మీరు నేర్పాల్సిన అవసరం లేదు
ABN , Publish Date - Jan 01 , 2025 | 06:06 AM
పెద్దలను ఎలా గౌరవించాలో మీరు మాకు నేర్పాల్సిన అవసరం లేదు, మీ కన్నా మేము ఎక్కువగా బోనీకపూర్‌ను గౌరవిస్తాం అని బాలీవుడ్ విశ్లేషకుడు సుమిత్ కడేల్‌కు టాలీవుడ్ నిర్మాత నాగవంశీ బదులిచ్చారు...
పెద్దలను ఎలా గౌరవించాలో మీరు మాకు నేర్పాల్సిన అవసరం లేదు, మీ కన్నా మేము ఎక్కువగా బోనీకపూర్‌ను గౌరవిస్తాం అని బాలీవుడ్ విశ్లేషకుడు సుమిత్ కడేల్‌కు టాలీవుడ్ నిర్మాత నాగవంశీ బదులిచ్చారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్, నాగవంశీ మధ్య వాడి వేడీ చర్చ నడిచింది. బాలీవుడ్ సినిమా ఇంకా బాంద్రా, జూహూ దగ్గరే ఆగిపోయిందనీ, మూస ధోరణిలో ఇరుక్కుపోయిన హిందీ పరిశ్రమకు దక్షిణాది దర్శకులే కొత్త దారులు చూపుతున్నార న్న నాగవంశీ వ్యాఖ్యలను బోనీకపూర్ అంగీకరించ లేదు. కొత్తగా ప్రయోగాలు చేయడం బాలీవుడ్‌లో ఎప్పట్నుంచో ఉన్నదేననీ, ఇప్పుడు కూడా అది కొనసాగుతోందని ఆయన సమర్థించుకునే ప్రయత్నం చేశారు. హిందీ బెల్ట్‌లో ‘పుష్ప 2’ తొలి రోజు వసూళ్లు చూసి బాలీవుడ్‌కు నిద్రపట్టలేదేమో అంటూ నాగవంశీ ఎత్తిపొడిచారు. ఈ వీడియో వైర ల్ అవడంతో బాలీవుడ్ అభిమానులు నాగవంశీని తప్పుపడుతున్నారు.
బోనీకపూర్ పట్ల నాగవంశీ ప్రవర్తన అమర్యాదరకంగా ఉందంటూ సుమిత్ కడేల్ ట్వీట్ చేశారు. మీ అభిప్రాయాన్ని మరింత హుందాగా వ్యక్తం చేసి ఉండొచ్చు, విమర్శ మంచిదే కానీ, అమర్యాదకర ప్రవర్తన ఆమోదయోగ్యం కాదు, అహంకారం పతనానికి దారి తీస్తుందని సుమిత్ కడేల్ చేసిన ట్వీట్‌కు నాగవంశీ బదులిచ్చారు.