Revolver Rita Movie review: కీర్తి సురేశ్.. రివాల్వర్ రీటా మూవీ రివ్యూ
ABN , Publish Date - Nov 28 , 2025 | 03:59 PM
కీర్తి సురేశ్ నటించిన హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ 'రివాల్వర్ రీటా' కాస్తంత ఆలస్యంగా జనం ముందుకు వచ్చింది. చంద్రు తెరకెక్కించిన ఈ క్రైమ్ కామెడీ మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం...
తెలుగులో 'దసరా' (Dasara) మూవీ తర్వాత జాతీయ ఉత్తమ నటి కీర్తి సురేశ్ (Keerthi Suresh) కు సరైన సక్సెస్ దక్కలేదు. ఈ యేడాది 'ఉప్పు కప్పురంబు' మూవీ రిలీజ్ అయినా అది ఓటీటీకే పరిమితమైంది. దాంతో ఆమె ఆశలన్నీ 'రివాల్వర్ రీటా' (Revolver Rita) మీదే పెట్టుకుంది. నిజానికి ఈ సినిమా ఇప్పటిది కాదు. రెండేళ్ళ క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న 'రివాల్వర్ రీటా' విడుదల రకరకాల కారణాలతో ఆలస్యమైంది. కొన్ని నెలల క్రితం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడిది తమిళ, తెలుగు భాషల్లో శుక్రవారం థియేటర్లలోనే విడుదలైంది. జె. కె. చంద్రు (J.K. Chandru) తెరకెక్కించిన క్రైమ్ కామెడీ మూవీ 'రివాల్వర్ రీటా' ఎలా ఉందో చూద్దాం...
కర్మ రిటర్న్స్ అనే పాయింట్ ను బేస్ చేసుకుని తెరకెక్కిన సినిమా 'రివాల్వర్ రీటా'. ఈ సినిమా కథ మొత్తం పాండిచ్చేరీ లో జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ నుండి పాండిచ్చేరికి వెళ్ళిన జయసింహారెడ్డి తలను లోకల్ డాన్ డ్రాకులా పాండ్యన్ (సూపర్ సుబ్బరాయన్) నరికేస్తాడు. అండర్ వరల్డ్ తన ఆధిపత్యాన్ని తెలియచేస్తూ ఆ తలను అతని తమ్ముడు రెడ్డి (అజయ్ ఘోష్ Ajay Ghosh)కు పంపుతాడు. దాంతో పాండ్యన్ ఎలాగైనా చంపి తన పగ తీర్చుకోవాలని రెడ్డి సమయం కోసం ఎదురుచూస్తుంటాడు. ఇది జరిగిన పదిహేనేళ్ళకు పాండ్యన్ కొడుకు బాబీ (సునీల్ Sunil) అండర్ వరల్డ్ డాన్ గా మారతాడు. అదే సమయంలో అమ్మాయిల పిచ్చి ఉన్న పాండ్యన్... రెడ్డి వేసిన ట్రాప్ లో చిక్కి ప్రాణాలు కోల్పోతాడు. అయితే అతని ప్రాణాలు శత్రువుల చేతిలో కాకుండా రీటా (కీర్తి సురేష్) తల్లి చల్లమ్మ (రాధికా శరత్ కుమార్ Radhika Sarath Kumar) కారణంగా పోతాయి. వేశ్య ఇంటికి వెళ్ళబోయి పొరపాటున పాండ్యన్ వీళ్ళ ఇంటికి వెళతాడు. అక్కడ జరిగిన చిన్నపాటి గొడవలో అతను ప్రాణాలు కోల్పోతాడు. పాండిచ్చేరికే పెద్ద డాన్ అయిన పాండ్యన్ శవాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియక ఈ తల్లీ కూతుళ్ళు సతమతమౌతారు. ఈ క్రమంలో వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? పాండ్యన్ చనిపోయిన విషయం తెలిసి అతని కొడుకు బాబీ, శత్రువైన రెడ్డి, పోలీస్ ఆఫీసర్ కామరాజ్ ఎలా వీరిని ఛేజ్ చేశారు? అనేది మిగతా కథ.
అనుకోకుండా హత్య చేసి, ఆ శవాన్ని మాయం చేయడమనే కథాంశాలతో చాలానే సినిమాలు వచ్చాయి. ఆ మధ్య ప్రియమణి (Priyamani) నటించిన 'భామాకలాపం' (Bhama Kalapam) కూడా ఈ కోవకు చెందిందే. దానికి సీక్వెల్ కూడా వచ్చింది. ఇలాంటి క్రైమ్ కామెడీ మూవీస్ చూడటానికి ఆసక్తికరంగానే ఉంటాయి. పెద్దంత లాజిక్ లేకపోయినా ఎంగేజింగ్ గా వాటిని తీస్తే జనాలు ఆదరిస్తారు. ఈ మధ్య కాలంలో వచ్చిన కీర్తి సురేశ్ సినిమాలతో పోల్చితే 'రివాల్వర్ రీటా' బాగానే ఉంది. సినిమా ప్రారంభం నుండి ముగింపు వరకూ ఎక్కడా బోర్ కొట్టకుండా చకచకా సాగిపోయింది. పిజ్జా సెంటర్ లో పనిచేసే ఓ మధ్య తరగతి అమ్మాయి ఓ క్రైమ్ లో అనుకోకుండా ఇన్వాల్వ్ అయితే ఎదురయ్యే పర్యవసానాలను దర్శకుడు జె.కె. చంద్రు ఆసక్తికరంగా తెరకెక్కించాడు. రీటా జీవితంలో చిన్నప్పుడు జరిగిన ఓ దుర్ఘటనకు ప్రస్తుతం జరిగి హత్యకు లింక్ చేసి చూపడం బాగుంది.
కథగా చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేకపోయినా... ఈ క్రైమ్ కామెడీ ఛేజింగ్ డ్రామాలో నటీనటులు తమ పాత్రలను సమర్థవంతంగా పోషించారు. ఇది మూడేళ్ళ క్రితం సినిమా కావడంతో కీర్తి సురేశ్ తెర మీద అందంగా, హుషారుగా కనిపించింది. ఆమె తల్లి పాత్రను రాధిక తనదైన కామెడీ టైమింగ్ తో రక్తి కట్టించింది. రెడిన్ కింగ్ స్లే పాత్ర కూడా హాస్యాన్ని పండించింది. అజయ్ ఘోష్ చేసింది సీరియస్ పాత్రే అయినా అతని ఫ్రస్ట్రేషన్ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తుంది. సునీల్ పెద్దంత శ్రమపడకుండానే తన లుక్స్ తో, బాడీ లాంగ్వేజ్ తో మెప్పించాడు. పోలీస్ ఇన్ స్పెక్టర్ గా జాన్ విజయ్ జాలీగా యాక్ట్ చేశాడు. షాన్ రోనాల్డ్ నేపథ్య సంగీతం, ప్రవీణ్ కె. ఎల్. ఎడిటింగ్, దినేశ్ బి కృష్ణన్ సినిమాటోగ్రఫీ పర్ ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. సుధన్ సుందరం, జగదీశ్ పళనిసామి నిర్మించిన 'రివాల్వర్ రీటా' తమిళ సినిమాను తెలుగులో హాస్య మూవీస్ అధినేత రాజేశ్ దండా విడుదల చేస్తాడని యేడాది క్రితం వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడా సినిమా చేతులు మారి డిస్ట్రిబ్యూటర్ కుమార్ ద్వారా జనం ముందుకు వచ్చింది. 'రివాల్వర్ రీటా' రిలీజ్ లో జరిగిన విపరీతమైన జాప్యం కారణంగా దీనిపై జనాలలో ఆసక్తి సన్నగిల్లింది. ఆ రకంగా ఎలాంటి అంచనాలు లేకుండా చూసిన వారికి సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. థియేటర్లలో కాకుండా ఓటీటీలో అయితే ఈ సినిమా ఇంకాస్తంత ఎక్కువ ఎంజాయ్ చేయగలరు!
ట్యాగ్ లైన్: టైమ్ పాస్ రీటా!
రేటింగ్: 2.5/5