Sitaare Zameen Par Review: ఆమిర్ ఖాన్ 'సితారే జమీన్ పర్' ఎలా సాగిందంటే...

ABN , Publish Date - Jun 20 , 2025 | 08:01 PM

వైవిధ్యం కోసం తపించే ఆమిర్ ఖాన్ ఇప్పటికి పలుమార్లు విలక్షణమైన పాత్రల్లో అలరించారు. దాదాపు 18 ఏళ్ళ క్రితం స్వీయ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ నిర్మించి నటించిన 'తారే జమీన్ పర్' కన్నీరు పెట్టిస్తూనే కలెక్షన్ల వర్షం కురిపించింది.

సినిమా రివ్యూ: సితారే జమీన్ పర్ (Sitaare Zameen Par review)

విడుదల తేదీ: 20-6-2025

వైవిధ్యం కోసం తపించే ఆమిర్ ఖాన్ (Aamir Khan) ఇప్పటికి పలుమార్లు విలక్షణమైన పాత్రల్లో అలరించారు. దాదాపు 18 ఏళ్ళ క్రితం స్వీయ దర్శకత్వంలో ఆమిర్ ఖాన్ నిర్మించి నటించిన 'తారే జమీన్ పర్' కన్నీరు పెట్టిస్తూనే కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు కూడా అదే తీరున సాగే ప్రయత్నంలో భాగంగా 'సితారే జమీన్ పర్' లో నటించారు ఆమిర్. ఈ సినిమాను అపర్ణా పురోహిత్, రవి భాగ్చండ్కా, బి.శ్రీనివాసరావుతో కలసి ఆమిర్ నిర్మించారు. ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వంలో తెరకెక్కిన 'సితారే జమీన్ పర్'కు 2018లో వచ్చిన స్పానిష్ స్పోర్ట్స్ కామెడీ 'ఛాంపియన్స్' ఆధారం. శుక్రవారం 'సితారే జమీన్ పర్' జనం ముందు నిలచింది.

'సితారే జమీన్ పర్' కథ విషయానికి వస్తే - బాస్కెట్ బాల్ అసిస్టెంట్ కోచ్ గుల్షన్ అరోరా అహంకారి. తనను ఎవరైనా ఓ మాటంటే పడడు. ఓ సారి తన సీనియర్ తో గొడవపడి కోపంతో అతణ్ణి కొడతాడు గుల్షన్. దాంతో సస్పెండ్ అవుతాడు. తరువాత తప్పతాగి పోలీస్ వ్యాన్ ఎక్కవలసి వస్తుంది. అతను బాస్కెట్ బాల్ కోచ్ అన్న విషయం తెలిసి శిక్షగా మూడు నెలల పాటు 'స్పెషల్లీ ఏబుల్డ్' అడల్ట్స్ కు బాస్కెట్ బాల్ నేర్పించమని చెబుతారు. దానికి షాక్ అయిన గుల్షన్ అయిష్టంగానే వెళతాడు. తమను ఎవరైనా జాలితో చూస్తే సహించని ఆ ప్రత్యేక కోవకు చెందిన వాళ్ళతో హీరో ఎలా వేగాడు, చివరకు ఏమైంది అన్నదే మిగిలిన కథ.


'సితారే జమీన్ పర్' ప్రథమార్ధం నత్తనడకతో సాగుతుంది. ప్రేక్షకుల సహనాన్నీ పరీక్షిస్తుంది. ముఖ్యంగా హీరో సంసారానికి సంబంధించిన సీన్స్ వచ్చినప్పుడు స్లోగానే సాగడం బోర్ కొట్టిస్తుంది. మొదట్లో నవ్వులు అంతగా పండలేదు. ఇంటర్వెల్ సీన్, ఆ తరువాత వచ్చే సన్నివేశాలన్నీ ఆసక్తిగా సాగుతాయి. నవ్వులు కూడా మొదలవుతాయి. కామెడీ అంటే ఆమిర్ కు కొట్టిన పిండి. దాంతో తన పాత్రను చాలా సులువుగా పోషించారు. హీరో భార్య సునీత పాత్రలో జెనీలియా ఒదిగిపోయింది. స్పెషల్లీ ఏబుల్డ్ గా నటించిన వారిలో ఆశిష్ పెండ్సే అందరికన్నా ఎక్కువ మార్కులు సంపాదించాడు. మిగిలిన వారు కూడా తమ పాత్రలకు తగ్గ నటనను ప్రదర్శించారు. అసలు వారితో ఆ స్థాయి అభినయాన్ని పట్టేసిన డైరెక్టర్ ప్రసన్నను అభినందించకుండా ఉండలేం. శంకర్ - ఎహ్ సాన్ - లాయ్ స్వరకల్పనలో ఆట్టే ఆకట్టుకొనే పాటలు లేకపోయినా, సందర్భోచితంగా సాగిన గీతాలున్నాయని చెప్పొచ్చు. ఇక రామ్ సంపత్ సన్నివేశాలకు తగ్గట్టుగా నేపథ్య సంగీతం పలికించారు. జి.శ్రీనివాస్ రెడ్డి కెమెరా పనితనం, చారు శ్రీరాయ్ కూర్పు కూడా మార్కులు సంపాదిస్తాయి. 'తారే జమీన్ పర్' స్థాయిలో లేకపోయినా 'సితారే జమీన్ పర్' కూడా ఆకట్టుకోగలదు.

ట్యాగ్ లైన్ : సీ...తారే!

రేటింగ్ : 2.75/ 5

Updated Date - Jun 20 , 2025 | 08:01 PM