Itlu Mee Yedava Review: త్రినాథ్ కటారి 'ఇట్లు మీ ఎదవ' ఎలా ఉందంటే..
ABN , Publish Date - Nov 21 , 2025 | 08:07 AM
ఓ వారం పెద్ద సినిమా విడుదల లేదు అంటే చిన్న సినిమాలు వరుస కడుతుంటాయి. ఈవారం అదే జరిగింది. 5 మిడియం బడ్జెట్ సినిమాలు తెరపైకి వచ్చాయి. అందులో త్రినాథ్ కఠారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన 'ఇట్లు మీ ఎదవ’ ఒకటి. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం.
ఓ వారం పెద్ద సినిమా రిలీజ్ ఉండదు అనగానే చిన్న సినిమాలు క్యూ కట్టేస్తున్నాయి. ఈవారం అదే జరిగింది. పలు మీడియం బడ్జెట్ సినిమాలు థియేట్లలోకి వచ్చాయి. అందులో త్రినాథ్ కఠారి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన 'ఇట్లు మీ ఎదవ’ ఒకటి. సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై బళ్లారి శంకర్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. సాహితీ అవాంచ కథానాయికగా నటించింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం…
కథ:
శ్రీను(త్రినాథ్ కఠారి) చదువు అంతగా రాని కుర్రాడు. అతగాడికి పీజీ పూర్తి చేయడానికే ఆరేళ్లు పట్టింది. అదే కాలేజీలో కొత్తగా చేరిన మనస్విని(సాహితీ అవాంచ) తొలి చూపులోనే ఇష్టపడతాడు. మనుని మెప్పించడానికి ఆమెకు నచ్చినట్లు మారి ప్రేమలో పడేస్తాడు. పనీ పాట లేకుండా తిరిగే కొడుకులో ఆ మార్పు చూసి తండ్రి గోపరాజు రమణ మను తండ్రి సాయి (దేవి ప్రసాద్ సి)ని కలిసి పెళ్లి సంబంధం మాట్లాడతాడు. ఇల్లు, భక్తి, చదువు తప్ప ఇంకేం తెలియని తన కూతురు ప్రేమ, దోమ అంటూ తిరగడానికి కారణం శ్రీను అని, అలాంటి ఆవారాకు పిల్లని ఎలా ఇస్తానంటూ తిరస్కరిస్తాడు మను తండ్రి. అక్కడ శ్రీనుకి, మను తండ్రికి జరిగిన గొడవతో ఆస్పత్రి మెట్టెక్కాల్సి వస్తుంది. ఇష్యూ డాక్టర్ (తనికెళ్ల భరణి) చెంతకు చేరుతుంది. శ్రీనుకి మను కావాలంటే ఓ 30 రోజులు మను తండ్రితో జర్నీ చేసి అప్పటికీ ఎదవ అని తేలితే ప్రేమను వదిలేయాలని కండీషన్ పెడతాడు డాక్టర్. అందుకు మను తండ్రి కూడా అంగీకరిస్తాడు. మరీ ఈ 30 రోజుల జర్నీ ఎలా నడిచింది? శ్రీను మంచోడు అనిపించుకున్నాడా? శ్రీను, మను ఒకటయ్యారా అన్నదే కథ.
విశ్లేషణ..
ఆవారాగా తిరిగే కుర్రాడు, సలక్షణంగా పెరిగిన అమ్మాయి మధ్య ప్రేమ, పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడం, ఫైనల్ గా ఆ జంట ఒకటయ్యారా? లేదా? అన్న సింపుల్ లవ్ స్టోరీ ఇది. ఇలాంటి కథతోనే గతంలో బొమ్మరిల్లు సినిమా వచ్చింది. ఇక ఈ సినిమాలో ప్రథమార్థం కాలేజ్, రొటీన్ లవ్‌స్టోరీతో సోసోగా సాగుతుంది. మను ప్రేమ ఇంట్లో తెలియడం, కుర్రాడికి కండీషన్లు పెట్టడంతో కథ కాస్త ముందుకు సాగుతుంది. విరామ సమయానికి 30 రోజుల ఛాలెంజ్… ఆ తర్వాత ఏం జరిగిందన్న పాయింట్‌తో కథపై ఆసక్తి కలుగుతుంది. ద్వితీయార్థం అంతా హీరో, హీరోయిన్ తండ్రితో జర్నీ చేస్తూ ఎదవ కాదు మంచోడు అనిపించుకునే ప్రయత్నాలు చేస్తాడు. ఆ ఇద్దరి మధ్య కొన్ని సన్నివేశాలు ఫన్ రైడ్‌లా ఉన్నా.. మరి కొన్ని సన్నివేశాలు సహనానికి పరీక్ష పెడతాయి. వినోద ప్రధానంగా నడపాలని ట్రై చేశారు కానీ వర్కవుట్ కాలేదు. 30 రోజుల గడువు తర్వాత హీరో ఎదవ అనే తేలుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్ కొద్దిగా భావోద్వేగంతో ఊహించని విధంగా రాసుకున్నాడు దర్శకుడు. ఫ్లోలో నడుస్తున్న సమయంలో అనవసర సన్నివేశాలు తీసుకొచ్చి, కథ ట్రాక్ తప్పించిన భావన కలుగుతుంది. గంటన్నర సినిమా సోసోగా సాగినా క్లైమాక్స్ ను సెంటిమెంట్‌తో డ్రైవ్ చేశాడు. సినిమా మొత్తం ఎదవ... ఎదవ… అని పిలిపించుకున్న హీరో ఒక్కసారిగా మంచోడు ఎలా అయ్యాడు అనే పాయింట్ కు కొద్దిగా కళ్లు చెమర్చే భావోద్వేగాన్ని జోడించారు.
నటీటనులు, సాంకేతిక నిపుణులు పనితీరు..
ఓ కొత్త వ్యక్తి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించడం కాస్త సవాల్‌తో కూడిన విషయమే! అలా చూస్తే హీరో, దర్శకుడిగా త్రినాథ్ కఠారి రెండు శాఖలకు న్యాయం చేసినట్లే. అయితే ఎక్కువగా దర్శకత్వం పై ఫోకస్ పెట్టడంతో హీరోగా తక్కువ మార్కులు పడతాయి. చాలా చోట్ల రవితేజను ఇమిటేట్ చేసే ప్రయత్నం చేయటం బాగా మైనస్. అలాగే తండ్రి గోపరాజు రమణతో ఉన్న కొన్ని సీన్స్ ఇడియట్ లో కోట, రవితేజ సీన్స్ ను గుర్తు చేస్తాయి. ఇక హీరోయిన్ గా నటించిన సాహితీ చబ్బీగా కనిపిస్తూ అమాయకంగా తన పాత్రకు న్యాయం చేసింది. ఎప్పుడు తిడుతూ ఉండే తండ్రి పాత్రలో గోపరాజు రమణ, కూతురు కోసం ఆలోచించే తండ్రి పాత్రలో దేవి ప్రసాద్ ఇమిడిపోయారు. కొన్ని చోట్ల దేవి ప్రసాద్ పాత్ర అతిగా అనిపిస్తుంది. డాక్టర్‌గా తనికెళ్ళ భరణి తనదైన పంథాలో చేసుకెళ్లిపోయారు. మిగితా పాత్రధారులంతా తమ తమ పరిధి మేర నటించారు. విజువల్‌గా సినిమా బాగానే ఉంది. బీచ్‌లో పాట బావుంది. ఆర్.పి పట్నాయక్ సంగీతం ఫర్వాలేదనిపించింది. ఫస్టాఫ్‌కి ఎడిటర్ ఉద్దవ్ ఇంకాస్త కత్తెర వేసుంటే బావుండేది. ‘బొమ్మరిల్లు’ కథని రివర్స్ చేసి రొటీన్‌గా తెరకెక్కించినట్లు అనిపిస్తుంది.
ట్యాగ్ లైన్: ‘బొమ్మరిల్లు’ రివర్స్
రేటింగ్: 2.25 / 5