కాలం నాలో చాలా మార్పులు తెచ్చింది

ABN, Publish Date - May 07 , 2025 | 01:43 AM

‘ఒక నటిగా, మనిషిగా కాలం నాలో చాలా మార్పులు తెచ్చింది. ఇటీవల నా జీవితంలో జరిగిన విషయాలను బట్టి ఒక్కటి మాత్రం నాకు బాగా అర్థమైంది... వ్యక్తిగత జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగంగా...

‘ఒక నటిగా, మనిషిగా కాలం నాలో చాలా మార్పులు తెచ్చింది. ఇటీవల నా జీవితంలో జరిగిన విషయాలను బట్టి ఒక్కటి మాత్రం నాకు బాగా అర్థమైంది... వ్యక్తిగత జీవితాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగంగా చర్చనీయాంశం చేయకూడదని. ఇకపై నా పర్సనల్‌ లైఫ్‌ గురించి బయటెక్కడా స్పందించను’ అని సమంత అన్నారు. స్వీయ నిర్మాణంలో ఆమె అతిథి పాత్రను పోషించిన చిత్రం ‘శుభం’. ప్రవీణ్‌ కండ్రేగుల దర్శకుడు. ఈ నెల 9న విడుదలవుతున్న సందర్భంగా సమంత సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు.

  • ఒక సినిమా విడుదలవరకూ వచ్చిందంటే దాని వెనుక ఎంత కష్టం ఉంటుందో తొలిసారి తెలిసొచ్చింది. నా చిత్రబృందంపైన మరింత గౌరవం పెరిగింది. వాళ్లంతా వారం రోజులుగా నిద్రపోకుండా పనిచేస్తున్నారు. ఇదంతా చూశాకే సినిమా తీయడం ఎంత కష్టమో నాకు అర్థమైంది. వాళ్లను చూస్తుంటే నా కెరీర్‌ తొలినాళ్లు గుర్తుకు వచ్చాయి. ‘ఏం మాయ చేశావే’ సినిమా వచ్చి పదిహేనేళ్లవుతోంది. ఇన్నేళ్లలో నా జీవితంలో చాలా జరిగాయి. ఈ సినిమా మరోసారి నా మూలాలను నాకు గుర్తు చేసింది.


మంచి సినిమా ఇవ్వాలని ప్రయత్నించాం

  • నటిగా నాకు మంచి పేరు ప్రఖ్యాతలు వ చ్చాయి. అభిమాన గణం ఏర్పడింది. నా జీవితాంతం నటిగానే కొనసాగుతాను అనుకున్నాను. అయితే అనారోగ్యంతో సినిమాలకు దూరమవ్వాల్సి వచ్చింది. నేను నటిగా మళ్లీ సెట్‌లోకి అడుగుపెడతానో లేదో కూడా అప్పుడు తెలియదు. బాగా దిగులుపడ్డాను. అప్పుడు నాలో ఒక ఆశారేఖను వెతుక్కోవాల్సి వచ్చింది. నా అంతరాత్మ చెప్పిన మాట విన్నాను. చేయాల్సింది చాలా ఉంది అనిపించింది. అలా నిర్మాతగా మారాను. ‘బ్రౌన్‌ గర్ల్‌ ఇన్‌ ద రెయిన్‌’ అని నా చిన్నప్పుడు ఒక కవిత ఉండేది. దాని స్ఫూర్తితో ట్రాలాలా మూవింగ్‌ పిక్చర్స్‌ అని మా బేనర్‌కు పేరు పెట్టాం. నేను ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఏళ్లు అయింది. చాలా తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ఆ అనుభవంతో ఎనిమిది నెలల్లో ఒక సినిమాను షూట్‌ చేసి విడుదలకు సిద్ధం చేశాం. షూటింగ్‌ పూర్తి చేసేంతవరకూ బయటకు చెప్పలేదు. ఎక్కువగా మాట్లాడకుండా పనిచేసి, మంచి సినిమా ఇద్దామని ప్రయత్నించాం. ఇదొక సింపుల్‌ హారర్‌ కామెడీ అని చెప్పవచ్చు.


సినిమా చూస్తే తెలుస్తుంది

  • దర్శకుడు గౌతమ్‌మీనన్‌ గారు ‘ఏం మాయ చేశావో’ చిత్రంతో నాకు నటిగా అవకాశం ఇచ్చారు. ఆయన అడిగితే అప్పట్లో పెద్ద హీరోయిన్లు ఆ సినిమాలో చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ కొత్తవాళ్లకు అవకాశమిచ్చి ఆయన రిస్క్‌ చేశారు. కొత్త కథలు చెప్పడంతో పాటు కొత్తవాళ్లకు అవకాశమివ్వడం నా బాధ్యత అనిపించింది. నా సొంత చిత్రాల్లో నటించకూడదు అనే నియమం పెట్టుకున్నాను. సినిమాలో నేనే లీడ్‌రోల్‌ చేయవచ్చు. కానీ అందరికీ అవకాశాలు రావాలి. అందుకే నా తొలి సినిమాలో నేను నటించకూడదు అనుకున్నాను. కానీ ఇందులో నేను అతిథి పాత్ర చేయాల్సి వచ్చింది. తొలుత ఎవ్వరినైనా అడుగుదామనుకున్నాను. తొలి సినిమాకే సాయం చేయమని అడగడానికి నాకు మనసురాలేదు. నేను చేస్తానని కూడా ఎవ్వరూ ఊహించలేదు. పాత్ర చిన్నదే అయినా చాలా ప్రభావం ఉంటుంది.

  • నిర్మాతగా తొలి చిత్రమే అయినా నాకు చాలా నేర్పింది. నేను గతంలో నిర్మాతల పట్ల మరింత బాధ్యతతో ఉండి ఉండాల్సిందేమోనని అనిపించింది. వారిపై గౌరవం పెరిగింది. సమయం వృథా కావడం వల్ల నిర్మాతకు చాలా నష్టం జరుగుతుంది. ఈ సినిమాకు ఎక్కువ తక్కువ అని కాకుండా సినిమా డిమాండ్‌ చేసినంతమేర ఖర్చు చేశాం. ముందనుకున్న బడ్జెట్‌ కన్నా కొంచెం ఎక్కువ అయింది తప్ప పూర్తిగా అదుపు తప్పలేదు.

హీరోయిన్‌గా చేసినప్పుడూ ఫలితంపై టెన్షన్‌ ఉండేది కానీ నిర్మాతగా అనే సరికి ఇంకొంచెం ఎక్కువగా ఉంది. ప్రివ్యూలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. కథ బాగా వచ్చింది కాబట్టి మంచి సినిమాగా నిలుస్తుందనే నమ్మకం ఉంది.


నిర్మాతగా తొలి సినిమాకే సమంత శుభం కార్డు వేశారంటూ చాలా మీమ్స్‌ వస్తున్నాయి. ఈ కథ కూడా సుదీర్ఘంగా సాగే సీరియల్‌ నేపథ్యంలో ఉండడంతో శుభం కార్డుకు ప్రాధాన్యం ఉంది. మామూలుగా ‘శుభం’ అనే టైటిల్‌ కార్డు సినిమాకు ముగింపులో వేస్తారు. కానీ దాన్ని ఈసినిమాకే టైటిల్‌గా ఎందుకు పెట్టాం అనేది సినిమా చూస్తే ప్రేక్షకులకు తెలుస్తుంది.

నా దృష్టిలో హీరో అయినా హీరోయిన్‌ అయినా ఒక్కటే. పారితోషికాల్లో లింగవివక్ష చూపడం మొదట్నుంచి నాకు ఇష్టం లేదు. ఒకే స్థాయి అనుభవం, నైపుణ్యాలు ఉన్న వ్యక్తులకు ఒకే స్థాయి పారితోషికం అనేదాన్ని నేను సమర్థిస్థాను. అది నిజమైతే చూడాలని ఆశపడ్డా. ఈ సినిమాతో దాన్ని నిజం చేశాను. మా బృందంలోని మహిళా టెక్నీషియన్లకు కూడా సమానంగా పారితోషికం ఇచ్చాను. ఈ సినిమాకు అలా కుదిరింది. అయితే అన్ని సినిమాలకు అలా కుదురుతుందా అంటే కష్టమే.

Updated Date - May 07 , 2025 | 01:43 AM