Avatar: Fire and Ash Review: అవతార్ 3 ఫైర్ అండ్ యాష్.. తెలుగు రివ్యూ! కామెరూన్ మామ.. ఇలా చేశావేంటి?
ABN , Publish Date - Dec 20 , 2025 | 07:36 AM
ఎన్నో అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూసిన చిత్రం అవతార్ ఫైర్ అండ్ యాష్ శుక్రవారం ప్రేక్షకుల ఎదుటకు వచ్చింది.
ఎన్నో అంచనాల నడుమ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురుచూసిన చిత్రం అవతార్ ఫైర్ అండ్ యాష్ శుక్రవారం ప్రేక్షకుల ఎదుటకు వచ్చింది. ఇప్పటికే రెండు భాగాలుగా వచ్చిన అవతార్, అవతార్ ది వే ఆఫ్ వాటర్ అప్పటివరకు ప్రేక్షకుల ఊహకందని విజువల్స్‌తో అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ అందించి మరో లోకంలో విహరింప జేశాయి. ఈ నేపథ్యంలో భారీ అంచనాల మధ్య తాజాగా థియేటర్లకు వచ్చిన అవతార్ ఫైర్ అండ్ యాష్ ఏమేరకు అలరించిందో చూడండి.
కథ:
అవతార్ ది వే ఆఫ్ వాటర్ ఎక్కడైతో ఎండ్ అయిందో.. దానికి కొనసాగింపుగా అక్కడి నుంచే సినిమా ప్రారంభం అవుతుంది. పెద్ద కుమారుడు నేతేయంని కోల్పోయిన జాక్ ఫ్యామిలీ ఆ విషయాన్ని మరిచి పోలేక అతని జ్ఞాపకాలతోనే పెంపుడు కుమారుడు స్పైడర్‌తో కలిసి జీవిస్తుంటారు. అయితే.. జాక్ భార్య నేతిరి ఎలాగైనా స్పైడర్‌ను ఈ ఫ్యామిలీలకు దూరం ఉంచాలని ఎప్పటికైనా అతనితో ప్రమాదం ఉంటుందని జాక్‌ను కోరుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో ఎగిరే తిమింగలాలపై వచ్చి వ్యాపారం చేసుకునే వారితో కలిసి మరో ప్రాంతానికి వెళ్లి రహస్యంగా జీవించాలని ప్రయాణం స్టార్ట్ చేస్తారు.
అలా వారు ప్రయాణం చేస్తుండగా మధ్యలో ఉన్నపళంగా అగ్ని తెగకు చెందిన వరాంగ్ మూక వారిపై దాడి చేసి అంతటిని సర్వ నాశనం చేస్తుంది. ఈ దాడిలో జాక్ ఫ్యామిలీ అంతా చెల్లా చెదురవుతుంది. నేతిరి తీవ్రంగా గాయపడి తన మతృభూమికి చేరుకోగా, తప్పిపోయిన పిల్లలను వరాంగ్ తెగ నుంచి రక్షించేందుకు జాక్ చిట్టడవిలోకి వెళతాడు. సరిగ్గా అదే సమయంలో కల్నల్ క్వారిచ్ సైతం తన పగను తీర్చుకునేందుకు జాక్ వెంట పడతాడు.. చివరకు వీరంతా వరాంగ్‌కు దొరికిపోతారు. ఆపై జాక్ పెంపుడు కూతురు కిరి తనకున్న శక్తిని ఉపయోగించి అంతా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లి తమ సొంత ప్రాంతానికి వెళ్లిపోతారు.
![]()
ఇదిలాఉంటే.. జాక్ ఫ్యామిలీపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతున్న కల్నల్ వరాంగ్ తెగ వారికి దగ్గరై వారి మద్దతు తీసుకుని నావి ప్రజలపై దండయాత్రకు సిద్దమవుతాడు. మరోవైపు.. పండోరా గ్రహంపై భారీ స్థాయిలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆర్డీఏ బృందం రెట్టించిన ఉత్సాహం, మిషనరీతో సముద్రంలో వందల సంఖ్యలో ఉన్న టుక్ (భారీ తిమింగాల) లపై ఒకేసారి పెద్ద ఎత్తున దాడి చేయాలని ఫ్లాన్ చేస్తారు. ఈ విషయాలు గ్రహించిన జాక్ అండ్ ఫ్యామిలీ వారికి మద్దతుగా నిలిచిన వారితో ముగ్గురు తీవ్రమైన ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొన్నారనేదే కథ.
ఎలా ఉందంటే..
అవతార్ మొదటి భాగంలో పండోరా గ్రహం, అక్కడి జంతువులు, మనుషులు, వారి వ్యవహరాలను, కంపెనీ అధిపత్యాన్ని కళ్లకు చూపించి మరో లోకంలో తేలేలా చేశారు. ఇక రెండో భాగానికి వచ్చేసరికి సముద్రాల్లోని జల చరాలను, ఇతర వింతలను అద్భుతంగా తెరకెక్కించి వావ్ అనిపించిన కామరూన్ ఈ మూడో భాగంలో మాత్రం తడబడ్డట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఎంతపేపు ఫ్యామిలీ, ఎమోషన్స్ చుట్టూనే డ్రామా నడిపిస్తూ చూసే వారికి విసుగు తెప్పించారు. ఇంకా కొంత మంది నిద్ర కూడా పోయారంటే చూసే వారి సహనాన్ని ఎంతగా పరీక్షించారో ఇట్టే అర్థమవుతుంది. ప్రతీ సారి ఫ్యామిలీ అంతా విలన్లకు దొరికి పోవడం, కాసేపట్లోనే తప్పించుకోవడం రెండు మూడు సార్లు ఇదే రిపీట్ అవుతూ చూసిందే చూసినట్లు అనిపిస్తుంటుంది. ఓ దశలో రెండో పార్ట్ ఎక్సెటెండెడ్ కట్ ఏమైనా చూస్తున్నామా అనే భావన కలుగుతుంది తప్పితే మూడో పార్ట్ ఫైర్ అండ్ యాష్ చూస్తున్నామనే భావనే రాదు.
కొత్తగా రెండు రకాల జీవాలను, కొత్త ట్రైబ్‌ను తీసుకు వచ్చినా, విజువల్స్ అంతకుమించి అనే రేంజ్‌లో ఉన్నప్పటికీ చుట్టూ తిరిగి జాక్, కల్నల్ మధ్యే వార్ సాగుతూ అబ్బా.. అనిపిస్తుంది. ఇక సినిమాలో మెయిన్ విలన్ అంటూ వరాంగ్ గురించి సినిమా విడుదలకు ముందు ఓ రేంజ్‌లో బిల్డప్ ఇచ్చిన మేకర్స్ సినిమాలో వచ్చే సరికి ఆరంభ శూరత్వంలా ఉంది తప్పితే ఎక్కడా దానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు ఉండదు. సినిమా చూస్తున్నంత సేపు మన తెలుగు సినిమాలు ఇంకా బావుంటాయి కదరా అనిపించక మానదు. పార్ట్ 2, పార్ట్ 3 లకు మధ్య తేడా ఏంటంటే కేవలం వరాంగ్ ట్రైబ్ ఒక్కటి అదనంగా వచ్చి చేరిందంతే. మిగతా అంతా పాత సినిమానే. ఇక మూవీ నిడివి 3 గంటల 17 నిమిషాలు ఉండడం పెద్ద మైనస్. ఇంకా చెప్పాలంటే.. దత్త పుత్రిడి కోసం ఇద్దరు తండ్రుల పోరాటం అన్న అతిశయోక్తి కాదేమో. అంతేకాదు.. సినిమా చూస్తూ నిద్ర పోకుండా ఉంటే వారికి సన్మానం కూడా చేయవచ్చు. ఉన్నంతలో జాక్ పిల్లల పాత్రలు మాత్రమే కాస్త ఎగ్జైట్ చేస్తాయి.
రివ్యూ అండ్ రేటింగ్: 2.5/ 5
ఇద్దరు తండ్రుల.. సాగదీసిన పోరాటం