Telugu Cinema Producers: విశాఖలో నిర్మాతల భేటీ
ABN , Publish Date - May 31 , 2025 | 04:10 AM
విశాఖపట్నంలో శుక్రవారం నిర్వహించిన నిర్మాతల భేటీలో తెలుగు సినిమా పరిశ్రమలో ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ జరిగింది. థియేటర్ల నిర్వహణ, సినిమా ప్రదర్శనపై పర్సంటేజీ నిర్ణయాలు వంటి అంశాలు ప్రతిపాదించబడ్డాయి.

తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై విశాఖపట్నంలో శుక్రవారం కీలక సమావేశం జరిగింది. దొండపర్తిలోని ఏపీ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో నిర్వహించిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు సి.కల్యాణ్, నిర్మాతలు అశోక్ కుమార్, సుధాకర్‌రెడ్డి, భరత్ భూషణ్ తదితరులు భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియోల నిర్వాహకులను కూడా ఆహ్వానించారు. అంతా కూర్చొని.. థియేటర్ల నిర్వహణ, సినిమాలు ప్రదర్శించినందుకు యాజమానులకు ఎంత పర్సంటేజీ ఇవ్వాలి వంటి అంశాలపై చర్చించారు. ఒక్కో విభాగం నుంచి తొమ్మిది మంది చొప్పున, మూడు విభాగాల (నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు) నుంచి మొత్తం 27 మందితో మూడు కమిటీల పేర్లను ప్రభుత్వానికి నివేదించనున్నట్టు నిర్మాత భరత్ భూషణ్ మీడియాకు తెలిపారు. ఈ జాబితాను ఆదివారం లేదా సోమవారం ప్రభుత్వానికి ఇస్తామని, అప్పుడే మీడియాకు కూడా అందజేస్తామన్నారు.
- విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి)