వ్యక్తిగత హోదాతో సంప్రదింపులకు పవన్‌ చెక్‌

ABN , Publish Date - May 28 , 2025 | 04:35 AM

కొత్త చిత్రాల విడుదల సందర్భంలో టికెట్‌ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని...

  • ‘హరిహర వీరమల్లు’ ధరల పెంపునకూ ఇదే నిబంధన

కొత్త చిత్రాల విడుదల సందర్భంలో టికెట్‌ ధరల పెంపు నిమిత్తం నిర్మాతలు, వారికి సంబంధించిన వారు వ్యక్తిగత హోదాలో కాకుండా తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించే విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ దిశానిర్దేశం చేశారు. సినిమా హాళ్ల బంద్‌ ప్రకటన, ఈ క్రమంలో తమ శాఖ ద్వారా చేపట్టిన చర్యలను, తాజా పరిణామాలను రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ ఉప మఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌కు మంగళవారం వివరించారు. ఈ సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ పలు కీలక సూచనలు చేశారు. త్వరలో విడుదలయ్యే ‘హరిహర వీరమల్లు’ సినిమాకు టికెట్‌ ధరల పెంపు కోసం నిర్మాత వ్యక్తిగతంగా కాకుండా చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే ప్రభుత్వాన్ని సంప్రదించాలనీ, ఇందులో తన మన భేదాలు పాటించవద్దని సృష్టంగా చెప్పారు.

ప్రేక్షకులు సినిమా హాల్‌ వరకూ రావాలంటే..?

రాష్ట్ర వ్యాప్తంగా మల్టీప్లెక్సులు, సింగిల్‌ స్ర్కీన్స్‌లో ఆహార పదార్థాలు, శీతల పానీయాల వ్యాపారంలోనూ గుత్తాధిపత్యం సాగుతోందనే విషయం కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చినందున దీనిపై విచారణ చేపట్టాలని సినిమాటోగ్రఫీ శాఖ మంత్రికి పవన్‌కల్యాణ్‌ సూచించారు. ప్రేక్షకులు కుటుంబ సమేతంగా సినిమా హాళ్లకు రావాలంటే తినుబండారాలు, పానీయాల ధరలు చూసి వెనుకంజ వేసే పరిస్థితి రాకూడదని పవన్‌ అభిప్రాయపడ్డారు.


సినిమా హాళ్ల బంద్‌ నేపథ్యంలో...

థియేటర్ల బంద్‌ అంశంపై చేపట్టిన విచారణ పురోగతిని మంత్రి దుర్గేశ్‌ డిప్యూటీ సీఎంకు వివరించారు. బంద్‌ ప్రకటన వెనుక జనసేనాయకుడు ఉన్నారని ఒక నిర్మాత మీడియా ముందు ప్రకటించిన విషయంపైనా చర్చించారు. ఈ ప్రకటన వెనుక ఒక సినీ నిర్మాత, సినిమా హాళ్లు కలిగిన ఒక రాజకీయ నాయకుడి ప్రమేయం ఉన్నాయని సినిమా వర్గాలు చెబుతున్న క్రమంలో ఈ కోణంలో కూడా విచారణ చేయించాలని ఆయన మంత్రికి సూచించారు. థియేటర్ల బంద్‌కు కారకుల్లో జనసేన తరపువాళ్లు ఉన్నా చర్యలకు వెనుకాడవద్దని ఆదేశించారు. నిర్మాతలను, నటులను, దర్శకులను బెదిరింపు ధోరణిలో దారికి తెచ్చుకొని వ్యాపారాలు సాగించాలనుకోనే అనారోగ్యకర వాతావరణానికి తావు ఇవ్వకుండా సినిమా వ్యాపారం సాగించే ప్రోత్సాహకర పరిస్థితులను ప్రభుత్వం తీసుకువస్తుందనే విషయాన్ని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలికి, నిర్మాతల మండలికి, మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌, దర్శకుల సంఘాలకు తెలియజేయాలన్నారు.

అమరావతి (ఆంధ్రజ్యోతి)



Updated Date - May 28 , 2025 | 04:35 AM