Heroine Samantha: విజయాన్ని ఆస్వాదించాను
ABN , Publish Date - May 17 , 2025 | 01:12 AM
కేవలం 10 శాతం విజయావకాశాల మధ్య ‘శుభం’ సినిమాను నిర్మించిన సమంత, నిర్మాతగా తొలి విజయాన్ని ఆస్వాదించానని తెలిపారు. హారర్ కామెడీగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకాదరణ పొందడంతో ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
సమంత
‘పది శాతం మాత్రమే విజయావకాశాలు ఉన్న ఇండస్ట్రీలో చిత్ర నిర్మాణం కరక్టేనా అని ఆలోచిస్తూనే ‘శుభం’ సినిమా తీశాను. ప్రేక్షకులు ఆదరించారు. ఆ విజయాన్ని ఆస్వాదించాను. అలాంటి విజయానికి ఎవరైనా బానిసవుతారు. అందుకే నిర్మాతలు సినిమాలు తీస్తున్నారేమో’ అని అన్నారు నటి సమంత. స్వీయ నిర్మాణంలో సమంత అతిథి పాత్ర పోషించిన చిత్రం ‘శుభం’. ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించారు. గవిరెడ్డి శ్రీనివాస్, శాలిని, శ్రీయ కొంతం, చరణ్ పేరి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ హారర్ కామెడీ సినిమా ఇటీవలె విడుదలై మంచి ప్రేక్షకాదరణతో థియేటర్లలో రన్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన సక్సెస్ మీట్‌లో సమంత మాట్లాడుతూ ‘నటిగా నా సినిమాలు విడుదలైనప్పుడు రివ్యూ్‌సలో నా పాత్రకు సంబంధించినంత వరకే చూసుకునే దానిని. ఆ స్వార్థం నాకుండేది. కానీ నిర్మాతగా తొలిసారి ప్రతి రివ్యూను ఆసాంతం చదువుకున్నాను. కుటుంబమంతా కలసి చూసే మంచి సినిమాలు తీయటమే నా లక్ష్యం’ అని అన్నారు. చిత్ర దర్శకుడు ప్రవీణ్ మాట్లాడుతూ ‘నటులు అద్భుతంగా నటిస్తే సినిమా యాభై శాతం విజయం సాధించినట్లే. అందరూ కొత్తవారైనప్పటికీ ఈ సినిమాలో బాగా నటించారు. విజయవంతమైన ఇలాంటి సినిమాలు మిగతా నిర్మాతలకు చాలా ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి. ప్రతీ భాషలో రిమేక్ చేసే కథ ఇది. మంచి సినిమా చేశామనే సంతృప్తి మాకు కలిగింది’ అని అన్నారు.