Allu Aravind New: సైనికులకు సాయంగా నిలుస్తాం
ABN, Publish Date - May 10 , 2025 | 06:19 AM
సైనికుల కోసం ‘సింగిల్’ సినిమా వసూళ్లలోని భాగాన్ని అందజేస్తామని నిర్మాత అల్లు అరవింద్ ప్రకటించారు. ప్రేక్షకుల ఆదరణతో ‘సింగిల్’ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.
అల్లు అరవింద్
‘సైనికులు దేశం కోసం పోరాడుతుంటే మేం సినిమా సెలబ్రేషన్స్ చేసుకోవడం సరికాదు అనిపించింది. అందుకే ‘సింగిల్’ సినిమా వసూళ్లలో కొంత భాగాన్ని మనకోసం పోరాడుతున్న సైనికులకు అందజేస్తాం. మేం ఊహించిన దానికి మించి ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. శ్రీ విష్ణు క థానాయకుడిగా కార్తీక్ రాజు దర్శకత్వం వహించిన ‘సింగిల్’ చిత్రం ప్రేక్షకాదరణతో కొనసాగుతోంది. ఈ సందర్భంగా చిత్రబృందం శుక్రవారం మీడియాతో ముచ్చటించింది. అల్లు అరవింద్ మాట్లాడుతూ ‘ఒక ఆహ్లాదకరమైన సినిమాను ఇవ్వాలని ప్రయత్నించాం. ప్రేక్షకులు సినిమాను అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు. ‘సింగిల్’తో గీతా ఆర్ట్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకొంది’ అన్నారు. శ్రీ విష్ణు మాట్లాడుతూ ‘యుద్ధం వస్తుందని అనుకోలేదు. అందుకే ముందు ప్రకటించిన తేదీకే సింగిల్’ సినిమాను విడుదల చేశాం. అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన వస్తోంది. బాగా నవ్వుకున్నామని ప్రేక్షకులు చెప్పడం సంతోషాన్నిచ్చింది’ అని తెలిపారు. ‘సింగిల్’కు బ్లాక్‌బస్టర్ రెస్పాన్స్ వస్తోంది, ఈ అవకాశం ఇచ్చిన అల్లు అరవింద్ గారికి, మా నిర్మాతలకు ధన్యవాదాలు’ అని కార్తీక్‌రాజు అన్నారు.