Hrithik Roshan: పుట్టిన రోజున సర్ర్పైజ్‌

ABN, Publish Date - May 17 , 2025 | 01:04 AM

హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ కలిసి నటిస్తున్న వార్‌ 2 టీజర్‌ను ఎన్టీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 20న విడుదల చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. హృతిక్‌, ఎన్టీఆర్‌ మధ్య సరదా సంభాషణలు అభిమానులను ఉత్సాహపరిచాయి.

హృతిక్‌రోషన్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌ కథానాయకులుగా రూపొందుతున్న హిందీ చిత్రం ‘వార్‌ 2’. హృతిక్‌ రోషన్‌, టైగర్‌ ష్రాఫ్‌ నటించిన ‘వార్‌’ చిత్రానికి ఇది కొనసాగింపు. కియారా అద్వాణీ కథానాయిక. ఈ స్పై థ్రిల్లర్‌కు అయాన్‌ ముఖర్జీ దర్శకుడు. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. ఆగస్టు 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 20న ఎన్టీఆర్‌ ఫస్ట్‌లుక్‌తో ‘వార్‌ 2’ టీజర్‌ను విడుదల చేసే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం హృతిక్‌ రోషన్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. ‘పుట్టిన రోజు సందర్భంగా నీ కోసం ప్రత్యేక కానుకను సిద్ధం చేశాం. ఏంటో ఊహించగలవా తారక్‌’ అంటూ ఎన్టీఆర్‌ను ఆటపట్టించారు. బదులుగా ఎన్టీఆర్‌ ‘కబీర్‌... నిన్ను వేటాడి నీకు ప్రత్యేక బహుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’ అంటూ సరదాదా బదులిచ్చారు. ప్రస్తుతం ‘వార్‌ 2’ నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

Updated Date - May 17 , 2025 | 01:04 AM