Paanch Minar Movie Review: రాజ్ తరుణ్.. 'పాంచ్ మినార్' సినిమా రివ్యూ

ABN , Publish Date - Nov 20 , 2025 | 07:27 PM

యంగ్ హీరో రాజ్ తరుణ్‌ (Raj Tarun) నటించిన 'చిరంజీవ' (Chiranjeeva) సినిమా నవంబర్ ఫస్ట్ వీక్ లో ఆహా (AHA) లో స్ట్రీమింగ్ అయ్యింది. బట్.. కొత్తదనం లేని ఆ సినిమా వ్యూవర్స్ ను పెద్దంత ఆకట్టుకున్న దాఖలాలు లేవు. దాంతో తన నెక్ట్స్ మూవీ 'పాంచ్ మినార్' మీదే రాజ్ తరుణ్‌ ఆశలు పెట్టుకున్నాడు. ఈ యేడాది ప్రారంభంలో విడుదల కావాల్సిన ఈ సినిమా ఎట్టకేలకు నవంబర్ 21న జనం ముందుకు వస్తోంది. సో... క్రైమ్ కామెడీగా తెరకెక్కిన 'పాంచ్ మినార్' (Paanch Minar) ఎలా ఉందో తెలుసుకుందాం.

Paanch Minar Movie

కృష్ణ చైతన్య ఉరఫ్ కిట్టు (రాజ్ తరుణ్)కు ఈజీ మనీ మీద ఆసక్తి ఎక్కువ. కష్టపడి పనిచేసి డబ్బులు సంపాదించాలంటే బద్దకం. కానీ అతని లవర్ ఖ్యాతి (రాశీ సింగ్ Rashi Singh) ఇందుకు పూర్తి భిన్నం. అతన్ని ఏదో ఒక ఉద్యోగంలో కుదిర్చి, ఆ తర్వాత తండ్రికి చెప్పి పెళ్ళి చేసుకోవాలని ఆశ పడుతూ ఉంటుంది. అబద్ధాలు చెబుతూ బతకడం అలవాటైన కిట్టు... ఖ్యాతికి ఉద్యోగం దొరికిందని నమ్మబలికి, గత్యంతరం లేని పరిస్థితిలో క్యాబ్ డ్రైవర్ గా చేరతాడు. అక్కడ ఇన్సెంటివ్స్ సంపాదించడం కోసం చెవిటి వాడిగా నటిస్తాడు. ఓసారి అతని క్యాబ్ లో ఇద్దరు కాంట్రాక్ట్ కిల్లర్స్ ఎక్కుతారు. చోటూ (రవివర్మ Ravi Varma) అనే వ్యక్తిని చంపటానికి ఐదు కోట్ల రూపాయలకు డీల్ కుదుర్చుకుంటారు. అనుకున్నట్టుగానే చోటూను చంపేస్తారు. డబ్బుల్ని కలెక్ట్ చేసుకునే ముందు కిట్టును కూడా చంపేయాలనుకుంటారు. చెవిటి వాడిగా నటించిన కిట్టుకు ఇది తెలిసి, వాళ్ళ నుండి తప్పించుకుంటాడు. పోలీసులకు కిరాయి హంతకులు చిక్కడంతో, ఐదు కోట్లతో కిట్టు ఉడాయిస్తాడు. అయితే ఆ తర్వాత సీన్ రివర్స్ అవుతుంది. ఒక పక్క కిరాయి హంతకులు, మరో పక్క పోలీస్ ఆఫీసర్, ఇంకో పక్క కారు ఓనర్ కిట్టుని చుట్టుముడతారు? కిట్టు నుండి వాళ్ళు కోరుకుంటోంది ఏమిటీ? వారి నుండి కిట్టు ఎలా తప్పించుకున్నాడు? అనేదే మిగతా కథ.


గత కొంతకాలంగా రాజ్ తరుణ్‌ నటించిన సినిమాలేవీ కమర్షియల్ గా సక్సెస్ కావడంలేదు. ఇతరత్రా కారణాలతో అతను మీడియాలో నానుతున్నాడు తప్పితే... అతని సినిమాలు, వాటి బాగోగుల గురించి చర్చిస్తున్న వారే లేరు. అయితే ఇప్పుడు రాజ్ తరుణ్‌ ఆ ఫేజ్ నుండి బయట పడ్డాడనిపిస్తోంది. ఈ మధ్య కాలంలో కెరీర్ మీద కూడా ఫోకస్ పెడుతున్నాడు. అలా చూసినప్పుడు అతనికి సరైన సమయంలో వచ్చిన... సరైన సినిమా 'పాంచ్ మినార్' అనుకోవచ్చు. కథలో కొత్తదనం లేకపోయినా... ఇది రొటీన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీనే అయినా... దర్శకుడు రామ్ కుడుముల ఎక్కడా బోర్ అనేది కొట్టకుండా రెండు గంటల పాటు నాన్ స్టాప్ గా కథను ఉరికించాడు. హీరో, హీరోయిన్ల లవ్ ట్రాక్ పెద్దంత ఇంట్రస్ట్ గా లేకున్నా... కిట్టు కష్టాల్లోంచి కామెడీని జనరేట్ చేసి ఓ మేరకు ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశాడు.


నటీనటుల విషయానికి వస్తే... ఇలాంటి పాత్రలు చేయడం రాజ్ తరుణ్‌ కు కొట్టిన పిండే. అయితే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ క్యారెక్టర్ లో మెప్పించాడు. రాశి సింగ్ పాత్ర పరిధి చిన్నదే అయినా ఫర్వాలేదనిపించింది. ఈ కథను ప్రధానంగా రన్ చేసింది అజయ్ ఘోష్ (Ajay Ghosh) అతని పక్కన ఉండే గ్యాంగ్. ఫిష్ వెంకట్ (Fish Venkat) చనిపోవడానికి ముందు చేసిన సినిమాల్లో ఇదీ ఒకటి. అతని ప్రెజెన్స్ బాగుంది. హీరో తల్లిదండ్రులుగా బిందు చంద్రమౌళి, బ్రహ్మాజీ (Brahmaji); హీరోయిన్ తండ్రిగా శివన్నారాయణ బాగా చేశారు. కాంట్రాక్ట్ కిల్లర్స్ గా నందగోపాల్, అజీజ్ నాజర్ చక్కగా సెట్ అయ్యారు. కరప్టెడ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నితిన్ ప్రసన్న కొత్తగా కనిపించాడు. శ్రీనివాసరెడ్డి (Srinivasa Reddy), నెల్లూరు సుదర్శన్, కృష్ణ తేజ, మీసాల లక్ష్మణ్ కామెడీని బాగా పండించారు. జీవా (Jeeva), రవివర్మ తండ్రీ కొడులుగా నటించారు. పాటలు... కథను ముందుకు తీసుకెళ్ళేవి కాకపోయినా... ట్యూన్స్ క్యాచీగా ఉండటం, వాటి పిక్చరైజేషన్ బాగుండటంతో కాస్తంత రిలీఫ్ ను ఇచ్చాయి. శేఖర్ చంద్ర (Shekar Chandra) నేపథ్య సంగీతం అలరించేలా ఉంది. రామ్ కుడుముల (Ram Kudumula) దర్శకుడిగా మంచి మార్కులే పొందాడు. నిర్మాతలు మాధవి, ఎంఎస్ఎం రెడ్డి ఈ క్రైమ్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ కోసం బాగానే ఖర్చు పెట్టారు. భారీ అంచనాలు పెట్టుకోకుండా సరదాగా ఓసారి ఈ మూవీని చూసేయొచ్చు!

రేటింగ్ : 2.5 / 5

ట్యాగ్ లైన్: ఫన్ మినార్

Updated Date - Nov 20 , 2025 | 07:33 PM