Thug Life Review: కమల్, మణిరత్నం కలయికలో వచ్చిన 'థగ్‌లైఫ్' ఎలా ఉందంటే
ABN , Publish Date - Jun 05 , 2025 | 01:56 PM
'థగ్‌లైఫ్' చూశాక 'నాయకుడు' చిత్రాన్ని మరచిపోతారని విశ్వనాయకుడు కమల్ హాసన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. 38 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో వచ్చిన చిత్రమిది. కమల్ చెప్పినట్లు 'నాయకుడు' చిత్రాన్ని మరచిపోయేలా 'మణి' ఈ చిత్రాన్ని తెరకెక్కించారా? చూద్దాం.
సినిమా రివ్యూ: 'థగ్‌లైఫ్' (Thug Life Review)
విడుదల తేది: 5-6-2025
కమల్‌హాసన్(Kamal Haasan), మణిరత్నం (Mani ratnam) కాంబినేషన్‌లో వచ్చిన 'నాయకుడు’(1987) చిత్రం అప్పట్లో పెద్ద హిట్టు. ఆ కాంబో మళ్లీ సెట్ కావడానికి 38 ఏళ్లు పట్టింది. వీరిద్దరి కాంబో వచ్చిన తాజా చిత్రం 'థగ్‌లైఫ్’ (Thug life Review). ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఎన్నో ఏళ్ల తర్వాత కమల్‌తో మణిరత్నం సినిమా తీయడంతో అంచనాలు ఆకాశానికి చేరాయి. ప్రచార కార్యక్రమాల్లో విశ్వ నాయకుడు చెప్పిన మాటలూ అలాగే ఉన్నాయి. ‘థగ్ లైఫ్’ చూశాక నాయకుడు’ చిత్రాన్ని ఆయన మరచిపోతారని ఓ వేదికపై చెప్పారు. కమల్ హాసన్‌తోపాటు త్రిష(Trisha), శింబు, అభిరామి, నాజర్, అశోక్ సెల్వన్, ఐశ్వర లక్ష్మీ నటించిన ఈ చిత్రమిది. ఒకట్రెండుసార్లు విడుదల వాయిదా, కర్ణాటకలో బ్యాన్ అంటూ వివాదం నడుమ ఈ గురువారం ప్రేక్షకుల ముందుకొచ్చింది 'థగ్‌లైఫ్'. కమల్ చెప్పినట్లు నాయకుడు చిత్రాన్ని మరచిపోయేలా మణిరత్నం ఈ చిత్రాన్ని మలిచారా? రివ్యూలో చూద్దాం.
కథ: (Thug Life Movie Review)
చిన్నాయన అలియాస్ రంగరాయ శక్తిరాజు (కమల్ హాసన్) ఓల్డ్ ఢిల్లీలో పెద్ద డాన్. పోలీసులు అతన్ని పట్టుకునే క్రమంలో జరిగిన కాల్పుల్లో ఓ పేపర్ బాయ్ తండ్రి మరణిస్తాడు. అతని కుమారుడు అమర్ (శింబు). తండ్రి మరణం, నాలుగేళ్ల చెల్లెలు మిస్ అయిందని తెలుసుకుని శక్తిరాజే అమర్‌ను చేరదీసి తమ్ముడిలా పెంచుతాడు. శక్తి రాజుకు కుడి భుజంలా నమ్మకంగా ఉంటాడు. శక్తిరాజుపై జరిగిన ఓ ఎటాక్ విషయంలో అమర్‌పై అనుమానపడతాడు. ఆ అనుమానం అమర్‌లో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? ఇద్దరి మధ్య గొడవకు వృత్తిరీత్యా ఎదుగుదల కారణామా? ఇంద్రాణి (త్రిష) కారణమా? లేదా శక్తిరాజు తన తండ్రిని చంపాడనే కోపమా? నేపాల్ వెళ్లిన శక్తిరాజుకి ఏం జరిగింది అన్నది కథ.
విశ్లేషణ:
38 ఏళ్ల క్రితం కమల్‌హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబోలో వచ్చిన నాయకుడు ఓ సెన్సేషన్. మాఫియా, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ కథల్లో అదొక ట్రెండ్ సెట్టర్. ఇలాంటి కథతోనే కొంచెం అటుఇటుగా మణిరత్నం ‘నవాబ్’ చేశారు. ఆ చిత్రం కూడా బాగానే ఆడింది. ఇవన్నీ తాజాగా వచ్చిన థగ్‌లైఫ్ చిత్రంపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచేశాయి. ఈ సినిమా కూడా ఇంచుమించుగా అలాగే ఉంది. కాకపోతే చిన్న చిన్న మార్పులు చేశారు. డాన్‌గా ఎదిగిన తమ్ముడిని చూసి ఓర్వలేని ఓ అన్న, అతను చెప్పిన మాటలు విని పెంచి పెద్ద చేసిన మనిషిపై రివేంజ్ తీసుకునే ఓ యువకుడు.. ఇదీ సింపుల్‌గా కథ. ఈ సినిమా ప్రారంభం బావుంది. ఓ బిల్డింగ్‌లో డాన్‌ని పట్టుకోవడానికి పోలీసులు చేసే ఫైరింగ్, తండ్రిని, చెల్లిని పోగొట్టుకున్న ఓ బాలుడిని దగ్గరకు తీసుకుని తనతోనే ఉంచుకోవడం, అక్కడి నుంచి అల్లుకున్న క్యారెక్టర్స్ కథపై ఆసక్తిని కలిగించేలా ఉన్నాయి. తర్వాత ఏం జరుగుతుందనే ఎగ్జైట్‌మెంట్ కలుగుతుంది. అయితే ఆ హై మోమెంట్ కింద పడిపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు. రెగ్యులర్ ఫార్మాట్ లో సాగే రివేంజ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా అని సినిమా మొదలైన కాసేపటికే అర్థమైపోతుంది. మామూలు కథను మెస్మరైజ్ చేసేలా చిత్రీకరించడం మణిరత్నం బలం. కానీ ఇందులో పాత్రల్లో బలం కనిపించలేదు. నెల్లూరులో తండ్రిని చంపడానికి వచ్చిన వ్యక్తి ముందు అమ్మాయి (అభిరామి) చూపించే తెగువ నచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నానని శక్తి రాజు చెబుతారు. అలాంటి వ్యక్తి ఇంద్రాణి (త్రిష) అనే డాన్సర్‌కు ఆకర్షితుడు కావడం, శక్తి రాజును అన్నయ్యగా భావించే అమర్ కూడా ఆమెకే ఎట్రాక్ కావడానికి సరైన రీజన్ చెప్పలేదు. తండ్రి మరణం తర్వాత తనను ఎంతో ఇష్టంగా పెంచిన శక్తి రాజు పట్ల అమర్ తీరు కూడా ఎక్సెప్ట్ చేసేలా లేదు. తండ్రి మరణానికి శక్తి రాజే కారణమని తెలిసినా వేరొకరు ఎక్కించిన మాటలకు ఎలా ప్రభావితుడయ్యాడో అన్నది లాజిక్‌లెస్‌గా ఉంది. ఈ సినిమాకు మణిరత్నం, కమల్‌హాసన్ ఇద్దరూ స్క్రీన్ ప్లే రాశారు. ఒకటి, రెండు చోట్ల మినహా ఎక్కడా మెరుపులు కనిపించలేదు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా సహనానికి పరీక్షగా మిగిలింది. కొన్ని సన్నివేశాల్లో నిడివి అలా పెరిగిన ఫీలింగ్ కలుగుతుంది. ప్రారంభం 20 నిమిషాలు మినహాయిస్తే ఇంటర్వెల్ వరకు సినిమా సోసోగా ఉంటుంది. ఇక ఇంటర్వెల్ తర్వాత నేపాల్ వెళ్లడం అంతా కూడా ఊహకు అందేలా ఉంది. మణిరత్నం తాలుక సెన్సిబిలిటీస్, ఎమోషన్స్ మిస్ అయ్యాయి. సినిమా ప్రారంభంలో అమర్ తండ్రి మరణం, అతనికి అంత్యక్రియలు చేయడం, అక్కడి సంభాషణలు మాత్రం ఆకట్టుకుంటాయి. యాక్షన్ సీన్స్ బాగా తీశారు.
నటీనటులు ఎలా చేశారంటే.. కమల్‌హాసన్ ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేయగలరు. నటుడిగా ఆయన కొత్తగా నిరూపించుకోవలసింది ఏమీ లేదు. శక్తి రాజు పాత్రలో ఒదిగిపోయారు. కానీ ఆ పాత్ర కొత్తగా లేకపోయినా న్యాయం చేశారు. శింబు నటన సెటిల్డ్‌గా ఉంది. క్యారెక్టర్ రీత్యా అతని యాటిట్యూడ్ పర్ఫెక్ట్‌గా సూట్ అయింది. తనదైన శైలి నటన తెరపై చూపించాడు. కమల్‌తో ఈక్వల్‌గా యాక్ట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. అభిరామిది మంచి క్యారెక్టర్. నిడివి ఉన్నా సరిగ్గా ఆ పాత్రను వినియోగించుకోలేక పోయారు. త్రిషకు వయసు పెరుగుతున్నా.. అందం ఏమాత్రం తగ్గలేదని ఇంద్రాణి పాత్రతో మరోసారి నిరూపించింది. బార్ డాన్సర్‌గా రెండు పాటలు, నాలుగు సీన్స్‌లో మెరిసింది. ఆ పాత్రకు అంత ప్రాధాన్యం ఏమీ కనిపించడు. నాజర్, మహేశ్ మంజ్రేకర్, పోలీస్ ఆఫీసర్‌గా అశోక్ సెల్వన్, జోజు జార్జ్, అలీ ఫజల్ ప్రతిభగల ఆర్టిస్ట్‌లు ఇందులో ఉన్నారు. డాక్టర్ అన్నాగా ఐశ్వర్య లక్ష్మీ కనిపించింది. క్లైమాక్స్‌లో ఆ పాత్రకు ప్రాధాన్యం ఉంది. మిగతా అందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. రవి కే చంద్రన్ కెమెరా వర్క్ బావుంది. యాక్షన్ ఎపిసోడ్స్, నేపాల్ ప్రాంతాల్లో డ్రోన్ షాట్స్ అద్భుతంగా చిత్రీకరించారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కొంత వరకూ సినిమాకు మైనస్. సినిమాకు చాలా వరకూ ఎ.ఆర్.రెహహాన్ సంగీతం ప్లస్ అయింది. యాక్షన్ సన్నివేశాలకు చక్కని ఆర్‌ఆర్ ఇచ్చారు. పాటలు కూడా బావున్నాయి. నిర్మాణం పరంగా సినిమా రిచ్‌గా ఉంది. నిర్మాతలు ఎక్కడా రాజీ పడలేదు. థగ్‌లైఫ్’లో కథ పరంగా కొత్తేమీ లేదు. కమల్‌హాసన్ చెప్పినట్లు నాయకుడు చిత్రాన్ని మరిచిపోయేలా చేసే చిత్రమైతే ఇది కాదు. కమల్ మాటలతో పెంచిన అంచనాలు మాటల వరకే మిగిలిపోయాయి. మణిరత్నం మార్క్ ఎక్కడ కనిపించలేదు. అయితే దర్శకుడిగా మణిరత్నం ఒకింత నిరాశపరచినా కమల్‌హాసన్, శింబు నటనతో ఆకట్టుకున్నారు.
ట్యాగ్‌లైన్: బోరింగ్ 'థగ్'
రేటింగ్: 2.25