Beauty Review: 'బ్యూటీ’.. సినిమా రివ్యూ! ఎలా ఉందంటే

ABN , Publish Date - Sep 19 , 2025 | 07:31 AM

సెప్టెంబర్‌ నెలలో పెద్ద సినిమాల తాకిడి లేకపోవడంతో చిన్న సినిమాలు వరుస కట్టాయి. ఈ శుక్రవారం డైరెక్ట్‌, డబ్బింగ్‌ కలిపి నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి.

Beauty Review

సెప్టెంబర్‌ నెలలో పెద్ద సినిమాల తాకిడి లేకపోవడంతో చిన్న సినిమాలు వరుస కట్టాయి. ఈ శుక్రవారం డైరెక్ట్‌, డబ్బింగ్‌ కలిపి నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అందులో అంకిత్‌ కొయ్య (Ankith Koyya), నిలాఖి పాత్ర (Nilakhi Patra) జంటగా నటించిన 'బ్యూటీ’ (BEAUTY) చిత్రం ఒకటి. వీకే నరేష్ (Naresh VK), నితిన్‌ ప్రసన్న (Nitin Prasanna), వాసుకి, ప్రసాద్‌ బెహరా, నాగేంద్ర మేడిద, తదితరులు కీలక పాత్రధారులు. మారుతీ టీం వర్క్స్‌, వానర స్టూడియోస్‌ పతాకాలపై అడిదాల విజయపాల్‌ రెడ్డి నిర్మించారు. జె.ఎస్‌.ఎస్‌ వర్ధన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్‌లతో ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏ మేరకు మెప్పించిందో చూద్దాం.

 కథ

అలేఖ్య (నీలఖి పాత్ర) మధ్య తరగతి కుటుంబానికి చెందిన అందమైన అమ్మాయి. వైజాగ్‌లో ఇంటర్‌ చదువుతున్న ఆమెకు అమాయకత్వం, కోపం, సంతోషం ఇలా ఏదైనా కాస్త ఎక్కువే. అలేఖ్య తండ్రి నారాయణ(నరేష్‌) క్యాబ్‌ డ్రైవర్‌. కూతురు అంటే పంచ ప్రాణాలు. అర్జున్‌ (అంకిత్‌ కొయ్య) పెట్‌ ట్రైనర్‌. కాలేజ్‌ దగ్గర అలేఖ్యతో పరిచయమవుతుంది, అది ప్రేమ వరకూ వెళ్తుంది. అంకిత్‌, అలేఖ్య కలిసి చేసిన ఓ తప్పు వల్ల ఇంట్లో వాళ్లకి భయపడి వైజాగ్‌ వదిలి ‘హైదరాబాద్‌ పారిపోతారు. కనిపించని కూతుర్ని వెతుక్కుంటూ నారాయణ కూడా హైదరాబాద్‌ బయలుదేరతాడు. మరోవైపు అమ్మాయిల అసభ్యకర వీడియోలు చిత్రీకరించి బ్లాక్‌మెయిల్‌ చేస్తూ డబ్బు లాగుతుంటాడు రోహిత్‌. అతనికి హీరోకి సంబంధం ఏంటి? అసలు కథ హైదరాబాద్‌కి షిప్ట్‌ అయ్యాక ఏం జరిగింది. అలేఖ్య, అర్జున్‌ ప్రేమ సుఖాంతం అయిందా? లేదా అన్నది మిగతా కథ.

Beauty Review

విశ్లేషణ:

ఓ మధ్య తరగతి కుటుంబం, కాస్త ఎఫెక్షన్‌ చూపిస్తే ప్రేమ అని నమ్మే అమ్మాయి, మాయ మాటలతో అమ్మాయిలను ట్రాప్‌ చేసే యువకులు.. దాని ద్వారా ఎదురైన సమస్యలతో క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కించిన చిత్రమిది. ఫస్టాఫ్‌ అంతా అలేఖ్య కాలేజ్‌, కుటుంబం, తను ప్రేమలో పడటంతో సాగుతుంది. చిన్న పరిచయంతో అలేఖ్య, అర్జున్‌ల మధ్య బాండింగ్‌ ఎలా బలపడిందో సరిగ్గా చూపించలేదు. ప్రేమ మొదలైనప్పటి నుంచీ కన్నా, కన్నమ్మా అంటూ పిలుచుకోవడం ప్రేక్షకుడికి ఇబ్బంది కలిగిస్తుంది. ఈ రోజుల్లో ప్రేమికులు మధ్య జరిగేది ఇదే అయినా హీరోహీరోయిన్‌ పాత్రలు కొన్ని సన్నివేశాల్లో నిబ్బా – నిబ్బి చేష్టలుగా అనిపిస్తుంది. హీరోహీరోయిన్‌ మధ్య కెమిస్ట్రీ, రొమాంటిక్‌ సీన్స్‌ బాగా పండాయి. ఫస్టాఫ్‌ అంతా తెలిసిన కథతో సోసోగా సాగింది. (Beauty Review). ఇదంతా చూశాక కథలో ఏదో ట్విస్ట్‌ ఉంటుంది.. లేకపోతే ఇంత రొటీన్‌ కథతో దర్శకుడు ఫస్టాఫ్‌ మొత్తం ఎలా నడిపిస్తాడు అనిపిస్తుంది. అలాగే ఇంటర్వెల్‌ తర్వాత ఓ పెద్ద ట్విస్ట్‌. కాస్త లాజిక్‌తో ఆలోచిస్తే ఆ ట్విస్ట్‌ ఊహించేలాగే ఉంది. మైనర్‌ అమ్మాయికి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఎలా ఇచ్చారనే లాజిక్‌లు గాలికి వదిలేశారు. సెకెండాఫ్‌లో పోలీస్‌ ఇన్వెస్టిగేషన్‌ అంతా షార్ట్‌ అండ్‌ స్వీట్‌గా చెప్పకుండా సాగదీసిన భావన కలుగుతుంది. లాడ్జ్‌లో సీన్స్‌ అవసరం లేదనిపించింది. ఎంతో బలంగా ఉండాల్సిన క్లైమాక్స్‌ తేలిపోయినట్లు అనిపిస్తుంది. తన కూతురు జాడ కోసం తండ్రి పడే తపన నేపథ్యంలో సాగే సన్నివేశాల్లో నరేశ్‌ భావోద్వేగానికి లోనయ్యేలా చేశారు. ఎక్స్‌పోజ్‌ లేకపోతే సినిమాలే చూడరు అన్నట్లు తన క్యూట్‌నెస్‌తోనే అలరించిన నీలాఖితో స్కిన్‌ షో చేయించాల్సిన అవసరం లేదనిపించింది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు పనితీరుకు వస్తే..

అమాయకమైన, స్వచ్ఛమైన ప్రేమను పంచే అమ్మాయిగా, మధ్యతరగతి తండ్రికి గారాల బిడ్డగా నీలఖి అద్భుతంగా నటించింది. పాత్రకు తగ్గట్టు చక్కని వేరియేషన్స్‌ చూపించింది. క్యూట్‌గా, బబ్లీగా కనిపిస్తూనే గ్లామర్‌ షోతోనూ మెప్పించింది. తెరపై ఆమె కనబర్చిన నటన చూస్తే చిన్న సినిమాలకు ప్రామిసింగ్‌ హీరోయిన్‌ దొరికిన భావన కలుగుతుంది. అర్జున్‌ క్యారక్టర్‌లో అంకిత్‌ కొయ్య ఎనర్జీగా నటించాడు. అయితే కొన్ని సన్నివేశాల్లో డైరెక్ట్‌ షాట్స్‌ కాకుండా సైడ్‌ యాంగిల్‌లో చూపించారు. కారణమేంటో దర్శకుడికే తెలియాలి. తన గత రెండు చిత్రాల కన్నా ఈ సినిమాలో నటన పరంగా ఫర్వాలేదనిపించాడు. మధ్య తరగతి తల్లిదండ్రులుగా నరేశ్‌, వాసుకి పాత్రలకు వంద శాతం యాప్ట్‌ అయ్యారు. కూతుర్నే పంచప్రాణాలు గా భావించే తండ్రిగా సన్నివేశాలకు అనుగుణంగా భావోద్వేగాలు పండించారు నరేష్. ఆ పాత్రలో నరేష్ కాకుండా ఓ తండ్రి కనిపించారు. సిఐ ‘అన్వర్‌’గా మలయాళ నటుడు నితిన్‌ ప్రసన్న పాత్రకు న్యాయం చేశారు. మురళీధర్‌ గౌడ్‌, ప్రసాద్‌ బెహరా, నాగేందర పరిధి మేరకు నటించారు. సినిమాను మొత్తం వైజాగ్‌లోని రియల్‌ లొకేషన్స్‌లోనే చిత్రీకరించారు. సాయికుమార్‌ దార కెమెరా పనితనం న్యాచురల్‌గా ఉంది. విజయ్‌ బుల్గానిన్‌ పాటలు, నేపథ్యం సంగీతం సినిమాను ముందుకు నడిపించింది. ఎడిటింగ్‌ విషయంలో కాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే రన్‌ ఇంకా షార్ప్‌గా ఉండేది. అక్కడక్కడా సీరియల్‌ చూసిన భావన కలుగుతుంది. నిర్మాణ విలువలు బావున్నాయి.

క్రైమ్‌తో ముడిపెట్టిన రొటీన్‌ ప్రేమ కథ ఇది. ఈ తరహా కథలతో చాలా సినిమాలే చూశాం. కథ పాతదే అయినా ఇప్పటి యూత్‌కి కావలసిన అంశాలతో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా దర్శకుడు నడిపించిన తీరు బావుంది. సొసైటీలో జరుగుతున్న అంశాన్నే ఇందులో చూపించారు. మాటలు, స్ర్కీన్‌ప్లే విషయంలో కాస్త జాగ్రత్త తీసుకోవలసింది. ఈ తరహా కథలు ఈ మధ్యకాలంలో ఓటీటీలో కూడా విపరీతంగా వచ్చాయి. ఈ సందర్భంలో బిగ్‌ స్ర్కీన్‌పై ప్రేక్షకులను ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.  

 

ట్యాగ్‌లైన్‌: రొటీన్‌ బ్యూటీ

రేటింగ్‌: 2.25/5

Updated Date - Sep 19 , 2025 | 08:19 AM