K-Ramp Review: కిరణ్ అబ్బరం.. K ర్యాంప్ సినిమా రివ్యూ! ఎలా ఉందంటే? మెప్పించిందా.. లేదా 

ABN , Publish Date - Oct 18 , 2025 | 01:59 PM

హీరో కిరణ్‌ అబ్బవరం, యుక్తి తరేజా జంటగా జైన్స్ నాని దర్శకత్వంలో  ‘కె-ర్యాంప్‌’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. హిట్ కోసం ఎదురు చూస్తున్న కిరణ్ కు ఏ చిత్రం విజయం అందించిందా.. 

K Ramp Review

సినిమా రివ్యూ: కె - ర్యాంప్ (K - Ramp Review)
విడుదల తేది:
18-10-2025


జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేసుకుంటూ పోతున్నాడు హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐదేళ్లలోనే పది చిత్రాలు పూర్తి చేశాడు. తన కథల ఎంపిక బాగా ఉన్నా ఏదో కలిసి రావడం లేదు. గతేడాది ‘క’ తో సూపర్ హిట్ అందుకున్న కిరణ్ తదుపరి ‘దిల్రూబా’తో ఘోర పరాజయం ఎదుర్కొన్నాడు. ఇప్పుడు ‘కె-ర్యాంప్’ అంటూ వచ్చాడు. యుక్తి తరేజా (Yukti Tareja)కథానాయికగా జైన్స్ నాని (Jains Nani) దర్శకత్వంలో రాజేష్ దండా-శివ బొమ్మకు నిర్మించిన ఈ చిత్రం దీపావళి కానుకగా శనివారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి చెప్పినట్లుగానే ఈ చిత్రంతో కిరణ్ అబ్బవరం ర్యాంప్ ఆడిస్తున్నాడా? అతని ఖాతాలో హిట్ పడినట్లేనా? లెట్స్ వాచ్...


కథ: (K - Ramp Story)

కుమార్ అబ్బవరం (కిరణ్ అబ్బవరం) పెద్ద వ్యాపారవేత కృష్ణ (సాయికుమార్) గారాల బిడ్డ. పెద్దగా చదువు అబ్బట్లేదని, అల్లరి చిల్లరిగా తిరుగుతున్నాడని కేరళలోని కాలేజ్ లో జాయిన్ చేస్తాడు తండ్రి. అక్కడ తొలి చూపులోనే మెర్సీ జాన్ (యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు కుమార్. ఆమెకు జీవితకాలం తోడుంటానని వరమిచ్చేస్తాడు. అసలు మెర్సీ ఎవరు? ఏంటి? అని చూడకుండా ప్రేమలో దిగిన కుమార్ తన ప్రేయసికి ఉన్న సమస్యతో ఇబ్బందులకు గురవుతాడు. అసలు జాన్ కున్న సమస్య ఏంటి? వారిద్దరూ ఒకటయ్యారా? లేదా? అల్లరి చిల్లరిగా తిరిగే కుమార్కు తండ్రి విలువ తెలిసివచ్చిందా? అనేది ఈ సినిమా కథ.


K-Ramp.jpg

విశ్లేషణ: ( (K - Ramp review)
చదువురాని కుర్రాడు, అతని ప్రేమ, ఆ తర్వాత వచ్చే చిక్కుముడులు రొటీన్ గా ఉండే సినిమా కథే. అయితే ఈ ప్రేమకథలో సమస్య అమ్మాయితోనో, అమ్మాయి కుటుంబంతోనో కాదు. అమ్మాయికి ఉన్న మానసిక రుగ్మత. దానిని హీరో ఎలా పరిష్కరించాడు. తన ప్రేమను ఎలా నిలబెట్టుకున్నాడు అన్నది ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో చూపించాడు దర్శకుడు. లాజిక్కులు వెతకొద్దని ముందుగానే చెప్పేశాడు. నిజం చెప్పాలంటే లాజిక్కులు లేకుండా నవ్వుకోవడానికి తీసిన సినిమా ఇది. కొన్ని పాత్రల చిత్రీకరణలో లోపాలు కూడా ఉన్నాయి. హీరోయిన్ మెంటల్ డిజార్డర్ సమస్యకు పరిష్కారం ఎలా అని హీరో ని అడిగితే 'చాట్ జిపిటికి' నా సమస్య చెప్పాను.  అది నాకు ఇలా చేయి అని సజెస్ట్ చేసింది అనే డైలాగ్ నవ్వులు పూయించింది

ఫస్టాఫ్ అంతా కాలేజ్, ప్రేమాయణం, హీరోయిన్ సమస్యను రివీల్ చేయడంతో సోసోగా సాగింది. సెకండాఫ్ నుంచి స్పీడ్ అందుకుంది. ఫస్టాఫ్, సెకెండాఫ్ రెండింటిలో కూడా నరేశ్ పై చిత్రీకరించిన ట్రాక్ థియేటర్లలో నవ్వులు పూయించింది. నిజానికి ఈ ట్రాక్ నరేశ్ నిజజీవితానికి కూడా కనెక్ట్ అయ్యేలా ఉండటంతో మరింతగా పండింది. సెకండాఫ్ లో కామెడీ తో పాటు క్లైమాక్స్ లో  ఎమోషన్స్ ఉండటంతో థియేటర్ నుంచి బయటకు వచ్చే ఆడియన్ ఫీల్ తో బయటకు  వస్తాడు. ఇక హీరోయిన్, హీరో తండ్రికి సంబంధించిన సీన్స్ భావోద్వేగాన్ని కలిగిస్తాయి. హీరోహీరోయిన్ల మధ్య అన్ని ముద్దు సీన్స్ అవసరం లేదేమో. తెరపై ముద్దు సీన్ కనిపించిన ప్రతిసారీ ఓ రీజన్ చూపించినా ముద్దు సీన్ లేకుండా కూడా ఆ సీన్స్ తీయవచ్చు. ఇక అడల్ట్ జోక్స్ బోలెడు. అయితే చివరలో హీరోయిన్ మానసిక రుగ్మతకు చూపించిన సొల్యూషన్ కన్విన్ న్సింగ్ గానే ఉంది.  


నటీనటులు, సాంకేతిక నిపుణుల విషయానికొస్తే...

జీవితంలో ఓ లక్ష్యం లేకుండా అల్లరి చిల్లరిగా తిరిగే కుర్రాడి పాత్రలో కిరణ్ అబ్బవరం బాగానే నటించారు. ఫస్ట్ టు లాస్ట్ కుమార్ పాత్రకు తగిన న్యాయం చేశాడు. ఈ చిత్రంలో భుజాలు కదుపుతూ ఓ కొత్త మేనరిజం మెయిన్టైన్ చేశాడు. నిజానికి అదొక ఎలివేషన్ లా ఉంది. మెర్సీ జాన్ పాత్రలో యుక్తి తరేజా కూడా చక్కగా చేసింది. సాధారణంగా కనిపిస్తూ.. తను అనుకున్నది సమయానికి జరగకపోతే నానా యాగీ చేసేసే డిజార్డర్ ఉన్న అమ్మాయిగా మెప్పించింది. గ్లామర్ గాను  ఉంది, హీరోతో కెమిస్ట్రీ కూడా పండించింది. నరేష్ ఎప్పటిలాగే తన పని తాను చేసుకుపోయారు. ఆ పాత్రకు రాసిన సైటైర్లు, కామెడీ ట్రాక్స్ కి నవ్వని వారుండరు. దానికి తోడు మంచి ఎమోషనల్ సీన్స్ కూడా పడ్డాయి. హీరోకి తండ్రిగా, వ్యాపారవేత్తగా సాయి కుమార్ డీసెంట్ రోల్  ప్లే చేశారు. మెప్పించారు కూడా. హీరోయిన్ కి  పెదనాన్నగా మురళీధర్ గౌడ్ ఇమిడిపోయారు. వెన్నెల కిశోర్ కనిపించింది కాసేపే అయినా రచ్చ రచ్చ చేశాడు. అలీ, శ్రీనివాసరెడ్డి పాత్రలు ఇంకొంచెం లెంగ్తీగా ఉంటే బావుండేది.   


సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ బావుంది. కేరళ విజువల్స్ బాగా క్యాప్చర్ చేశారు. సంగీత దర్శకుడు చేతన్ భరద్వాజ్ ఆర్ఆర్ పతాక సన్నివేశాల్లో ఎలివేట్ అయింది. పాటలు బాగుండి విజువల్ గా  ఆకట్టుకున్నాయి. హీరో తనపై తాను వేసుకున్న సెటైర్స్ బాగా పండాయి. క్వాలిటీ విషయంలో నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాలేదని అర్థం అవుతుంది. రొటీన్ లవ్ స్టోరీ ని దర్శకుడు తెరకెక్కించిన విధానం బాగుంది. ఇక వినోదాన్ని, భావోద్వేగాలను మేళవిస్తూ సినిమా జైన్స్ నాని సినిమా తీసిన విధానం అందరినీ అలరిస్తుందనే చెప్పవచ్చు. నిజానికి ఇది తనకు మంచి పరిచయ చిత్రం అవుతుంది. లోపాలు, లాజిక్కులు వెతక్కుండా ఓసారి ఈ సినిమా చూసేయవచ్చు.

ట్యాగ్ లైన్: 'ర్యాంప్ ఆడిస్తాడు'
రేటింగ్:
2.75/5

Updated Date - Oct 19 , 2025 | 08:25 AM