానాయిక. కీర్తిశ్వరన్ దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరీ దీనికి ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూద్దాం.
కథ: (Dude Story)
గగన్ (ప్రదీప్ రంగనాథన్) పశుసంవర్థక శాఖ మంత్రి ఆదికేశవులు(శరత్ కుమార్)కు మేనల్లుడు. మంత్రి కూతురు కుందన (మమితా బైజు) గగన్ ను ప్రేమిస్తుంది. ఆ విషయం గగన్ కు చెబుతుంది కూడా. అయితే ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం వల్ల తనకు అలాంటి ఫీలింగ్ ఏమీ లేదని ఆమె ప్రేమను తిరస్కరిస్తాడు గగన్. ఆ బాధ నుంచి బయట పడటం కోసం బెంగళూరుకు షిప్ట్ అవుతుంది కుందన. ఎప్పుడూ తన పక్కనే ఉండే మరదలు కమ్ స్నేహితురాలు దూరం అయ్యేసరికి గగన్ మనసులో ప్రేమ బయట పడుతుంది. అదే విషయాన్ని మంత్రి మావయ్యతో చెప్పడంతో సంతోషంగా పెళ్లికి సిద్ధం చేస్తాడు. అయితే గగన్ దూరమైన తర్వాత కుందన పార్థుని ప్రేమిస్తుంది. కానీ తండ్రి మాట మాటను దిక్కరించలేక పెళ్లి పీటలెక్కుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? గగన్ చేసిన త్యాగం ఏంటి? చివరకు ఏం జరిగిందన్నదే కథ.
విశ్లేషణ:
'ఉంటే ఇద్దరం ఆనందంగా ఉండాలి.. లేదంటే ఇద్దరం నాశనం అయిపోవాలి’ అని భావించే మరదలు, ప్రేమించిన అమ్మాయి తనకు దక్కక పోయినా ఆమె ఆనందంగా ఉండాలనుకునే ఓ బావ కథ ఇది. చిన్నప్పటి కలిసి పెరిగిన మనిషిపై ప్రేమ పుట్టడం, బ్రేకప్ కావడం, మధ్యలో కుటుంబ బంధాలు, పరువు హత్యలు ఇలాంటి కథలు చాలానే చూశాం. కథగా చూస్తే ఇదేమీ కొత్తది కాదు. వివిధ భాషల్లో చూపిస ప్రేమకథల్లో ఇదీ ఒకటి. కథ మొదలైంది మొదలు ముందు ఏం జరగబోతుందో ప్రేక్షకుడి ఊహకు అందుతుంది. రొటీన్ కథే అయినా దర్శకుడు కథను నడిపించిన తీరు సినిమాపై ఆసక్తి కలిగిస్తుంది. నిజానికి రాజకీయ నేపథ్యమున్న కథలో సీరియస్ ఉంటుంది. కానీ ఇది ఫన్ రైడ్ లా ఉంది. ఫస్టాఫ్ అంతా హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సంఘర్షణ మధ్య నడుస్తుంది. ఇంటర్వెల్లో ట్విస్ట్… ఆర్య, ఆర్య 2’ చిత్రాలను గుర్తుకు తెస్తుంది. సెకండాఫ్ లో కొన్ని సీన్స్ ప్రేక్షకులు అంగీకరించేలా లేకపోయినా క్లైమాక్స్కు వచ్చేసరికి కన్విన్స్ అయ్యేలా చేశాడు దర్శకుడు. సీన్స్, హీరో క్యారెక్టరైజేషన్, మేనరిజమ్స్ కొన్ని చోట్ల ఆకట్టుకునేలా ఉన్నాయి. కొన్ని మాత్రం ఎక్కడో చూశామే అనిపిస్తాయి. సీరియస్ గా సాగే క్లైమాక్స్ లో కూడా చిన్న ఫన్ క్రియేట్ చేశాడు డైరెక్టర్. పరువు హత్యల నేపథ్యంలో చిన్న సందేశం కూడా ఉంది. సినిమాలో కొన్ని లోపాలు ఉన్నా యువతలో ప్రదీప్ రంగనాథన్ కు ఉన్న క్రేజ్ తో అవి కొట్టుకు పోతాయి.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..
ప్రదీప్ రంగనాథన్. మమితా బైజు నటన సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి. ప్రత్యేకించి ప్రదీప్ రంగనాథన్ తన ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్తో మరోసారి ఆల్ రౌండర్ అనిపించాడు. తనదైన స్టయిల్ని చూపిస్తూ.. సినిమాలో హై ఎనర్జీని చూపించాడు. ఇక శరత్కుమార్ పోషించిన రాజకీయ నాయకుడి క్యారెక్టర్ ఫన్ గా ఉండి అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ‘ఏంటీ క్రింజ్గా ఉందా?? పక్కోడి ఫీలింగ్ క్రింజ్గా చూడటమే కదా ప్రజెంట్ ట్రెండ్’ వంటి డైలాగ్స్ కొన్ని యూత్కి కనెక్ట్ అవుతాయి. ‘పరువుపోయిందని బాధపడేవాళ్లు ప్రాణాలు తీయడం ఎందుకు? ప్రాణాలు తీసుకోవచ్చు కదా’ వంటి డైలాగ్ ఇప్పటికీ సొసైటీలో జరుగుతున్న పరువు హత్యలకు సెటైర్ గా భావించవచ్చు. పార్థు గా హృదూ హరూన్ గుర్తిండిపోతాడు. సత్య, నేహా శెట్టి ఇలా వచ్చి అలా వెళ్లిపోతారు. హీరో తల్లిగా రోహిణి మెరిశారు. సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ పాటలు సినిమా వరకూ ఓకె. నేపథ్య సంగీతం ఫర్వాలేదు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బావున్నాయి. కెమెరా వర్క్ నీట్గా ఉంది. ఎడిటర్ అనవసర సన్నివేశాలకు కాస్త కత్తెర వేసి ఉండాల్సింది. తెలుగు నిర్మాతలు తీసిన తమిళ చిత్రం తెలుగులో డబ్ చేసినపుడు బ్యాక్ గ్రౌండ్ లో తమిళ బోర్డులు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సింది.
ఏ భాషలో అయినా ప్రేమ కథలు కోకొల్లలుగా వస్తుంటాయి. అవన్నీ దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ ప్రేమను వ్యక్తం చేయడంలోనే తేడా ఉంటుంది. దానిని ఆవిష్కరించే విధానం కొత్తగా ఉండాలి. దర్శకుడి కథలో ఆ కొత్తదనం లేకున్నా ప్రెజెంటేషన్ యూత్ ని మెప్పించేలా ఉంది. మరీ ముఖ్యంగా ఇది ప్రదీప్ రంగనాథన్ వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. మొత్తంగా చూస్తే బాగుంది అనిపిస్తుంది తప్ప ప్రదీప్ ముందు సినిమాల్లాగా అందరినీ అలరించే చిత్రం మాత్రం కాదు.
రేటింగ్: 2.5/5
ట్యాగ్ లైన్: లైట్ తీస్కో ‘డ్యూడ్’