Shambala Review: 'శంబాల'.. సినిమా రివ్యూ! ఆది హిట్ కొట్టాడా

ABN , Publish Date - Dec 25 , 2025 | 11:06 AM

ఎన్నో ఎండ్లుగా సాలీడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్న హీరో ఆది సాయికుమార్ న‌టించిన కొత్త చిత్రం శంబాల‌. రిలీజ్‌కు ముందే మంచి అంచ‌నాలు ఏర్ప‌ర్చుకున్న ఈ చిత్రం గురువారం థియేట‌ర్ల‌కు వ‌చ్చింది.

సినిమా రివ్యూ: శంబాల

విడుదల తేది: 25-12-2025

ఆది సాయికుమార్ వరుస అవకాశాలు అందుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నా సక్సెస్ మాత్రం ఆమడ దూరంలో ఉంటోంది. ఈసారి కొంత గ్యాప్ తీసుకుని మిస్టీక్ థ్రిల్లర్ కథాంశాన్ని సెలెక్ట్ చేసుకుని రంగంలో దిగాడు. అదే ‘శంబాల’. యుగంధర్ ముని దర్శకత్వం వహించిన ఈ మూవీలో అర్చనా అయ్యర్, శ్వాసిక, మధునందన్ కీలక పాత్రధారులు. ఫస్ట్ లుక్ నుంచే ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది. మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మించిన ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి హిట్టు కోసం ఎదురుచూస్తున్న ఆదికి విజయం దక్కిందో? లేదో చూద్దాం…

కథ:.

వెయ్యేళ్ల చరిత్ర ఉన్న ఊరు శంబాల. అక్కడ ఆకాశం నుంచి ఓ ఉల్క జారి పడుతుంది. దాంతో ఆ ఊరిలో విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఎవరో ఒకరిని ఎదో ఒక శక్తి ఆవహించి ఆపై ఆవహించిన వ్యక్తులతో హత్యలు చేయించి అనంతరం ఆత్మహత్య చేసుకుని చనిపోయేలా చేస్తూ ఉంటుంది. అక్కడ పడిన ఉల్కను బండ భూతంగా పిలుస్తూ దాని వల్లే ఈ అనార్థాలని ఆ గ్రామ ప్రజలు నమ్ముతారు.అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి, ఆ ఉల్కను పరీక్షించడానికి సెంట్రల్ గవర్నమెంట్ విక్రమ్ (ఆది సాయి కుమార్) అనే సైంటిస్ను శాంబాలకు పంపుతుంది. దేవుడు, దెయ్యంపై నమ్మకం లేని అతను సైన్స్నే నమ్ముకుని విధులు నిర్వర్తిస్తుంటాడు. పోలీస్ హనుమంతు (మధునందన్) అతనికి సాయం చేస్తుంటాడు. అయితే ఆ ఊరిలో కనిపించిన దేవి (అర్చన అయ్యర్) ఎవరు? ఆ ఊళ్లో వింత చావుల వెనుక ఉన్న కథేంటి? ఆ అనర్థాల వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఆ సమస్యకు విక్రమ్ పరిష్కారం చూపించాడా? లేదా!? అన్నదే ఈ సినిమా కథ.

విశ్లేషణ:

సింపుల్గా చెప్పాలంటే ఓ ఊరు, దాని వెనక చరిత్ర, ఉల్క పడటంతో విచిత్ర మరణాలు సంభవించడం, దానికి హీరో చూపించిన పరిష్కారమే ఈ కథ. ఇక ఆ ఊరికి పురాణాల్లోని సంఘటనలకు ఉన్న సంబంధాన్ని సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో మొదలు పెట్టడం ఆసక్తిని క్రియేట్ చేస్తుంది. ప్రథమార్థం మొత్తం శంబాల గ్రామ పరిచయం... అక్కడి ప్రజలకు ఎదురయ్యే వింత సంఘటనల చుట్టూ సాగుతుంది. ఊరిలో ఉల్క పడడం.. ఆవు నుంచి పాలుకు బదులు రక్తం రావడం... రైతు రాములు వింతగా ప్రవర్తించడం ఇలా సినిమా ప్రారంభంలోనే శంబాల ప్రపంచంలోకి తీసుకెళ్లాడు దర్శకుడు. రవివర్మ పాత్ర సన్నివేశాలే భయపెట్టేలా ఉంటే… అంతకు రెట్టింపు మీసాల లక్ష్మణ్ పాత్ర ఉంటుంది. హీరో ఎంట్రీ ఇచ్చినా సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగడానికి టైమ్ తీసుకోవడంతో బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. ఊరి దేవత చరిత్ర, ఉల్క పడటంతో జరిగిన పరిణామం, అరిషడ్వర్గాల కోణం... ఇవన్నీ సెకెండాఫ్లో ఉంటాయి. ఆ సన్నివేశాలు మాత్రం దర్శకుడు బాగా రాసుకున్నాడు. అలాగే తెరకెక్కించాడు కూడా. సెకెండాఫ్లో బండ భూతం మరికొందరిని ఆవహించడం, వాళ్లకి ఎదురుగా కథానాయకుడు చేసే పోరాటం ఆసక్తిని రేకెత్తిస్తుంది. చిన్నారితో క్లైమాక్స్ సన్నివేశాలను లింక్ చేయడంతో కొంత మేరకు భావోద్వేగం కలుగుతుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణుల పనితీరు..

ఎక్కువగా లవర్బాయ్గా కనిపించిన ఆది ఈసారి జానర్ మార్చారు. కాస్త డేర్ చేసి థ్రిల్లర్ వైపు అడుగేశారు. సీరియస్ క్యారెక్టర్లో కనిపించి మెప్పించారు. దేవి పాత్రలో అర్చన అయ్యర్ చక్కగానే అమరింది. రవివర్మ, మీసాల లక్ష్మణ్, ఇంద్రనీల్, మధునందన్, సిజ్జు, ప్రియ, శ్రావణ సంధ్య. శ్వాసిక, బేబి ఛైత్ర, శివ ఇలా అందరూ బలమైన పాత్రలు పోషించారు. ఆయా పాత్రల్లో ఇమిడిపోయారు. సినిమాపై వారి ప్రభావం కనిపిస్తుంది. ఈ తరహా చిత్రాలకు నేపథ్య సంగీతం కీలకం.. శ్రీచరణ్ పాకాల తన పనికి నూటిని నూరుశాతం న్యాయం చేశారు. ప్రవీణ్ కె.బంగారి విజువల్స్ సహజంగా ఉన్నాయి. శంబాలా ఓ కొత్త ప్రపంచం అన్నట్లు చూపించారు. నైట్ సీన్స్ అన్ని చక్కని లైటింగ్తో చిత్రీకరించారు. నిర్మాణ విలువలు బావున్నాయి. విరూపాక్ష సినిమా నుంచి మిస్టీక్ జానర్కు మంచి క్రేజ్ పెరిగింది. ఈ టైప్ కథను ధ్రిల్లింగ్ ఎలిమెంట్స్తో తెరపైకి తీసుకొస్తే చాలు ఆడియన్స్ ఆదరిస్తున్నారు. దర్శకుడి రచనలో అక్కడక్కడా లోపాలు ఉన్నా మేకింగ్ పరంగా సత్తా చాడాడు. క్లైమాక్స్ లో గంటల శబ్దం తో పరిష్కారం చూపటంతో ఓస్ ఇంతేనా అనిపించినా… సైన్స్కి, శాస్త్రాలకు మధ్య సంబంధాన్ని వివరించిన తీరు ఆకట్టుకుంటుంది. సైన్స్లోనూ శాస్త్రం ఉంది.. .శాస్త్రంలోనూ సైన్స్ ఉందనే చెప్పే ప్రయత్నం చేశారు దర్శకుడు. థ్రిల్లర్, హారర్ చిత్రాలు ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే ఆస్కారం ఉంది.

ట్యాగ్లైన్: మిస్టిక్ థ్రిల్లర్.. శంబాల

రేటింగ్: 2.5/5

Updated Date - Dec 25 , 2025 | 03:03 PM