Gurram Papireddy Review: డార్క్ కామెడీ థ్రిల్లర్ 'గుర్రం పాపిరెడ్డి' ఎలా ఉందంటే
ABN , Publish Date - Dec 20 , 2025 | 10:35 AM
ఈ వారం పెద్ద చిత్రాల సందడి లేకపోవడంతో చిన్న చిత్రాలు క్యూ కట్టాయి. ఒకటి. నరేశ్ అగస్త్య - ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన గుర్రం పాపిరెడ్డి చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన చిత్రమిది.
సినిమా రివ్యూ: గుర్రం పాపిరెడ్డి
విడుదల తేది: 19-12-2025
ఈ వారం పెద్ద చిత్రాల సందడి లేకపోవడంతో చిన్న చిత్రాలు క్యూ కట్టాయి. ఒకటి. నరేశ్ అగస్త్య - ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన గుర్రం పాపిరెడ్డి చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మురళీ మనోహర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. వేణు సద్ధి, అమర్ బురా, జయకాంత్ నిర్మాతలు. టైటిల్, ట్రైలర్‌తో ఆకట్టుకున్న ఈ చిత్రానికి మంచి బజ్ క్రియేట్ అయింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో చూద్దాం.
కథ:
ఖమ్మం జిల్లాలోని ఓ గ్రామీణ ప్రాంతానికి చెందిన కుర్రాడు గుర్రం పాపిరెడ్డి (నరేశ్ అగస్త్య). ఆటో నడుపుతూ జనాలకి చేతనైనా సాయం చేస్తుంటాడు. కష్టపడి ఎంబీఏ పూర్తి చేసి ఏదో సాధించాలనుకుంటాడు. తను అనుకున్నది జరగకపోవడంతో డబ్బు సంపాదన కోసం ఓ బ్యాంక్ దోపిడీ చేయాలనుకుంటాడు. అది విఫలమై మరో రూట్ ఎంచుకుంటాడు. పలు కారణాల వల్ల ఎర్రగడ్డ మెంటల్ ఆస్పత్రిలో చేరడంతో అక్కడ నర్సుగా పని చేస్తున్న సౌదామిని (ఫరియా అబ్దుల్లా)తో పరిచయం ఏర్పడుతుంది. ఆమెది మరో కష్టం. ఇద్దరూ కలిసి కోట్లు కొల్లగొట్టేందుకు ప్లాన్ చేస్తారు. వారికి మిలటరీ (రాజ్‌కుమార్ కసిరెడ్డి), చిలిపి(వంశీధర్), గొయ్యి (జీవన్) తోడవుతారు. ప్లాన్‌లో భాగంగా శ్రీశైలంలో ఓ శ్మశానంలోని శవాన్ని బయటకు తీసుకొచ్చి.. దాన్ని శ్రీనగర్‌లో ఉన్న కళింగ పోతురాజు సమాధిలో పెట్టాలనుకుంటాడు. దీని కోసం శ్రీశైలం వెళ్లిన పాపిరెడ్డి టీమ్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి. ఆ శవాలు ఎవరివి? వాటిని ఎందుకు మార్చాల్సి వచ్చింది? స్వాతంత్ర్యానికి ముందునాటి కళింగ- బాలిక - చెర సంస్థానాలకు వీరికి ఉన్న సంబంధం ఏంటి అన్నది కథ.
విశ్లేషణ:
డబ్బు సంపాదించడానికి ఓ యువకుడు చేసిన తెలివి తక్కువ పని ఎంత వరకూ తీసుకెళ్లింది. అతనికి మరో నలుగురు తెలివి తక్కువ కుర్రాళ్లు కలిస్తే ఏమైంది. హీరో తెలివి తక్కువతనం వెనుకున్న మాస్టర్ ప్లాన్ ఏంటి? అన్నది సింపుల్‌గా ఈ సినిమా కథ. డార్క్ కామెడీ థ్రిల్లర్ ఇది. దర్శకుడు రొటీన్‌గా కాకుండా కాస్త భిన్నంగా రాసుకుని ఎగ్జిక్యూట్ చేశారు. స్టూపిడిటీ అంటూ బ్రహ్మానందం కోర్ట్ సీన్‌తో కథ మొదలుపెట్టి పాత్రల్ని పరిచయం చేశారు. ఆ సన్నివేశాలు లెంగ్త్ ఎక్కువైనా సరదాగా సాగిపోయాయి. తదుపరి అసలు కథలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. హీరోహీరోయిన్ కలిసి చేసే ప్లాన్స్, వారికి మరో ముగ్గురు తోడు కావడం శ్రీశైలం అడవుల్లో ఉన్న సమాధిలో శవాన్ని మార్చడానికి పడిన పాట్లు వినోదాన్ని పండించాయి. సమాధిలో ఉన్న శవాలకు స్వాతంత్ర్యానికి ముందు మూడు సంస్థానాలకు లింక్ చేసిన తీరు బావుంది. ఫస్టాప్ అంతా ఈ శవాల చుట్టే కథ తిరుగుతుంది. అక్కడి నుంచి శ్మశానంలో గొయ్యిలు తవ్వే గొయ్యి (జీవన్) కళింగ సంస్థ్థాన వారసుడు అంటూ పాపిరెడ్డి కోర్టు మెట్లు ఎక్కడంతో కథలో ఇంటెన్స్ మొదలవుతుంది. ఈ సన్నివేశాలతో సెకెండాఫ్‌పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది. కానీ సెకెండాఫ్ ప్రారంభమైన తర్వాత కోర్ట్ రూమ్ డ్రామా ఫన్ క్రియేట్ చేసినా అనవసర పాత్రలు రావడంతో కథలో సీరియస్‌నెస్ మిస్ అయింది. కథ అక్కడక్కడే తిరిగిందన్న భావన కలుగుతుంది. స్క్రీన్ ప్లే డల్‌గా ఉంది. హీరో వేసే ప్రతి ప్లాన్ ఆడియన్ యాక్సెప్ట్ చేసేలా ఉండవు. ప్రీ క్లైమాక్స్ మాత్రం ఆసక్తికరంగా తెరకెక్కించారు. అక్కడే డైరెక్టర్ ఇంకాస్త దృష్టి పెట్టుంటే బావుండేది. పార్ట్-2కు లీడ్ ఇస్తూ సినిమాను ముగించిన తీరు మాత్రం బావుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు...
గుర్రం పాపిరెడ్డి పాత్రలో నరేశ్ అగస్త్య నటన ఆకట్టుకుంటుంది. సౌదామినిగా ఫరియా అబ్దుల్లా మెప్పించింది. హీరోహీరోయిన్ ఇద్దరూ సినిమాకు ప్లస్సే. మిలటరీ పాత్రలో రాజ్‌కుమార్.. చిలిపిగా వంశీ నవ్విస్తారు. తెరపై ఇద్దరూ కనిపించిన ప్రతిసారీ ప్రేక్షకులు పూయించారు. అమాయకమైన పాత్రలో గొయ్యిగా జీవన్ నటన బావుంది. ఇందులో న్యాయమూర్తి పాత్రలో బ్రహ్మానందం కనిపించారు. ఆ సీన్ జాతిరత్నాలు సీన్‌ను దించేసినట్లు అనిపిస్తుంది. ఉడ్ రాజుగా యోగిబాబు కనిపించాడు. ఆ పాత్రకు అంత ప్రాధాన్యం ఏమీ కనిపించలేదు. అదే పాత్ర చేయడానికి తెలుగులోనూ చాలామంది ఆర్టిస్ట్‌లు ఉన్నారు. గ్రీవ్ బ్రదర్స్‌గా జాన్ విజయ్, రాజేంద్రన్ ఫర్వాలేదనిపించారు. ఇక సాంకేతిక విషయానికొస్తే.. అర్జున్ రాజా కెమెరా పనితనం, కృష్ణ సౌరభ్ సంగీతం సినిమాకు ఎసెట్. వేణు సద్ధి, అమర్ బురా, జయకాంత్ నిర్మాణ విలువలు కథకు తగ్గటు ఉన్నాయి. ఎడిటర్ ఫస్టాఫ్‌కు, సెకెండాఫ్‌లో కోర్ట్ సీన్స్‌కు కాస్త కత్తెర వేసుంటే బావుండేది. ఈ డార్క్ కామెడీగా దర్శకుడు రాసుకున్న కథ బావుంది. కానీ కొన్ని సన్నివేశాల ఎగ్జిక్యూషన్‌లో దర్శకుడి పనితీరు మిస్ ఫైర్ అయింది. అయితే క్లైమాక్స్, ఫినిషింగ్ టచ్ గా ఇచ్చిన .క్లైమాక్స్ ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఓవరాల్‌గా సినిమాలో ఉన్న ల్యాగ్‌ను పక్కనపెడితే, డార్క్ కామెడీ ఇష్టపడే వాళ్లకు సినిమా నచ్చుతుంది.
ట్యాగ్‌లైన్: డార్క్ కామెడీ థ్రిల్లర్..
రేటింగ్: 2.5/5