Uppu Kappurambu Review: కీర్తి సురేష్ 'ఉప్పు కప్పురంబు' ఎలా ఉందంటే..
ABN , Publish Date - Jul 04 , 2025 | 06:49 AM
కీర్తి సురేశ్ ఓ సినిమా అంగీకరించిందీ అంటే అందులో ఏదో విషయం ఉంటుందని ప్రేక్షకుల నమ్మకం. ఆమె అంత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటుంది. తాజాగా ఆమె నటించిన చిత్రం 'ఉప్పు కప్పురంబు’. ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
ఓటీటీ రివ్యూ: 'ఉప్పు కప్పురంబు' (Uppu Kappurambu Review)
విడుదల తేది: 4–7–2025
ఓటీటీ: అమెజాన్ ప్రైమ్
కీర్తి సురేశ్ (Keerthy Suresh) ఓ సినిమా అంగీకరించిందీ అంటే అందులో ఏదో విషయం ఉంటుందని ప్రేక్షకుల నమ్మకం. ఆమె అంత సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తుంటుంది. తాజాగా ఆమె నటించిన చిత్రం 'ఉప్పు కప్పురంబు’. సుహాస్ కీలక పాత్రధారుడు. అని ఐ.వి శశి దర్శకత్వం వహించారు. అమెజాన్ ప్రైమ్‌తో కలిసి ఎల్లనార్ ఫిల్మ్స్ ప్రైవేట్ లి. నిర్మించిన చిత్రమిది. రాధిక లావు నిర్మాత. ఈ శుక్రవారం అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. కొత్త దర్శకుడు, సుహాస్ లాంటి హీరోతో కలిసి కీర్తి చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.
కథ: (Uppu Kappurambu Review)
చిట్టి జయపురం ఓ మారుమూల గ్రామీణ ప్రాంతం. ఆ గ్రామానికి పెద్ద శుభలేఖ సుధాకర్. ఆయన హఠాన్మరణంతో ఆయన కూతురు అపూర్వ (కీర్తి సురేష్) గ్రామ పెద్దగా బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. ఆమెకు ఓ సమస్యను ఎదుర్కొవల్సి వస్తుంది. ఆ గ్రామం అనవాయితీ ప్రకారం ఆ గ్రామంలో ఎవరు మరణించినా ఊరికి ఉత్తరం వైపు ఉన్న స్మశానంలో పార్ధీవదేహాన్ని పూడ్చి పెడతారు. దాదాపు 300 ఏళ్లగా అదే పద్దతి. అపూర్వ బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆ స్మశానంలో నలుగురిని పూడ్చడానికే చోటు ఉంటుందని అక్కడి కాటి కాపరిగా పని చేసే చిన్నా (సుహాస్) చెబుతాడు. వర్గం, వంశం, వారసత్వం అంటూ ఆ గ్రామ పెద్ద కుర్చీ మీద కన్నేసిన భీమయ్య (బాబు మోహన్), మధుబాబు (శత్రు) అపూర్వను ఇరుకున పెట్టి పెద్దగా దింపేయాలనుకుంటారు. మరో వైపు చిన్నా తల్లి (తాళ్లూరి రామేశ్వరి) తన మరణానంతరం ఆ స్మశానంలో ఓ చెట్టు కింద ఖననం చేయమని కొడుకుని కోరుతుంది. స్మశానంలో చోటు వారి వంశం వారికే దక్కాలని కొందరు చూస్తారు. ఈ సమస్యకు గ్రామ పెద్దగా అపూర్వ ఎలాంటి పరిష్కారం చూపించింది. అసలు అది సాధ్యమైందా? లేదా అన్నది కథ.
విశ్లేషణ
రానా దగ్గుబాటి వాయిస్‌తో సినిమా మొదలవుతుంది. చిట్టి జయపురం గ్రామానికి ఉన్న వందల ఏళ్ల చరిత్ర ఆయన మాటల్లో వినిపిస్తుంది. తదుపరి కథ మొదలవుతుంది. ఓ తింగరి అమ్మాయి, భయస్తురాలు తనలో లేని పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ ఎంత ఇబ్బంది పడింది? కాటికాపరి సహాయంతో ఆ ఊరి సమస్యనుఎ ఎలా పరిష్కారం చూపింది అనేది ఈ కథ. రచయిత వసంత్ మారిగంటి రాసిన కథలో విషయం ఉంది. చక్కని పాయింట్‌తోపాటు అహంకారమే మనిషిని తొక్కేస్తుంది అనే సందేశం కూడా ఉంది. 90లలో పల్లె, అమాయకమైన జనం, వారి సంప్రదాయాలు, వారి మనస్తత్వాలు, ఎదురైన సమస్యకు పరిష్కారం ఇదంతా బాగానే ఓ ఫార్మెట్‌లో రాసుకున్నారు. కానీ తెరకెక్కించడంతో మాత్రం దర్శకుడి తడబాటు కనిపించింది. కీర్తి సురేష్, సుహాస్ సహా ప్రతి పాత్రను లౌడ్‌గా చిత్రీకరించారు. కీర్తి పాత్రను కాస్త ఓవర్ చేసినట్లు చూపించారు. మామూలుగా ఆమె పెర్‌ఫార్మన్స్ వేరుగా ఉంటుంది. కానీ కావాలనే ఓవర్‌గా యాక్ట్ చేయించినట్లు అనిపిస్తుంది. సినిమా మొదలైన మొదటి గంట సేపు అదో గందరగోళంగా సాగింది. కుర్చీలో కూర్చున్నవారి సహనానికి పరీక్షగానే ఉంటుంది. సెకండ్ హాఫ్‌లో కాస్త ఆసక్తికరంగా సాగుతుంది. తల్లి చివరి కోరిక నెరవేర్చడం కోసం చేసే పనితో కథ మలుపు తిరుగుతుంది. అదే ఊళ్లో వివాదానికి దారితీయడం ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు ఆసక్తిని కలిగిస్తాయి. చివరి అరగంట సినిమాకు బలం సుహాస్, అతని తల్లి ట్రాక్ ప్రేక్షకుల మనసుకు హత్తుకునేలా ఉంటుంది. అక్కడి నుంచే తెరపై నాచురాలిటీ కనిపిస్తుంది. వినోదం నుంచి భావోద్వేగాల వైపు మలుపు తిరిగాక కథలో సీరియెస్‌నెస్ పెరిగింది.
నటీనటుల పనితీరు.. అపూర్వగా కీర్తీ సురేష్ లుక్ డీసెంట్‌గా ఉంది. కళ్లజోడుతో అమాయకమైన చూపుతో పల్లెటూరి అమ్మాయిగా చక్కగా కనిపించింది. డీసెంట్ క్యారెక్టర్ చేస్తూ.. నటనలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఇందులో బాడీ లాంగ్వేజ్, లౌడర్ వాయిస్ ఎందుకో సూట్ కాలేదనిపిస్తుంది. అది కాస్త సర్‌ప్రైజింగ్‌గా ఉంటుంది. అయితే అది ఫస్టాఫ్ వరకే. సెకెండాఫ్‌కు వచ్చే సరికి ఎప్పటిలాగే తనలోని నటి బయటకు వస్తుంది. ఇక చిన్నా పాత్రలో సుహాస్ ఒదిగిపోయారు. కాటి కాపరిగా అమాయకంగా కనిపించే ఆయన ఫస్టాఫ్ అంతా బాగా నవ్వించాడు. క్లైమాక్స్‌కు వచ్చేసరికి కంటతడి పెట్టించారు. భీమయ్య పాత్రలో బాబు మోహన్ కూడా చక్కని పాత్రే దక్కింది. తనదైన కామెడీ టైమింగ్, నటనతో మెప్పించారు. శత్రు కూడా బాగానే చేశారు. రవి తేజ నానిమ్మల స్మశానంలో శిలాఫలకాలు చెక్కే పాత్రలో మెప్పించాడు. రామేశ్వరి, జెన్నీ పాత్రల మేరకు ఫర్వాలేదనిపించారు. సినిమాకు పాటలు బలంగా నిలిచాయి. స్వీకార్ అగస్తీ చక్కని సంగీతం అందించారు. భావోద్వేగ సన్నివేశాల్లో నేపథ్య సంగీతం డీసెంట్‌గా ఉంది. 90ల నేటివిటీని, పల్లె వాతావరణాన్ని ఆర్ట్ డిపార్ట్‌మెంట్ చక్కగా చూపించింది. సినిమాటోగ్రఫీ బావుంది. రాధిక లావు నిర్మాణ విలువలు బావున్నాయి. సినిమా కథలో మంచి థమ్ ఉంది. చాలా ఏళ్ల క్రితం కులాలు, వర్గాల పేరుతో కొట్టుకుంటున్న మనుషులంతా ఒక్కటే కుటుంబమనే చక్కటి సందేశాన్ని ఇందులో చెప్పారు. ఈ కథకు కీర్తి సురేశ్ లాంటి నటి అంగీకరించడం పాత్ర కోసం మౌల్డ్ కావడం టీమ్ సాధించిన తొలి విజయం. అయితే తెరకెక్కించే విషయంలో దర్శకుడు కాస్త చురుకుగా ఆలోచించి ఉంటే మంచి ఫలితం దక్కే అవకాశం ఉంటుంది. థియేట్రికల్ సినిమా కాకుండా ఓటీటీలో సినిమా కాబట్టి అంచనాలు పెట్టుకోకుండా కీర్తి సురేశ్, సుహాస్ కోసం చూసే ప్రయత్రం చేయవచ్చు.
ట్యాగ్ లైన్: 'ఉప్పు కప్పురంబు..' వినోదం - భావోద్వేగం
రేటింగ్: 2.5/5