తారకరామ నామం సదా స్మరామి
ABN , Publish Date - May 28 , 2025 | 04:49 AM
ఆపరేషన్ సిందూర్ ప్రజలందరిలోనూ దేశభక్తిని తట్టిలేపింది. యుద్ధంలో అమరులైన సైనికులకు దేశం యావత్తు అశ్రునివాళులు అర్పించింది. మన సైన్యం వీరత్వాన్ని తలచుకొని జాతి యావత్తు పులకించింది. వారి శౌర్యంతో...
నేడు ఎన్టీఆర్ 102వ జయంతి
ఆపరేషన్ సిందూర్ ప్రజలందరిలోనూ దేశభక్తిని తట్టిలేపింది. యుద్ధంలో అమరులైన సైనికులకు దేశం యావత్తు అశ్రునివాళులు అర్పించింది. మన సైన్యం వీరత్వాన్ని తలచుకొని జాతి యావత్తు పులకించింది. వారి శౌర్యంతో పాటు సైనికుల సంక్షేమం కోసం మహానటుడు ఎన్టీఆర్ గతంలో చేసిన ఓ మంచి పనిని సమాజానికి గుర్తుచేసింది. 1965 పాకిస్థాన్‌తో యుద్ధం సమయంలో మన సైనికుల సంక్షేమం కోసం తనవంతు బాధ్యత నెరవేర్చేందుకు నడుం బిగించిన ఎన్టీఆర్ జనాల్లోకి వెళ్లారు. విరాళాలు సేకరించి జాతీయ రక్షణ నిధికి అందించారు. అలాగే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమను పట్టి కుదిపేస్తున్న థియేటర్ల వ్యవహారం కాస్తా రచ్చకెక్కిన విషయం చూస్తున్నాం. కానీ తన నాయకత్వ ప్రతిభతో ఒకప్పుడు ఇండస్ట్రీని ఏకతాటిపై నడిపించారు ఎన్టీఆర్. పరిశ్రమకు ఏ ఇబ్బంది వచ్చినా పెద్దదిక్కుగా ఉండి పరిష్కరించడంలో ముందుండేవారు. కానీ, ఇప్పుడు ఏదీ ఆ నాటి ఎన్టీఆర్ స్ఫూర్తి? ఓటీటీ ప్రభావంతో ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదనేది చాలాకాలంగా వినిపిస్తోంది. దీనివల్ల సింగిల్ స్ర్కీన్ల నిర్వహణభారంగా మారి పెద్ద సంఖ్యలో థియేటర్లు మూతపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా అన్న ఎన్టీఆర్‌నే పరిశ్రమ గుర్తుచేసుకుంటోంది.
పాత చిత్రాలతో బాక్సాఫీస్‌కు కళ
ఆ రోజుల్లో సింగిల్ థియేటర్స్ వారికి ఎన్టీఆర్ రిపీట్ రన్ మూవీస్ శ్రీరామరక్షగా ఉండేవి. ఎంత పెద్ద థియేటర్ అయినా, ఎంత కొత్త సినిమా హాలయినా గ్యాప్ వస్తే చాలు వెంటనే ఎన్టీఆర్ పాత చిత్రాలు ప్రదర్శించేవారు. ఎన్టీఆర్ పాత సినిమాలు సైతం మంచి వసూళ్లు చూసేవి. దాంతో థియేటర్లకు నష్టం వాటిల్లేది కాదు. పైగా ఆ రోజుల్లో సినిమా పరిశ్రమను నమ్ముకున్న వారి కోసం ఎన్టీఆర్ ఏడాదికి ఏడు, ఎనిమిది సినిమాలు తగ్గకుండా చేసేవారు. ఒకదశలో పదికి పైగా చిత్రాలలోనూ ఆయన నటించిన సందర్భాలున్నాయి. అలా థియేటర్లకు నష్టాలు వాటిల్లకుండా చూడడంలోనూ ఎన్టీఆర్ సినిమాలే ఆదరువుగా నిలిచాయి. కానీ, ఈ తరం హీరోలు, ముందు తరం కథానాయకులు సైతం ఏడాదికో, రెండేళ్లకో ఒక సినిమా చేస్తున్న పరిస్థితులున్నాయి. పైగా సినిమాలకు పెనుభూతంగా ఓటీటీ బయలు దేరింది. చిన్నా చితకా సినిమాలు వస్తున్నాయి కానీ, అవేవీ థియేటర్లను ఆదుకొనే పరిస్థితుల్లో లేవు. ఈ నేపథ్యంలో అగ్రకథానాయకులు కనీసం సంవత్సరానికి రెండు సినిమాల్లోనైనా నటించవలసిన పరిస్థితి ఏర్పడింది. చిత్రపరిశ్రమ క్లిష్టపరిస్థితుల్లో ఉన్నప్పుడు రామారావు ఎన్నో సార్లు ఆదుకున్న దాఖలాలున్నాయి. తన తరువాతి తరం హీరోలకు సైతం ఎక్కువ సినిమాల్లో నటించమని, అప్పుడే పరిశ్రమ బాగుపడుతుందని చెప్పేవారు ఎన్టీఆర్. ఆయన మాటకు గౌరవమిస్తూ తరువాతి తరం హీరోలు ముందుకు సాగారు. కానీ, ఈనాడు ఆ రీతిన పిలుపునిచ్చేవారెక్కడ?అంత పెద్దరికం ఎవరిలో ఉంది?
ఎన్టీఆర్ జైత్రయాత్ర...
ఎన్టీఆర్‌ను ఈ విషయాల్లోనే తలచుకోవడం కాదు ఆ రోజుల్లో సినిమా థియేటర్లకు ఫీడింగ్ అంటే రామారావు సినిమాలే! ఇతర హీరోలవి ఎంత పెద్ద విజయాలు సాధించినా, ఎన్టీఆర్ స్థాయిలో వసూళ్ళు చూసేవి కావు. అందువల్ల ఆయన యేడాదికి పదికి తక్కువ కాకుండా నటించారు. యాభై ఏళ్ళు పైబడ్డ తరువాత కూడా సంవత్సరానికి ఏడెనిమిది సినిమాల్లో నటిస్తూ సాగారు రామారావు. ఇక ఆయన స్టార్ డమ్ ‘పాతాళభైరవి’తో తిరుగులేని జానపద నాయకునిగానూ, ‘మాయాబజార్’ తరువాత పౌరాణికాలంటే రామారావే అనే రీతిలోనూ జైత్రయాత్ర చేశారు. అంతకు ముందు జానపద కథానాయకులుగా వెలిగిన వారు, పౌరాణికాల్లో రాణించినవారు వేరే దారి చూసుకోవలసి వచ్చింది. ‘నిప్పులాంటి మనిషి’ రీమేక్‌తో గ్రాండ్ సక్సెస్ చూసిన ఎన్టీఆర్ యాభై ఏళ్ల తరువాత కూడా స్టార్స్‌గా రాణించవచ్చునని దేశంలోని నటులందరికీ నిరూపించి చూపించారు. ఆ సినిమా ఒరిజినల్ ‘జంజీర్’లో నటించిన అమితాబ్ మాత్రం యాభై తరువాత కేరెక్టర్ రోల్స్‌కు మారారు. ఎన్టీఆర్ స్ఫూర్తితోనే ఆరవై ఏళ్ళు దాటినా హీరోలుగా సాగుతున్న మన స్టార్స్‌ను చూస్తూనే ఉన్నాం. ఆయన సినీ రంగ నిష్క్రమణ తరువాత టాప్ స్టార్స్‌గా వెలిగిన నటులు కూడా ఆయన సినీ రంగంలో ఉన్నప్పుడు కేవలం సైడ్ పాత్రలకు, చిన్న సినిమాలకే పరిమితమయ్యారన్న విషయం అందరికీ తెలిసిందే.
అన్ని రికార్డులూ ఆయనవే
ఇక తెలుగునాట స్టార్‌గా ఎన్టీఆర్ విజయాలకు, రికార్డులకు కొదువే లేదు. ‘పాతాళభైరవి’తో 30 థియేటర్లలో వందరోజులు అవలీలగా సాధించడం ఎవరి వల్లా కాలేదు. మరో ఆరుసార్లు ఆ సక్సెస్ మార్కును ఎన్టీఆరే సాధించగలిగారు గాని ఇతరులు ఎవరికీ సాధ్యం కాలేదు. ఈయన పరిశ్రమవదలి వెళ్లిన పదేళ్ల తరువాత టాక్స్ రాయితీలు ఇస్తేనే ఇతర హీరోలకు 30 థియేటర్లలో సెంచరీ సాధ్యమైంది. ఎన్టీఆర్ చిత్రసీమలో ఉండగా కోటి రూపాయలు వసూళ్లు చూసిన సినిమాలు మొత్తం 16 కాగా, అందులో 13 ఈయనవే! మొదటివారం రూ.23 లక్షలు ఓపెనింగ్ చూసిన చిత్రాలు ఎన్టీఆర్‌వి 12 సినిమాలు కాగా, ఎన్టీఆర్ సినీరంగంలో ఉన్నంత వరకు తెలుగులో మరే హీరోకూ ఒకటి కూడా లేకపోవడం గమనార్హం! ఆ సమయంలో ఎన్టీఆర్ సినిమాల ఓపెనింగ్స్ రూ.23 లక్షల నుంచి రూ. 71 లక్షల రూపాయల దాకా వెళ్లినా కూడా ఇతరులెవరికీ రూ. 23 లక్షలు ఓపెనింగ్ లేకపోవడం, అంటే మూడో వంతు ఓపెనింగ్ కూడా లేకపోవడం గమనించదగ్గ అంశం. ఇలా ఎటు చూసినా ఎన్టీఆర్ నామాన్ని స్మరించడం అన్నది తెలుగువారికి, తెలుగు చిత్రపరిశ్రమకు రివాజుగా మారింది. అందుకే ‘తారకరామ నామం సదా స్మరామి’!
కొమ్మినేని వెంకటేశ్వర రావు