Allu Arjun: అట్లీ మూవీ పోస్టర్ పై విమర్శలు
ABN , Publish Date - Apr 09 , 2025 | 03:38 PM
అల్లు అర్జున్, అట్లీ మూవీ వీడియో సూపర్ హిట్ అయిన సందర్భంగా సన్ పిక్చర్స్ విడుదల చేసిన పోస్టర్ పై విమర్శలు వెల్లువెత్తాయి. హాలీవుడ్ మూవీ పోస్టర్ ను యథాతథంగా వాడేశారంటూ నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun), ప్రముఖ దర్శకుడు అట్లీ (Atlee) మూవీకి సంబంధించిన ప్రకటన ఏప్రిల్ 8న వచ్చింది మొదలు... సోషల్ మీడియాలో దానికి సంబంధించిన వార్తలే ఎక్కువగా హల్చల్ చేశాయి. సన్ పిక్చర్స్ (Sun Pictures) సంస్థ హాలీవుడ్ రేంజ్ లో ఈ మూవీని నిర్మించబోతోందని మంగళ వారం విడుదల చేసిన వీడియోతో అందరికీ అర్థమైంది. ఐకాన్ స్టార్ (Icon Star) అభిమానులంతా... ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ కు సంబంధించిన స్టిల్స్ ను, వీడియోను చూసి మీసాలు తిప్పేశారు. కానీ ఇదే సమయంలో మూవీకి సంబంధించిన వీడియోకు ఆరు మిలియన్ వ్యూస్ వచ్చాయని ప్రకటిస్తూ సన్ పిక్చర్స్ విడుదల చేసిన పోస్టర్ పై పలువురు విమర్శలు గుప్పించారు. క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న అట్లీ మరీ ఇంత దారుణంగా హాలీవుడ్ మూవీ 'డ్యూన్' (Dune) పోస్టర్ ను ఎత్తేశాడేమిటీ? అని సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. నిజం చెప్పాలంటే సినిమా వాళ్ళకు క్రియేటివిటీ తక్కువే అని... ఇతర సినిమాల నుండి, ఇతరుల కథల నుండి కాపీ కొట్టి అదేదో తమకు తట్టిన ఆలోచన అన్నట్టుగా ప్రచారం చేసుకుంటారని కొందరు విమర్శించారు. 2021లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'డ్యూన్' మంచి విజయాన్ని సాధించింది. ఆ సినిమా పోస్టర్ ను కలర్ ప్యాట్రన్ తో సహా యథాతథంగా ఎత్తి వేయడాన్ని పలువురు తప్పు పడుతున్నారు.
ఇదిలా ఉంటే... గతంలోనూ అట్లీ కాపీ క్యాట్ విమర్శలకు లోనయ్యాడు. అయితే... అందరిలానే అతనూ దానిని సమర్థించుకున్నాడు. తాను ఎప్పుడూ కాపీకి పాల్పడనని, ఏదైనా సందర్భంలో ఇన్ స్పిరేషన్ పొంది ఉండొచ్చని తెలిపారు. రెండున్నర గంటల పాటు ఉండే సినిమాలో రెండు, మూడు నిమిషాల సన్నివేశాలను ఉదహరిస్తూ... కొందరు కాపీ కొట్టినట్టు విమర్శిస్తుంటారని వాపోయాడు. తనకు ఎంజీఆర్ అంటే ఇష్టమని, ఆయనపై తీసే ఇంట్రడక్షన్ సాంగ్స్ స్ఫూర్తితోనే తానూ తన సినిమాలలో అలాంటి పాటలు పెడుతుంటానని చెప్పాడు. అయితే అట్లీ తెరకెక్కించిన 'తేరి' (Theri) సినిమా పలు విమర్శలకు కేంద్రబిందువుగా మారింది. గతంలో వచ్చిన పోలీస్ స్టోరీస్ లోని అంశాలనే ఇందులోనూ అతను పెట్టేశాడని చాలామంది విమర్శించాడు. వీటినీ అట్లీ ఖండించాడు. తన ప్రతిభను గుర్తించే షారుఖ్ ఖాన్ వంటి స్టార్ హీరో 'జవాన్' చిత్రం తీసే ఛాన్స్ ఇచ్చాడన్నది అట్లీ వాదన. ఏది ఏమైనా... జాతీయ స్థాయిలో వచ్చిన పేరును నిలబెట్టుకోవాల్సిన అవసరం అయితే అట్లీకి ఉంది. పైగా ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడంటే... అందరి కళ్ళు అతని మీదనే ఉంటాయి. రాబోయే రోజుల్లో అయినా... ఇలాంటి కాపీ పోస్టర్స్, కాపీ సీన్స్ జోలికి అట్లీ వెళ్ళకుండా ఉంటే బెటర్ అని నెటిజన్స్ సలహా ఇస్తున్నారు.
Also Read: Manchu Vishnu: యోగి ఆవిష్కరించిన కన్నప్ప రిలీజ్ డేట్ పోస్టర్
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి