జూన్ నుంచి థియేటర్లు బంద్
ABN , Publish Date - May 19 , 2025 | 03:24 AM
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని, థియేటర్లు మూసివేయాలని సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్సంటేజ్ రూపంలో...
తెలుగు రాష్ట్రాల్లో జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ కానున్నాయి. అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమని, థియేటర్లు మూసివేయాలని సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్సంటేజ్ రూపంలో చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని తేల్చి చెప్పారు. ఆదివారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో తెలంగాణ, ఆంధ్రా సినీ ఎగ్జిబిటర్ల సమావేశం నిర్వహించారు. నిర్మాతలు దిల్‌రాజు, సురేశ్‌బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య చాలా కాలంగా పర్సంటేజీలపై చర్చ సాగుతోంది. రెంటల్ విధానంలో సినిమాలు ప్రదర్శించడం సాధ్యం కాదని ఎగ్జిబిటర్లు వాదిస్తుంటే, పర్సంటేజీలు ఇవ్వలేమని డిస్ట్రిబ్యూటర్లు అంటున్నారు. ఈ వ్యవహారం నిర్మాతలకు సైతం ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిటర్ల సమావేశంలో పర్సంటేజీలు, ప్రభుత్వ విధానాలపై చర్చించారు. పర్సంటేజీల రూపంలో చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయాలని తీర్మానించారు.
ఈ సినిమాలపై ప్రభావం
జూన్ 1 నుంచి థియేటర్లు మూసివేయాలనే ఎగ్జిబిటర్ల నిర్ణయంతో పలు సినిమాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం లేకపోలేదు. ఈ నెలాఖరు నుంచి వరుసగా పెద్ద సినిమాలు రిలీజ్ కానున్నాయి. మే 30న భైరవం, జూన్ 5న థగ్ లైఫ్, జూన్ 12 హరిహర వీరమల్లు, జూన్ 27న కన్నప్ప, జూన్ 20న కుబేర, జూలైలో కింగ్‌డమ్ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.