Stolen OTT Review: స్టోలెన్ మూవీ వణుకు పుట్టించిందా.. ఎలా ఉందంటే?
ABN , Publish Date - Jun 09 , 2025 | 01:02 PM
గతవారం అనామకంగా డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చిన ఓ హిందీ సినిమా స్టోలెన్ ఓటీటీకి పట్టిన బూజును దులిపేస్తూ రికార్డ్ వ్యూస్‌తో సంచనం సృష్టిస్తోంది.
గతవారం డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చిన హిందీ సినిమా స్టోలెన్ (Stolen) ఓటీటీకి పట్టిన బూజును దులిపేస్తూ రికార్డ్ వ్యూస్‌తో సంచనం సృష్టిస్తోంది. కేవలం నాలుగైదు పాత్రల చుట్టూనే తిరిగే ఈ సినిమా అసాంతం సీట్ ఎడ్జ్‌లో కూర్చొబెడుతూ కళ్లు తిప్పనీయకుండా అదిరిపోయే థ్రిల్‌ను ఇస్తోంది. 2023లోనే విడుదలైప ఈ చిత్రం అనేక అవాంతరాలను అధిగమించి ఇటీవల ఓటీటీకి రాగా ప్రజలు ఇప్పుడు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. అరుదుగా వచ్చే మాబ్ లించింగ్ జానర్లో రూపొందిన ఈ చిత్రానికి గతంలో 3 ఇడియట్స్, లగేరహో మున్నాభాయ్ వంటి క్లాసిక్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసిన కరణ్ తేజ్ పాల్ (Karan Tejpal) రచన, దర్శకత్వం వహించడం విశేషం. అదేవిధంగా లేటెస్ట్ బాలీవుడ్ సెన్షేషన్ అభిషేక్ బెనర్జీ (Abhishek Banerjee), శుభం వర్ధన్ (Shubham Vardhan), మియా మెల్జర్ (Mia Maelzer) కీలక పాత్రలు పోషించారు. 2018లో అస్సాంలో జరిగిన ఓ ఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కటం విశేషం.
కథ విషయానికి వస్తే.. గౌతమ్, రామన్ అనే ఇద్దరు అన్నదమ్మలు ఉంటారు. తమ అమ్మ రెండో పెళ్లి చేసుకోబోతుందని తెలిసి రామన్ వేరే ఊరి నుంచి ట్రైన్లో వాళ్లమ్మ, అన్న ఉండే ఊరికి వస్తాడు. అయితే ట్రాఫిక్‌లో ఇరుకున్న గౌతమ్ స్టేషన్ కు వచ్చి రామన్ ను పికప్ చేసుకోవడం ఆలస్యం అవుతుంది. అప్పటికే ట్రైన్ దిగిన రామన్ అన్న కోసం ఎదురు చూస్తుండగా అక్కడే ఓ బల్లపై నిద్రిస్తున్న జుంపా అనే మహిళ దగ్గర నుంచి 5నెలల పాపను ఎవరో కిడ్నాప్ చేస్తారు. ఆ సమయంలో అక్కడే ఉన్న గౌతమ్ రెస్పాండ్ అయే సరికే ఆ కిడ్నాపర్ అక్కడి నుంచి వేగంగా వెళ్లిపోతాడు. ఆ మహిళ నిద్ర నుంచి లేచేసరికి గౌతమ్ చేతిలో ఉన్న క్లాత్ చూసి అతనే కిడ్నాప్ చేశాడంటూ అనుమానిస్తుంది. పోలీసులు రావడం, వాగ్వాదం జరుగుతుంది. ఆ తర్వాత కాసేపటికి అన్న గౌతమ్ అక్కడకు చేరుకుని విషయం తెలుసుకుని సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తాడు. అయితే అప్పటికే ఎవరో ఈ వాగ్వాదాన్ని ఫోన్లో రికార్డ్ చేసి వైరల్ చేస్తారు. దీంతో వీరే కిడ్నాపర్స్ అన్నట్లుగా న్యూస్ వైరల్ అవుతుంది.
అదే సమయంలో అక్కడే టీ స్టాల్ బాయ్ మీద అనుమానం వచ్చి జంపా, పోలీసులు రెక్కీ చేయగా కొన్ని రహాస్యమైన విషయాలు తెలుస్తాయి. దీంతో రామన్ కిడ్నాపర్ కాదని తేల్చుతారు. అయితే అసలు కిడ్నాపర్‌ను పట్టుకోవడానికి సమయం పడుతుందని, చాలా ప్రాసెస్ ఉంటుందని పోలీసులు నిర్లక్ష్యంగా చెప్పడంతో రామన్ వారిపై సీరియస్ అవుతాడు. ఈక్రమంలో గౌతమ్‌కు ఇష్టం లేకపోయినా రామన్ జుంపాకు సాయం చేసేందుకు కిడ్నాపర్‌ను పట్టుకునేందుకు బయలు దేరుతారు. దీంతో గౌతమ్ కూడా వారి వెంట వెళతాడు. అలా కిడ్నాపర్ల ఆచూకీ తెలుసుకుంటూ సమీపంలోని గ్రామాలు తిరుగుతుంటారు. ఇదిలాఉంటే అప్పటికే రైల్వే స్టేషన్లో గొడవ వీడియో వైరల్ కావడంతో పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాగా వీరి ముఖాలు వైరల్ అవుతాయి. ఈ విషయం వారికి తెలియక ఓ ప్రాంతంలో కారు ఆపగా అక్కడి గ్రామస్తులు వీరే కిడ్నాపర్లు అంటూ రాళ్ళు, కర్రలు, తుపాకులతో తిరగబడగా… ఆ ముగ్గురు ఆ విలేజ్‌లో రహస్యంగా ఓ ఇంట్లో తల దాచుకుంటారు. అంతే కాదు జుంపా గతంలో దొంగ అనే విషయం ఆ అన్నదమ్ములకు తెలుస్తుంది. అ్పటికే తమ్ముడికి తూటా తగలడంతో సాయం కోసం గౌతమ్ ఊర్లోకి వెళ్లి అక్కడి జనాలకు దొరికి పోతాడు. ఈ నేపథ్యంలో వారు ఆ గ్రామం నుంచి సురక్షితంగా బయట పడ్డారా? లేదా? అసలు కిడ్నాపర్‌ను పట్టుకోగలిగారా? కిడ్నాప్ అయిన పాప అసలు జుంపా బిడ్డేనా? అనే ఆసక్తికర కథనంతో సాగుతుంది. చివరిలో వచ్చే ట్విస్టు సైతం ఎవరు ఊహించని విధంగా ఉండి ప్రేక్షకులకు అదిరిపోయే థ్రిల్ ను ఇస్తుంది.
ఇప్పటికే పలు దేశాల ఫిల్మ్ ఉత్సవాలలో నామినేట్ అయి అనేక అవార్డులు గెలుచుకుంది ఈ చిత్రం. ఇప్పుడీ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే కేవలం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. కాగా సినిమా చూసే వారికి భాష ఎలాంటి అడ్డంకి కాదు. సినిమా చూశాక మన దేశంలో ఇంకా ఇలాంటి ప్రజలు జీవిస్తున్నారా? ఇంత ఘోరంగా ఉన్నారా? అంటూ మనసు చలించక మానదు. కిడ్నాపింగ్ రాకెట్‌ను కనిపెట్టే క్రమంలో తమకు సంబంధం లేని విషయంలో తెలియని వారికి సాయం చేయబోయి ఇద్దరు అమాయకులు తమ ప్రాణం మీదకు తెచ్చుకున్న సన్నివేశాలను డైరెక్టర్ సహాజంగా తెరకెక్కించాడు. సినిమా కేవలం మూడు పాత్రల చుట్టే తిరిగినా డైరెక్టర్ టేకింగ్, స్క్రీన్ ప్లేతో ఎక్కడా అనవసర సన్నివేశాలు లేకుండా చివరి వరకు సీటులోనే కూర్చోబెడతాడు. ముఖ్యంగా ఆ ముగ్గురు ఈ గ్రామంలో ప్రజల నుంచి తప్పించుకునేందుకు చేసే ప్రయత్నాలు స్పైన్ చిల్లింగ్ గా ఉంటాయి. మంచి థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారు ఈ స్టోలెన్ (Stolen) సినిమాను ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వొద్దు. ఎక్కడా ఎలాంటి అభ్యంతరకర సన్నివేశాలు లేవు. ఫ్యామిలీతో కలిసి చూడవచ్చు.
ట్యాగ్ లైన్: మది కదిలించే ‘స్టోలెన్’
రేటింగ్: 3.25 / 5