Mowgli Movie Review: రోషన్ కనకాల మోగ్లీ మూవీ రివ్యూ

ABN , Publish Date - Dec 13 , 2025 | 10:48 AM

సుమ కనకాల, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ హీరోగా నటించిన సెకండ్ మూవీ 'మోగ్లీ'. సాక్షి మడోల్కర్ హీరోయిన్ గా, బండి సరోజ్ విలన్ గా నటించిన 'మోగ్లీ' శనివారం జనం ముందుకొచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం.

Mowgli Movie

పాపులర్ యాంకర్ సుమ (Suma), నటుడు రాజీవ్ కనకాల (Rajeev Kanakala) కొడుకు రోషన్ (Roshan) హీరోగా నటించిన ఫస్ట్ మూవీ 'బుబుల్ గమ్' (Babulgum) రెండేళ్ళ క్రితం డిసెంబర్ లోనే రిలీజ్ అయ్యింది. ఇప్పుడూ అతని రెండో సినిమా 'మోగ్లీ' (Mowgli) కూడా అదే నెలలో వచ్చింది. 'కలర్ ఫోటో' మూవీతో దర్శకుడి మంచి గుర్తింపు పొందిన నటుడు, రచయిత సందీప్ రాజ్ (Sandeep Raj) కూ ఇది రెండో సినిమా! ఇక తమిళంతో పాటు తెలుగులోనూ కొన్ని సినిమాలు డైరెక్ట్ చేసి కేవలం ఫిల్మ్ మేకర్స్ గానే కాదు యాటిట్యూడ్ యాక్టర్ గానూ పేరు తెచ్చుకున్న బండి సరోజ్ కుమార్ (Bandi Saoj Kumar) 'మోగ్లీ'లో విలన్ గా నటించాడు. దాంతో సహజంగానే అందరి అటెన్షన్ 'మోగ్లీ' మీదకు మళ్ళింది. పైగా 'అఖండ 2' కారణంగా తమ సినిమా విడుదల అయోమయంలో పడిపోయిందంటూ సందీప్ రాజ్, సరోజ్ కుమార్ సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సెన్సార్ బృందంపై చేసిన విమర్శలు కూడా ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ తెచ్చిపెట్టాయి. మరి ఈ నేపథ్యంలో వచ్చిన 'మోగ్లీ' ఎలా ఉందో చూద్దాం.

అనాథ అయిన మురళీ (రోషన్ కనకాల) అడవిలో పెరుగుతాడు. దానికి దగ్గరలోని పార్వతీపురంలో వాళ్ళంతా అతన్ని మోగ్లీ అని పిలుస్తుంటారు. చనిపోయిన తన తండ్రిలా తానూ పోలీస్ అవ్వాలన్నది మోగ్లీ కోరిక. పార్వతీ పురంలో ఏ సినిమా షూటింగ్ జరగాలన్నా... మోగ్లీ సహకారం తప్పని సరి. ఓ సినిమా షూటింగ్ కూడా అలా మొదలవుతుంది. అందులో డాన్స్ అసిస్టెంట్ గా వచ్చిన జాస్మిన్ (సాక్షి మడోల్కర్) తో తొలిచూపు ప్రేమలో పడిపోతాడు మోగ్లీ. అయితే ఆ సినిమా నిర్మాత సైతం జాస్మిన్ ను ఇష్టపడతాడు. ఆమెను ఎలాగైనా అనుభవించాలనుకుంటాడు. కానీ ట్విస్ట్ ఏమిటంటే... అదే ఊరిలోని ఎస్.ఐ. క్రిస్టోఫర్ నోలన్ (బండి సరోజ్ కుమార్) జాస్మిన్ పై మనసు పడతాడు. ఈ విషయం తెలుసుకున్న మోగ్లీ, జాస్మిన్ అతని నుండి తప్పించుకుని అడవిలోకి పారిపోతారు. అడివిలో ఉన్న ఈ ప్రేమ జంటను నోలన్ ఎలా బయటకు రప్పించాడు? వారిని ఎలాంటి చిత్రహింసలకు గురిచేశాడు? అతను చేసిన పాపాలకు భగవంతుడు నోలన్ కు ఎలాంటి శిక్షవేశాడు? అనేది మిగతా కథ.


సహజంగా ఇలాంటి ప్రేమ కథా చిత్రాలు చాలా వరకూ హ్యాపీ ఎండింగ్ తో ఉంటాయి. ఇదీ అలాంటిదే. కాకపోతే హీరోహీరోయిన్లు ప్రేమను దక్కించుకోవడానికి చేసే పోరాటాన్ని కాస్తంత భిన్నంగా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో చూపించాడు దర్శకుడు సందీప్ రాజ్. హీరోహీరోయిన్ల ను సీతారాములకు ప్రతీకలుగా చూపించడం, హీరోయిన్ పట్ల మోహాన్ని పెంచుకున్న విలన్ ను ఆడవారిని చెరబట్టే రావణాసుడితో పోల్చడం చేశాడు. క్రిటికల్ సిట్యుయేషన్ లో హీరోకు డివైన్ పవర్ సాయం చేసినట్టుగా చూపించాడు. సో... ఈ లవ్ స్టోరీకి చక్కని డివోషనల్ టచ్ ను ఇచ్చి ముగించాడు. విలన్ ను క్రిస్టియన్ గా చూపించిన సందీప్ రాజ్ తెలివిగా హీరో కోసం ప్రాణాలిచ్చే బంటి (హర్ష చెముడు Harsha Chemudu) పాత్రనూ క్రిస్టియన్ గానే చూపించాడు. దాంతో కథ విషయంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదు. అయితే దానిని తెరకెక్కించిన విధానం మరీ ప్రిడిక్టబుల్ గా ఉంది. మూవీ ప్రథమార్ధం సినిమా నేపథ్యంలో సాగడం, షూటింగ్ లో ఎదురయ్యే ఇబ్బందులు, వాటిని హీరో సాల్వ్ చేయడం బోర్ కొట్టకుండానే సాగిపోయింది. మూగ చెవిటి అమ్మాయితో హీరో ప్రేమలో పడటం... ఆ తర్వాత చిన్నపాటి అపోహలు, ఆపైన అవి తొలగిపోవడం ఎంగేజింగ్ గానే ఉంది. పైగా ఇంటర్వెల్ ముందు హీరోయిన్ కు వచ్చే కష్టాలకు సూత్రధారి ఎవరనేది రివీల్ చేసిన విధానం కూడా బాగుంది. కానీ సెంకడ్ హాఫ్‌లో మొనాటనీ అయిపోయింది. ఎంతసేపు అక్కడక్కడే కథ సాగడంతో ప్రేక్షకుడు నిదానంగా అందులోని పాత్రలలో డిటాచ్ అయిపోవడం మొదలవుతాడు. పోరాట సన్నివేశాల లెగ్తీగా అనిపిస్తాయి. కథ ఎటునుండి ఎటు వెళిపోతోందో అర్థం కాని సమయంలో ఠక్కున క్లయిమాక్స్ లోకి వెళ్ళిపోయి.... చిన్నపాటి డివోషనల్ టచ్ తో ఎండ్ కార్డ్ వేసేశారు. ఆ సన్నివేశాలలో ఫీల్ మిస్ అయ్యింది.


తొలి చిత్రం 'బబుల్ గమ్'కు డాన్స్, ఫైట్స్ విషయంలో రోషన్ కనకాల మంచి పేరు వచ్చింది. ఇందులో కాస్తంత పెయిన్ ఉన్న పాత్రను చేసి మెప్పించాడు. అయితే నటుడిగా ఇంకా ఇంప్రూవ్ కావాల్సింది చాలా ఉంది. కాకపోతే నూటికి నూరు శాతం అతను కష్టపడుతున్నాడనేది అర్థమౌతోంది. మూగ చెవిటి అమ్మాయిగా నూతన నటి సాక్షి మడోల్కర్ బాగా చేసింది. కొన్ని చోట్ల క్యూట్ గా బాగుంది. కొన్ని చోట్ల తేలిపోయింది. ఇక విలన్ గా అనుకున్నట్టుగానే బండి సరోజ్ ఇరగ దీశాడు. గొంతు కాస్తంత పీలగా ఉన్నా... ఓకే! అతని ఎంట్రీనే కాదు... ఎండింగ్ సీన్ సైతం బాగుంది. పోలీస్ స్టేషన్ ఫైట్ మేకర్స్ చెప్పినంత కాదు కానీ బాగానే ఉంది. తెలుగు సినిమాకు బండి సరోజ్ రూపంలో ఓ కొత్త విలన్ దొరికాడని అనుకోవచ్చు. హీరోగానే కంటిన్యూ కావాలని అనుకుంటున్న సరోజ్ విలన్ పాత్రలు ఎంత వరకూ యాక్సెప్ట్ చేస్తాడో చూడాలి. ఈ మధ్య కాలంలో వైవా హర్షకు మంచి మంచి పాత్రలు దొరుకుతున్నాయి. అందులో ఇది కూడా ఒకటి. కృష్ణ భగవాన్ (Krishna Bhagawan) చాలా కాలం తర్వాత తెర మీద కనిపించాడు. తనికెళ్ళ రమణ భార్గవ్ కు మంచి పాత్ర దక్కింది. రియా సుమన్ గెస్ట్ రోల్ చేసింది. అవసరాల శ్రీనివాస్ కనిపించేది కాసేపే అయినా బాగానే చేశాడు. దర్శకుడు సందీప్ రాజ్, 'కలర్ ఫోటో' హీరో సుహాస్ ఇందులో మెరుపులా మెరిశారు. చాలామంది ఆర్టిస్టులు ఇందులో ఉన్నారు. అందరినీ చక్కగానే సందీప్ రాజ్ ఉపయోగించుకున్నాడు.

కాలభైరవ సంగీతం, నటరాజ్ మాడిగొండ యాక్షన్, రామ మారుతీ సినిమాటోగ్రఫీ బాగున్నాయి. నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ మేకింగ్ లో ఎక్కడా రాజీ పడలేదు. ఆ విషయం తెర మీద సన్నివేశాలలో కనిపిస్తోంది. ఊహకందే కథ, కథనాల కారణంగా 'మోగ్లీ' ఫర్వాలేదనిపించే స్థాయిలోనే ఉండిపోయింది.

ట్యాగ్ లైన్: వయొలెంట్ (సైలెంట్) లవ్ స్టోరీ

రేటింగ్ : 2.5 / 5

Updated Date - Dec 13 , 2025 | 10:49 AM