కొత్త బాలకృష్ణని చూస్తారు

ABN, Publish Date - Jan 12 , 2025 | 05:56 AM

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్‌’. శ్రద్ధా శ్రీనాథ్‌, ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికలు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేడు విడుదలవుతున్న...

నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘డాకు మహారాజ్‌’. శ్రద్ధా శ్రీనాథ్‌, ప్రగ్యా జైస్వాల్‌ కథానాయికలు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. నేడు విడుదలవుతున్న ఈ సినిమాలో బాబీ డియోల్‌, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. ఈ నేపథ్యంలో బాబీ కొల్లి మీడియాతో మాట్లాడుతూ ‘బాలకృష్ణ ఇమేజ్‌ని, ప్రేక్షకుల్లో ఆయన సినిమాపై ఉండే అంచనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చిత్రాన్ని రూపొందించాం. బాలకృష్ణ గత చిత్రాలకు భిన్నంగా కొత్తగా చూపించడానికి ప్రయత్నించాం. బాలయ్య సెటిల్డ్‌గా డైలాగ్‌లు చెప్తే చాలా బాగుంటుంది. ‘నరసింహనాయుడు’, ‘సమరసింహారెడ్డి’ తర్వాత ‘సింహా’ ఎలా అయితే గర్తుండిపోయిందో...‘డాకు మహారాజ్‌’ కూడా అలాంటి పేరు తెచ్చుకుంటుందనే నమ్మకం ఉంది. బాలకృష్ణపై అభిమానంతో నాగవంశీ ఈ సినిమా వైవిధ్యంగా ఉండాలని భావించారు.


హీరోకి ఆయుధం అనేది కీలకం. ముఖ్యంగా బాలకృష్ణ సినిమాల్లో గొడ్డలి వంటి పవర్‌ ఫుల్‌ ఆయుధం బాగా ఫేమస్‌. ఈ సినిమాలో అలాంటి శక్తిమంతమైన ఆయుధాలను డిజైన్‌ చేయించాం. నా గత సినిమాలతో బాబీ కథకథనాలు బాగా రాస్తాడు అనే పేరు తెచ్చుకోగలిగాను. అయితే హాలివుడ్‌ స్థాయిలో విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుకునేలా చేయలేకపోయాను. ఇప్పుడు ‘డాకు మహారాజ్‌’తో విజువల్స్‌ పరంగా గొప్ప పేరు వస్తుంది. ప్రగ్యా జైస్వాల్‌, శ్రద్ధా శ్రీనాథ్‌ వారి పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. రెగ్యులర్‌ విలన్‌ పాత్రలా కాకుండా బాబీ డియోల్‌ పాత్ర కొత్తగా ఉంటుంది’ అని వివరించారు.

Updated Date - Jan 12 , 2025 | 05:56 AM