Sankranthi Movies: వంద రోజులు ఎక్కడంటే...
ABN, Publish Date - Apr 19 , 2025 | 02:55 PM
ఈ యేడాది పొంగల్ బరిలో హంగామా చేసిన సినిమాల రేంజ్ వేరుగా సాగింది... సంక్రాంతికి విడుదలైన చిత్రాలలో స్టార్ హీరోస్ నటించిన రెండు చిత్రాలు డైరెక్ట్ హండ్రెడ్ డేస్ చూస్తున్నాయి. ఆ ముచ్చట తెలుసుకుందాం.
ఈ యేడాది సంక్రాంతికి ముగ్గురు టాప్ స్టార్స్ మూవీస్ బరిలోకి దూకాయి. వాటిలో ఇద్దరు సీనియర్ స్టార్స్ చిత్రాలు ఉండగా, ఒకటి యంగ్ హీరో సినిమా. ముందుగా జనవరి 10వ తేదీన మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన 'గేమ్ చేంజర్' (Game Changer) జనం ముందు నిలచింది... శంకర్ (Shankar) దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మించిన ఈ సినిమా అంతగా అలరించలేక పోయింది. తరువాత రెండు రోజులకు నటసింహ బాలకృష్ణ (Balakrishna) హీరోగా బాబీ రూపొందించిన 'డాకు మహారాజ్' (Daaku Mahaaraj) ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ చూసింది. బాలయ్య మాస్ మసాలా మూవీగా సాగింది. రెండు రోజుల తరువాత జనవరి 14న విడుదలైన విక్టరీ వెంకటేశ్ (Venkatesh) చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' (Sankranthiki Vasthunnam) భలేగా సందడి చేసింది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా పొంగల్ బరిలో నంబర్ వన్ గా నిలచింది. ఏకంగా 300 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలయ్య సినిమా కూడా సక్సెస్ సాధించినా 150 కోట్లకే పరిమితమయింది. అలా సంక్రాంతి సందడిలో 'సంక్రాంతికి వస్తున్నాం' పైచేయిగా సాగింది. అయితే 'డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం' రెండూ డైరెక్ట్ గా హండ్రెడ్ డేస్ రన్ చూడబోవడం విశేషం!
మాస్ మసాలా...!
జనవరి 12వ తేదీన విడుదలైన బాలకృష్ణ 'డాకు మహారాజ్' సినిమా మొదటి రెండు రోజులు బాగా ఊపేసింది. తరువాత బాలయ్య రోటీన్ యాక్షన్ డ్రామా అంటూ ప్రేక్షకులు తేల్చేశారు. అందువల్ల పండగ తరువాత 'డాకు మహారాజ్' ఊపందుకోలేదు. కానీ, కొన్ని మాస్ ఏరియాస్ లో బాలయ్య క్రేజ్ తో బాగానే ఆడేసింది. ఆ తీరున 'డాకు మహారాజ్' చిలకలూరి పేటలో చిందులేస్తూ వందరోజుల దిశగా పరుగులు తీస్తోంది. ఈ చిత్రం ఏప్రిల్ 21తో నూరు రోజులు పూర్తిచేసుకుంటుంది. ఇప్పటికే బాలయ్య నటించిన అనేక చిత్రాలు చిలకలూరి పేటలో హండ్రెడ్ డేస్, సిల్వర్ జూబ్లీస్ చూశాయి. వాటి సరసన 'డాకు మహారాజ్' కూడా చేరనుంది.
బుల్లి రాజు మ్యాజిక్...
పొంగల్ బరిలో దిల్ రాజు ఈ సారి రెండు చిత్రాలతో దూకారు. 'గేమ్ చేంజర్' నిరాశ పరచినా, 'సంక్రాంతికి వస్తున్నాం' ఆనందం పంచింది. 'గేమ్ చేంజర్, డాకు మహారాజ్' చిత్రాలు రెండూ మాస్ మసాలాలతో నిండడం వల్ల, కామెడీతో జనానికి రిలీఫ్ ఇచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' వైపు ప్రేక్షకులు పరుగులు తీశారు. ఇందులో వెంకటేశ్ కొడుకు బుల్లిరాజు పాత్రలో కనిపించిన మాస్టర్ రేవంత్ పవన్ యాక్టింగ్ జనానికి కితకితలు పెట్టింది.. అలాగే ఐశ్వర్యా రాజేశ్ నటన అలరించింది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ కబడ్డీ ఆడేసింది. అలా పొంగల్ బరిలో నంబర్ వన్ స్టేటస్ సొంతం చేసుకుందీ చిత్రం. నంద్యాల శ్రీరామ థియేటర్ లో 'సంక్రాంతికి వస్తున్నాం' ఏప్రిల్ 23న డైరెక్ట్ హండ్రెడ్ డేస్ పూర్తి చేసుకోనుంది. అలా సంక్రాంతి చిత్రాలు రెండు నేరుగా వందరోజులు చూడడం విశేషంగా మారింది. మరి రాబోయే రోజుల్లో ఇంకా ఏ యే సినిమాలు డైరెక్ట్ హండ్రెడ్ డేస్ పూర్తి చేసుకుంటాయో చూద్దాం.
Also Read: Sunny Deol: జాట్ -2 పై నీలినీడలు
Also Read: Kollywood: కార్తీ చేతిలో ఆరు చిత్రాలు...
Also Read: Chiranjeevi: మెగా డ్యాన్స్ పోటీల సంబరాలు
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి