తొలి తెలుగు మహిళా నిర్మాత కృష్ణవేణి అస్తమయం

ABN , Publish Date - Feb 17 , 2025 | 03:11 AM

తెలుగు వారి ఆరాధ్య నటుడు నందమూరి తారకరామారావును వెండితెరకు పరిచయం చేసిన సినిమా ‘మనదేశం’. జాతీయోద్యమ స్ఫూర్తిని కళ్లకు కట్టిన మొట్టమొదటి చిత్రరాజం కూడా ఇదే.! ఈ చిత్ర నిర్మాత, కథానాయకి...

తెలుగు వారి ఆరాధ్య నటుడు నందమూరి తారకరామారావును వెండితెరకు పరిచయం చేసిన సినిమా ‘మనదేశం’. జాతీయోద్యమ స్ఫూర్తిని కళ్లకు కట్టిన మొట్టమొదటి చిత్రరాజం కూడా ఇదే.! ఈ చిత్ర నిర్మాత, కథానాయకి, తెలుగు సినిమా చరిత్రకు నూరు వసంతాల సజీవ సాక్షి, ప్రతిష్ఠాత్మక రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత మేకా కృష్ణవేణి ఆదివారం కన్నుమూశారు.

తెలుగు సినిమా రంగంలో తొలితరం నాయిక, తొలి మహిళా నిర్మాతగా ఖ్యాతి గడించిన మేకా కృష్ణవేణి ఆదివారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. తెలుగు సినిమా చరిత్రలో ఆమెది ఓ ప్రత్యేక అధ్యాయం. తొలితరం నటిగా, గాయనిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా తనదైన ముద్రను వేశారు కృష్ణవేణి. 1924, డిసెంబర్‌ 24న పశ్చిమ గోదావరి జిల్లా పంగిడి గ్రామంలో కృష్ణవేణి జన్మించారు. బాల్యం నుంచి నాటకాలంటే కృష్ణవేణికి ఆసక్తి ఎక్కువ. బాల తారలతో ’అనసూయ’ చిత్రాన్ని రూపొందించాలని భావించిన దర్శకులు సి. పుల్లయ్య రాజమండ్రిలో కృష్ణవేణి నటించిన ’తులాభారం’ నాటకాన్ని చూసి టైటిల్‌ రోల్‌కు ఆమెను ఎంపిక చేశారు.


అప్పుడు కృష్ణవేణి వయసు పది సంవత్సరాలు. ఈ సినిమా నిర్మాణం మొత్తం కోల్‌కతాలో జరిగింది. ఆ తర్వాత ఆమె తిరిగి రాజమండ్రి వచ్చి నాటకాలు వేయడం ప్రారంభించారు. అదే సమయంలో ఆమె తండ్రి డాక్టర్‌ కృష్ణారావు కన్నుమూశారు. దాంతో తల్లి, చిన్నానల ప్రాపకంలో పెరిగింది. 1937లో సి.ఎస్‌.ఆర్‌. ఆంజనేయులు ఆమెను ప్రోత్సహిస్తూ చెన్నయ్‌ తీసుకెళ్ళారు. ఆ సమయంలో ఆమె ’తుకారం’ సినిమాలో నటించారు. అలా కొన్ని చిత్రాలలో బాల నటిగా రాణించారు.

’కచదేవయాని’తో హీరోయిన్‌గా

కృష్ణవేణి హీరోయిన్‌ గా నటించిన తొలి చిత్రం ’కచదేవయాని’ 1938లో వచ్చింది. ఆ తర్వాత ఆమె దాదాపు ఇరవై సినిమాలలో నటించారు. 1939లో ’మహానంద’ చిత్రంలో నటిస్తుండగా ప్రసిద్థ దర్శక నిర్మాత మీర్జాపురం రాజా తో పరిచయం అయ్యింది. అది ప్రేమగా మారి 1940లో వారు విజయవాడలో వివాహం చేసుకున్నారు. వివాహానంతరం భర్త కోరిక మేరకు కృష్ణవేణి బయటి చిత్రాలలో నటించలేదు. సొంత చిత్రాలలోనే నటించారు. అలానే తమ శోభనాచల స్టూడియోస్‌ వ్యవహారాలను పర్యవేక్షించారు. అదే బ్యానర్‌ లో పలు చిత్రాలను నిర్మించారు. ఈ బ్యానర్‌ లో వచ్చిన తొలి సాంఘీక చిత్రం ’జీవనజ్యోతి’ ద్వారానే చదలవాడ నారాయణరావు హీరోగా పరిచయం అయ్యారు. నటిగా కెరీర్‌ ప్రారంభించినప్పటి నుంచీ కృష్ణవేణి తన పాటలను తానే పాడుకున్నారు. విశేషం ఏమంటే ఆమె ’కీలుగుర్రం’ సినిమాలో అంజలీదేవికి ప్లేబ్యాక్‌ పాడారు.


త్రిపురనేని గోపీచంద్‌ ’లక్ష్మమ్మ’ చిత్రాన్ని మొదట మాలతీతో మొదలు పెట్టినా ఆ ప్రాజెక్ట్‌ ఆగిపోయింది. దానిని శోభనాచల స్టూడియోస్‌ టేకోవర్‌ చేసింది. దాంతో అందులో కృష్ణవేణి నాయికగా నటించారు. ఈ సినిమాకు పోటీగా అంజలీదేవి నాయికగా ’శ్రీ లక్ష్మమ్మ కథ’ మొదలైంది. రెండూ పోటాపోటీగా జనం ముందుకు వచ్చాయి. అయితే కృష్ణవేణి నటించిన ’లక్ష్మమ్మ’ చిత్రానికే జనాధరణ దక్కింది. ఇక 1947లో వచ్చిన ’గొల్లభామ’ నటిగా కృష్ణవేణికి అఖండ కీర్తి ప్రతిష్ఠలను తెచ్చిపెట్టింది. కేవలం కథానాయిక పాత్రలే కాకుండా భిన్నమైన పాత్రలను చేయాలని తపించారు. ఆమె ’తిరుగుబాటు’ సినిమాలో వ్యాంప్‌ పాత్రను పోషించారు.

‘మనదేశం’తో ఎన్టీఆర్‌కు తొలి అవకాశం

1942లో కృష్ణవేణి, మీర్జాపురం రాజా దంపతులకు అనూరాధాదేవి జన్మించారు. ఆమె పేరుతో ఎం.ఆర్‌.ఎ. అనే బ్యానర్‌ ను స్థాపించి, ఎల్‌.వి. ప్రసాద్‌ దర్శకత్వంలో కృష్ణవేణి ’మనదేశం’ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ద్వారానే ఎన్టీఆర్‌ చిత్రసీమకు పరిచయం అయ్యారు. బెంగాలీ భాషలో వచ్చిన ’విప్రదాసు’ నవల ఆధారంగా ఈ సినిమా రూపుదిద్దుకుంది. ఘంటసాల, రమేశ్‌ నాయుడుని సంగీత దర్శకులుగా పరిచయం చేశారు, పి. లీల, జిక్కీ లను గాయనీ మణులుగా, ఎర్రా అప్పారావును దర్శకుడిగా జనం ముందుకు తీసుకొచ్చిందీ కృష్ణవేణే! తొలితరం నటీమణులలో అత్యధిక పారితోషికం తీసుకున్న వ్యక్తి కూడా ఆమే. అప్పట్లోనే రూ. 45 వేల పారితోషికం తీసుకున్నారామె. ఆమెతో సరిసమానంగా పారితోషికం తీసుకున్న మరో నటీమణి భానుమతి. నటిగా కృష్ణవేణి చివరగా ’సాహసం’ సినిమా చేశారు. అలానే నిర్మాతగా ఆమె చివరి చిత్రం 1957లో వచ్చిన ’దాంపత్యం’. ఇందులో హీరోగా కోన ప్రభాకరరావు నటించారు. ఆమె కుమార్తె అనూరాధాదేవి తల్లి అడుగుజాడల్లో నడుస్తూ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించారు.


తెలుగు సినిమా రంగానికి కృష్ణవేణి అందించిన సేవలను గుర్తించిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డుతో సత్కరించింది. ఇటీవల విజయవాడలో జరిగిన ’మనదేశం’ వజ్రోత్సవ వేడుకల్లోనూ కృష్ణవేణి పాల్గొన్నారు. చక్రాల కుర్చీలోనే విజయవాడకు వెళ్ళిన ఆమెను ఆ వేదికపై భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సత్కరించారు. కృష్ణవేణి మరణంతో తెలుగు సినిమా రంగం తొలితరం ధృవతార రాలిపోయినట్టయ్యింది. ఆమె పార్థివ దేహానికి పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు నివాళులర్పించారు. ఆదివారం మహా ప్రస్థానంలో కృష్ణవేణి భౌతిక కాయానికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.

‘‘నటీమణి, సినీ నిర్మాత కృష్ణవేణి గారి మరణం నన్ను బాధించింది. ‘మన దేశం’ చిత్రంతో ఎన్టీఆర్‌ను చిత్రరంగానికి పరిచయం చేసి కళారంగానికి వారు చేసిన సేవ మరువలేనిది’’

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


‘‘ఎన్టీఆర్‌ నట జీవితానికి తొలి అవకాశమిచ్చిన కృష్ణవేణిగారి మృతి బాధాకరం. నటి, నిర్మాత, స్టూడియో అధినేతగా ప్రత్యేక అధ్యాయాన్ని సృష్టించారు. ఆమె మృతి వ్యక్తిగతంగా మాకు తీరని లోటు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను’’

- నందమూరి బాలకృష్ణ

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తొలి మహిళా నిర్మాతగా గుర్తింపు పొందిన కృష్ణవేణి తుదిశ్వాస విడిచారని తెలిసి చింతిస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.

- ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌


For Telangana News And Telugu News

Updated Date - Feb 17 , 2025 | 03:11 AM