మా ‘నీలమ్మ’కు పద్మ అవార్డ్‌ రావడం ఆనందంగా ఉంది

ABN , Publish Date - Jan 28 , 2025 | 04:45 AM

కళారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా బెంగాల్‌కు చెందిన నృత్య కళాకారిణి మమతా శంకర్‌కు కేంద్రప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ అవార్డ్‌ ప్రకటించిన సంగతి విదితమే. అయితే మమత కేవలం...

కళారంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా బెంగాల్‌కు చెందిన నృత్య కళాకారిణి మమతా శంకర్‌కు కేంద్రప్రభుత్వం ఇటీవల పద్మశ్రీ అవార్డ్‌ ప్రకటించిన సంగతి విదితమే. అయితే మమత కేవలం నృత్యకళాకారిణి మాత్రమే కాదు కొన్ని చిత్రాల్లో నటించారనీ, అందులోనూ తెలుగులో మృణాల్‌ సేన్‌ రూపొందించిన ‘ఒక ఊరి కథ’(1977) చిత్రంలో మమత హీరోయిన్‌గా నటించారనీ చాలా కొద్దిమందికే తెలిసిన విషయం. మృణాల్‌ సేన్‌ దర్శకత్వంలో 1976లో వచ్చిన ‘మృగయ’ అనే బెంగాలీ చిత్రం ద్వారా మమతా శంకర్‌ తెరంగేంట్రం చేశారు. ఈ సినిమాలో మిఽథున్‌ చక్రవర్తి హీరోగా నటించారు. ఆవిడ నటించిన రెండో సినిమా ‘ఒక ఊరి కథ’. ఆ చిత్ర కథానాయకుడు, సీనియర్‌ నటుడు నారాయణరావు మమతా శంకర్‌కు పద్మ పురస్కారం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ‘మా హీరోయిన్‌ (నీలమ్మ) మమతా శంకర్‌కు పద్మశ్రీ పురస్కారం రావడం చాలా ఆనందంగా ఉంది. వృత్తి పట్ల అంకితభావం ఉన్న కళాకారిణి ఆమె. చాలా కలుపుగోలు మనిషి. చాలా మంచి డ్యాన్సర్‌ కూడా. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలో షూటింగ్‌ చేశాం.


ఇందులో బక్క చిక్కిన రైతు పాత్ర నాది. నా భార్య నీలమ్మగా మమత, తండ్రిగా కన్నడ నటుడు వాసుదేవరావు నటించారు. పని చేయడానికి బద్ధకిస్తూ దొంగతనాలకు అలవాటు పడిన మా ఇద్దరినీ మంచి దారిలో పెట్టడానికి ప్రయత్నించే పాత్రను మమత పోషించారు. మృణాల్‌ సేన్‌ సినిమాలన్నీ వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఈ సినిమాకు మమత డబ్బింగ్‌ చెప్పాలని ప్రయత్నించింది కానీ మాండలికం సరిగ్గా పలకలేకపోవడంతో ఫటాఫట్‌ జయలక్ష్మితో డబ్బింగ్‌ చెప్పించాం. ఆరు లక్షల రూపాయల బడ్జెట్‌తో తయారైన ‘ఒక ఊరి కథ’ చిత్రానికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి’ అని నారాయణారావు చెప్పారు’. కమర్షియల్‌ చిత్రాల్లో కాకుండా ఎక్కువగా వాస్తవిక సినిమాల్లోనే నటించి, ఆ తర్వాత నృత్యానికే తన జీవితాన్ని అంకితం చేసిన 70 ఏళ్ల మమత ప్రస్తుతం కోల్‌కతాలో తన కుమారుడి దగ్గర ఉంటున్నారు.


Also Read- Allu Arjun: విధ్వంసం ఖాయమే.. ట్రెండింగ్ మార్కెట్‌ని పట్టుకున్నారు

Also Read- సూక్ష్మదర్శిని సిరీస్ స్ఫూర్తితోనే శవాన్ని మాయం చేశాడు..

-మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Jan 28 , 2025 | 05:41 AM